రైతు‘బేజారు’
ABN , Publish Date - Dec 28 , 2023 | 01:05 AM
జాతీయ రహదారుల సంస్థ కళ్లు మూసుకోవటంతో రామవరప్పాడులో ఎన్‌హెచ్-16 వెంబడి ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. రామవరప్పాడు రింగ్ దాటాక, రైల్వేస్టేషన్ వంతెన పక్కన ఎన్‌హెచ్ వెంబడి స్థలంలో రైతుబజార్ నిర్మాణం పనులు చకచకా జరుగుతున్నాయి.
అసలే ట్రాఫిక్ ఇబ్బందులు.. ఆపై రైతుబజార్ నిర్మాణమట..
రైల్వేస్టేషన్ ప్రయాణికులు, వాహనాలతో నిత్యం కిటకిట
రాజకీయ ఒత్తిళ్లతో సమస్యలను పక్కనపెట్టిన మార్కెటింగ్ శాఖ
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : జాతీయ రహదారుల సంస్థ కళ్లు మూసుకోవటంతో రామవరప్పాడులో ఎన్‌హెచ్-16 వెంబడి ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. రామవరప్పాడు రింగ్ దాటాక, రైల్వేస్టేషన్ వంతెన పక్కన ఎన్‌హెచ్ వెంబడి స్థలంలో రైతుబజార్ నిర్మాణం పనులు చకచకా జరుగుతున్నాయి. ఇది చూసిన కొందరు ఇక్కడ ఆలయాలు కూడా నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు. ఆటో అసోసియేషన్లు షెడ్డు కూడా ఏర్పాటు చేశాయి. ఇప్పటికే ఎనికేపాడు, ప్రసాందంపాడులో నిర్మాణాలు ఫుట్‌పాత్ దాటి వచ్చాయి.
రైతుబజారుకు అనుమతులు ఎలా..?
స్థానికుల డిమాండ్ మేరకు ఇక్కడ రైతుబజార్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. దాని ఏర్పాటుకు జాతీయ రహదారిని ఎంచుకోవడమే వివాదాస్పదంగా మారింది. ఎన్‌హెచ్ ఫుట్ పాత్‌ను ఆనుకుని ఉన్న కొద్దిపాటి స్థలంలో దీని నిర్మాణం చేపడుతున్నారు. ఓవైపు జాతీయ రహదారి ఉండగా, మరోవైపు రైవస్ కాల్వ ఉంది. ఇలాంటి స్థలంలో రైతుబజార్ నిర్మాణం నిబంధనలకు విరుద్ధమే. ఎన్‌హెచ్‌తో పాటు ఇరిగేషన్ శాఖ అనుమతులు కూడా తీసుకోకుండా మార్కెటింగ్ శాఖ అధికారులు దీనిని నిర్మిస్తున్నారు. మార్కెటింగ్ శాఖ అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు నెలకొనటంతో ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపడుతున్నారు.
మరిన్ని ఆక్రమణలు
రైతుబజార్ నిర్మాణ పనులను చూసి మరికొందరు చిన్నపాటి బడ్డీకొట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఏకంగా ఎన్‌హెచ్-16 గ్రీన్ ఐల్యాండ్ మధ్యే ఆటోవాలాలు తమ షెల్టర్ కోసం షెడ్డు వేసుకున్నారు. ఇలా విజయవాడ నగర ప్రవేశ మార్గం అంతా అధ్వానంగా మారిపోతోంది.
ఇరుకిరుగ్గా..
రైతుబజారుకు వచ్చే వారంతా వాహనాలు పెట్టడానికి పార్కింగ్ స్థలం కూడా లేదు. ఈ వాహనాలన్నీ జాతీయ రహదారిపైనే నిలపాల్సి ఉంటుంది. రామవరప్పాడు జంక్షన్ నుంచి నిడమానూరు వరకు దాదాపు ఎన్‌హెచ్ చాలా రద్దీగా ఉంటుంది. ఫుట్‌పాత్‌లను ఆనుకుని నిర్మాణాలుంటాయి. హైవేపై విపరీతమైన రద్దీ ఉంటుంది. ఒక వరసలో బస్సో, కారో ఆగిపోతే కిలోమీటరుపైనే ట్రాఫిక్ నిలిచిపోయే పరిస్థితి. రామవరప్పాడు రింగ్ నుంచి నిడమానూరు వరకు మేజర్, నాన్ మేజర్ జంక్షన్లు 15 వరకు ఉన్నాయి. వీటివల్ల ఈ ప్రాంతంలో వాహనాలు ముందుకు కదలటానికి వీల్లేని పరిస్థితి. సర్వీసు రోడ్లు లేకపోవటం వల్ల రింగ్ నుంచి నిడమానూరు ఫ్లిప్‌కార్ట్ మాల్ వరకు కాలనీల్లోకి వెళ్లేందుకు రెండువైపులా అంతర్గత రహదారులపై రాకపోకల వల్ల కూడా ట్రాఫిక్ స్తంభిస్తోంది. రైవస్, ఏలూరు కాల్వల మధ్య ఉన్న రామవరప్పాడు రైల్వేస్టేషన్ నుంచి పెద్ద ఎత్తున ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. దీనివల్ల ఉదయం, సాయంత్రం, రాత్రిపూట రద్దీ ఎక్కువగా ఉంటోంది. రైతుబజార్ నిర్మాణంతో ఈ ప్రాంతం మరింత ఇరుగ్గా తయారయ్యే ప్రమాదముంది.