Share News

రోడ్లు ప్రమాదాలు .. సర్కారు హత్యలే

ABN , First Publish Date - 2023-11-20T01:27:48+05:30 IST

రాష్ట్రంలో అధ్వాన రోడ్ల వల్ల జరిగిన ప్రమాదాల్లో మరణాలు జగన్మోహన్‌ రెడ్డి సర్కారీ హత్యలుగానే పరిగణించాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.

 రోడ్లు  ప్రమాదాలు .. సర్కారు హత్యలే

రెడ్డిగూడెం/మైలవరం/జి.కొండూరు, నవంబరు 19 : రాష్ట్రంలో అధ్వాన రోడ్ల వల్ల జరిగిన ప్రమాదాల్లో మరణాలు జగన్మోహన్‌ రెడ్డి సర్కారీ హత్యలుగానే పరిగణించాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ‘రాష్ట్రానికి దారేది’ కార్యక్రమంలో భాగంగా మిట్టగూడెం సెంటర్‌ నుంచి రెడ్డిగూడెం వరకు టీడీపీ, జనసేన నాయకులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. మిట్టగూడెం సెంటర్లో రహదారి గుంతలను స్వయంగా ఉమా, గాంధీ, కె.విజయబాబు, ముప్పిడి నాగేశ్వర రెడ్డి, బొమ్మిన కోటేశ్వరరావులు పూడ్చారు. ఈ సందర్భంగా మోటార్‌ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. కొత్త రోడ్లు వేయలేని వైసీపీ ప్రభుత్వం టీడీపీ హయాంలో వేసిన రోడ్లకు పడిన గుంతలను సైతం పూడ్చలేని దయనీయ స్థితిలో ఉందన్నారు. టీడీపీ నేతలు జానలపాటి వేణుగోపాల రెడ్డి, కుప్పిరెడ్డి అశోక్‌ రెడ్డి, చేబ్రోలు రాజు, కామిశెట్టి వెంకట నరసయ్య, రాయుడు వెంకటేశ్వరరావు, అయ్యంకి బాలస్వామి, జనసేన నేతలు పాములపాటి సుందర్రామిరెడ్డి, చాపలమడుగు కాంతారావు, ఆకుల శేషగిరి, చేబ్రోలు సుభాష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఫ మైలవరం రాజాపేటలో ‘బాబు ష్యూరిటీ భవిష్యత్‌ గ్యారెంటీ’ కార్యక్రమంలో భాగంగా ఉమా ప్రజలకు కర పత్రాలను పంచారు. సూపర్‌ సిక్స్‌ పథకాలను వివరించారు. మల్లెల రాధాకృష్ణ, లంక లితీష్‌, మైకు బాబురావు తదితరులు పాల్గొన్నారు.

ఫ జి.కొండూరులో పార్వతీ సమేత అమృత లింగేశ్వరస్వామి (శివాలయం)లో ఉమాస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఉయ్యూరు వెంకట నరసింహారావు, పజ్జూరు రవికుమార్‌, పజ్జూరు వెంకటేశ్వరరావు (బుల్లి), బూర్సు శివ, పజ్జూరు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

గుంతలైనా పూడ్చలేని ప్రభుత్వం : శ్రీరాం తాతయ్య

జగ్గయ్యపేట రూరల్‌ : టీడీపీ హయాంలో వేసిన రోడ్లు తప్ప ప్రస్తుత ప్రభుత్వంలో కనీసం గుంతలు కూడా పూడ్చటం లేదని దీని వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్‌ ఆరోపించారు. ఆదివారం మండలంలోని షేర్‌మహ్మద్‌పేట నుంచి గండ్రాయి వెళ్లే రహదారిపై టీడీపీ, జనసేన నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తాతయ్య మాట్లాడుతూ, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సింగిల్‌ రోడ్డు వస్తే ఆంధ్రప్రదేశ్‌ అని.. డబుల్‌ రోడ్డు వస్తే తెలంగాణా అని వ్యాఖ్యానించటం జగన్‌ చేతకానితనానికి నిదర్శనమన్నారు. ఇటువంటి ప్రభుత్వం ఉండటం ప్రజల దౌర్భాగ్యమని అన్నారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి రహదారులను అబివృద్ధి చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో టీడీపీ-జనసేన నేతలు పాల్గొన్నారు.

రోడ్లపై గుంతలు.. గాల్లో ప్రాణాలు

- వర్ల కుమార్‌రాజా, తాడిశెట్టి నరేశ్‌

మంటాడ(పమిడిముక్కల) : రాష్ట్రంలో జగన్మోహన్‌రెడ్డి చేతగాని, అవినీతి పాలనలో రోజూ రోడ్డుప్రమాదాలు జరిగి పదుల సంఖ్యలో ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయని పామర్రు టీడీపీ ఇన్‌చార్జ్‌ వర్లకుమార్‌ రాజ, జనసేన నేత తాడిశెట్టి నరేశ్‌ ఆరోపించారు. ‘గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేది’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆర్టీవో కార్యాలయం వద్ద రోడ్డుపై గుంతలవద్ద టీడీపీ-జనసేన ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రోడ్ల నిర్వహణపై వందలసార్లు రివ్యూలు చేసినా వందడుగుల రోడ్డుకూడా వేయలేని దద్దమ్మ ప్రభుత్వమని ధ్వజమెత్తారు. జగన్‌ అవినీతి, చేతగాని పాలనలో ప్రమాదాలకు గురై ప్రజల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు.

రామకృష్ణాపురం రహదారిపై..

కోడూరు : అధ్వానంగా ఉన్న కోడూరు-రామకృష్ణాపురం రహదారిపై టీడీపీ, జనసేన నేతల నిరసన కార్యక్రమంలో మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ పాల్గొన్నారు. వైసీపీ నేతల ఇసుక, బుసక అక్రమ రవాణాల వల్లే రహదారులు ధ్వంసమయ్యాయని ఆరోపించారు. ఇప్పటి కైనా ప్రభుత్వం కళ్లు తెరచి తీర గ్రామాలకు కనీస దారి వసతి ఏర్పాటు చేయాలని కోరారు. టీడీపీ-జనసేన నేతలు మండలి వెంకట్రామ్‌, మర్రె గంగయ్య, బండే శ్రీనివాసరావు, తోట దామోదర్‌, కొండవీటి సునీత, కూరాకుల ప్రసాద్‌, అద్దంకి పాండురంగారావు, దేవనబోయిన వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-20T01:27:50+05:30 IST