భయం గుప్పెట్లో..

ABN , First Publish Date - 2023-06-03T00:53:44+05:30 IST

షాలీమార్‌ నుంచి విజయవాడ మీదుగా చెన్నై బయల్దేరిన కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఘటనలో ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన ప్రయాణికులు భారీగానే ఉన్నారని తెలుస్తోంది.

భయం గుప్పెట్లో..

ఇంకా తెలియని వివరాలు

ఆందోళనలో కుటుంబ సభ్యులు

వివరాలు తెలుసుకునే పనిలో..

విజయవాడ ఆంధ్రజ్యోతి, జూన్‌ 2 : షాలీమార్‌ నుంచి విజయవాడ మీదుగా చెన్నై బయల్దేరిన కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఘటనలో ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన ప్రయాణికులు భారీగానే ఉన్నారని తెలుస్తోంది. ఒడిశాలోని బాలాసోర్‌ జిల్లా బహునాగ స్టేషన్‌ సమీపంలో గూడ్స్‌ రైలును కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. బహునాగ బజార్‌ స్టేషన్‌ మీదుగా వెళ్తున్న కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ 12 బోగీలు పట్టాలు తప్పాయి. ఇదే సమయంలో రైలు నెంబరు 12864 యశ్వంత్‌పూర్‌-హౌరా రైలు పక్క లైన్లో వెళ్తోంది. పట్టాలు తప్పిన కోరమాండల్‌ రైలు బోగీలు యశ్వంత్‌పూర్‌-హౌరా ఎక్స్‌ప్రెస్‌ భోగీలను ఢీకొట్టాయి. దీంతో యశ్వంత్‌పూర్‌-హౌరా ఎక్స్‌ప్రెస్‌ రైలుకు చెందిన మూడు భోగీలు కూడా పట్టాలు తప్పాయి. 50 మందికిపైగా మృతిచెందినట్టు తెలుస్తోంది.

వివరాలు తెలుసుకుంటున్న రైల్వే అధికారులు

హౌరా నుంచి చెన్నై బయల్దేరిన ఈ కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ చెన్నై బయల్దేరే క్రమంలో అతిపెద్ద విజయవాడ డివిజన్‌ను దాటుకుని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. విజయవాడ డివిజన్‌ గూడూరు నుంచి పలాస వరకు వ్యాపించి ఉంది. విజయవాడ డివిజన్‌ పరిధిలోని అనేక జిల్లాలకు రావడానికి ప్రయాణికులు టికెట్లు బుక్‌ చేసుకుని ఉన్నారు. అయితే, వివరాలు తెలియాల్సి ఉంది. రైల్వే అధికారులు చార్టులను పరిశీలిస్తున్నారు. ఏయే భోగీల్లో ఏ ప్రాంతానికి చెందిన ప్రయాణికులు ఉన్నారు, ఎక్కడి వారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు

రైలు ప్రమాదానికి సంబంధించి విజయవాడ డివిజన్‌ అధికారులు విజయవాడ, రాజమండ్రిలో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశారు. విజయవాడలో హెల్ప్‌లైన్‌ నెంబర్‌ రైల్వే అయితే 67055, బీఎస్‌ఎన్‌ఎల్‌ ల్యాండ్‌ నెంబర్‌ 0866-2576924, రాజమండ్రిలో రైల్వే అయితే 65395, బీఎస్‌ఎన్‌ఎల్‌ ల్యాండ్‌లైన్‌ నెంబర్‌ 08832420541 సిద్ధం చేశారు.

Updated Date - 2023-06-03T00:53:44+05:30 IST