మత సామరస్యం ప్రతిబింబించాలి

ABN , First Publish Date - 2023-03-26T00:50:27+05:30 IST

పవిత్ర రంజాన్‌ మాసాన్ని పురస్కరించుకుని ప్రార్ధనా మందిరాలు, ముస్లిం నివాసిత ప్రాంతాలలో ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌.దిల్లీరావు అధికారులను ఆదేశించారు.

మత సామరస్యం ప్రతిబింబించాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ దిల్లీరావు

కలెక్టరేట్‌, మార్చి 25 : పవిత్ర రంజాన్‌ మాసాన్ని పురస్కరించుకుని ప్రార్ధనా మందిరాలు, ముస్లిం నివాసిత ప్రాంతాలలో ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌.దిల్లీరావు అధికారులను ఆదేశించారు. రంజాన్‌ మాసంలో ముస్లిం మైనార్టీలకు ప్రత్యేక సదుపాలయాలపై శనివారం నగరంలోని కలెక్టరేట్‌ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ముస్లిం మత పెద్దలు, అధికారులతో కలెక్టర్‌ సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ, పవిత్ర రంజాన్‌ మాసం ప్రారంభమైన నేపధ్యంలో ప్రార్ధనా మందిరాలు, దర్గాల వద్ద అవసరమైన ప్రత్యేక ఏర్పాట్లను చేపట్టేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రార్ధన సమయంలో నిరంతర విద్యుత్‌ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్‌ శాఖాధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. రంజాన్‌ సందర్భంగా మసీదుల్లో అదనంగా విద్యుత్‌ వినియోగం జరుగుతుందని, విద్యుత్‌ అధికారులు విద్యుత్‌ ఓవర్‌లోడ్‌ కింద అదనపు మొత్తం చెల్లించాలని నోటీసులు ఇవ్వడం జరిగిందని, చార్జీల చెల్లింపునకు కొంత గడువు ఇప్పించవలసిందిగా ముస్లిం మత పెద్దలు కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై సంబంధిత అధికారులతో సంప్రదించి చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హామీ ఇచ్చారు. ప్రార్ధనా మందిరాల సమీపంలో పందులు, కుక్కల బెడద ఎక్కువగా ఉందని వాటిని నివారించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. సమావేశంలో నగరపాలకసంస్థ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, సబ్‌ కలెక్టర్‌ అదితి సింగ్‌, డీఆర్‌వో కె.మోహన్‌కుమార్‌, నందిగామ తిరువూరు ఆర్‌డీవోలు ఎ.రవీంద్రరావు, వైవీ.ప్రసన్నలక్ష్మి, జిల్లా మైనార్టీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ సంఝన్నీసా బేగం, డీఎ్‌సవో పి.కోమలి పద్మ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-26T00:50:27+05:30 IST