రాధారామ్ నిందితులు దొరికారు
ABN , First Publish Date - 2023-11-02T00:42:42+05:30 IST
లాభాల్లో వాటా, అధిక వడ్డీ ఆశ చూపి జనాలకు వందల కోట్లు కుచ్చు టోపీ పెట్టిన ఇద్దరు నిందితులు గుదే రాంబాబు, పెన్మెత్స కృష్ణంరాజులను హైదరాబాదు పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.
కంచికచర్ల, నవంబరు 1 : లాభాల్లో వాటా, అధిక వడ్డీ ఆశ చూపి జనాలకు వందల కోట్లు కుచ్చు టోపీ పెట్టిన ఇద్దరు నిందితులు గుదే రాంబాబు, పెన్మెత్స కృష్ణంరాజులను హైదరాబాదు పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఎన్టీఆర్ జిల్లా జి. కొండూరు మండలం దుగ్గిరాలపాడుకు చెందిన గుదే రాంబాబు దంపతులు కొద్ది సంవత్సరాల క్రితం విజయవాడ కేంద్రంగా చాక్లెట్స్, కాస్మొటిక్స్ మార్కెటింగ్ వ్యాపారం ప్రారంభించారు. అనంతరం 2021 మార్చిలో గుదే రాంబాబు మేనేజింగ్ డైరెక్టర్‌గా, అతడి భార్య రాధారాణి డైరెక్టర్‌గా ‘రాధారామ్ మార్కెటింగ్ ప్రైవైట్ లిమిటెడ్’ సంస్థగా హైదరాబాదులో రిజిష్టర్ చేయించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన పెన్మెత్స కృష్ణంరాజు సంస్థలో భాగస్వామిగా చేరాడు. సంస్థ ప్రధాన కార్యాలయం శేరిలింగంపల్లి మండలం నానక్‌రామ్‌గూడ (హైదరాబాదు)లో ఉంది. ఆహార పదార్థాలు, నిత్యావసర వస్తువుల ఆన్‌లైన్ మార్కెటింగ్ చేసేవారు. తర్వాత సంస్థ విస్తరణ పేరుతో అప్పులు చేయటం ప్రారంభించారు. రూ.5 పైగా వడ్డీతో పాటు సంస్థ లాభాల్లో వాటా ఇస్తామని పలువురికి ఆశ చూపారు. ఖరీదైన కార్లలో తిరగటం, ప్రతి నెల నమ్మకంగా వడ్డీ ఇస్తుండటంతో బంధువులు, స్నేహితులు సహా పలువురు నమ్మారు. భారీగా అప్పులివ్వటమే కాకుండా తెలిసిన వారి వద్ద రూ.2 వంతున పెద్దమొత్తంలో అప్పులు తెచ్చి మరీ ఇచ్చారు. దీనికి ఎలాంటి సెక్యూరిటీలు లేకుండా వేలం వెర్రిగా కోట్లలో అప్పులిచ్చారు. తీసుకున్న అప్పులు చెల్లించాల్సిందిగా పలువురు వత్తిడి చేయటంతో గత ఆగస్టులో వందల కోట్ల అప్పుల బాగోతం వెలుగుచూసింది. హైదరాబాదు, విజయవాడ, ఖమ్మం, గొల్లపూడి, ఇబ్రహీంపట్నం, కంచికచర్ల, దుగ్గిరాలపాడు, గంగినేని, గూడెం మాధవరం తదితర ప్రాంతాలకు చెందిన బాధితులు లబోదిబోమంటున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాదు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు ఛీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. బుధవారం రాంబాబు, కృష్ణంరాజులను అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. వ్యాపారంలో పెట్టుబడి కోసం బంధువులు, స్నేహితులు, ఇతరులు సుమారుగా రెండు వందల మంది నుంచి రూ. 530 కోట్లు వసూలు చేశారు. పెట్టుబడికి లాభం రూపంలో నెలకు ఆరు శాతం వంతున ఇస్తామని నమ్మబలికారు. మొదట్లో కొద్ది నెలలు ఆరు శాతం వంతున ఇచ్చారు. తర్వాత పెట్టుబడిదారుల నుంచి సేకరించిన అసలు సొమ్మును తిరిగి వారికే లాభాల రూపంలో ఆరు నుంచి 13 శాతం వరకు చెల్లించారు. గత ఆగస్టులో సొమ్ము చెల్లించాల్సిందిగా పెట్టుబడిదారులు ఒత్తిడి చేయటంతో నిందితులు పారిపోయారని పోలీసులు పేర్కొన్నారు. ఇద్దరు నిందితులను గచ్చిబౌలి వద్ద అదుపులోకి తీసుకుని, వారి నుంచి సుమారు రెండు కిలోల బంగారు ఆభరణాలు, నాలుగు లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. నిందితులు సేకరించిన సొమ్ములో లాభాల పేరుతో బాధితులకు రూ.427 కోట్లు చెల్లించారని, ఉద్యోగుల జీతభత్యాలు, నిర్వహణ కోసం రూ.50 కోట్లు ఖర్చు చేశారని, ఇద్దరు నిందితులు ఒక్కొక్కరు రూ.20 కోట్ల వంతున పంచుకున్నారని, కమీషన్ రూపంలో డిస్ట్రిబ్యూటర్లు, వ్యాపారులకు రూ.12 కోట్లు చెల్లించారని పోలీసులు పేర్కొన్నారు.
ఖమ్మం జిల్లాలో ఐపీ దాఖలు..
గుదే రాంబాబు, ఆయన భార్య రాధారాణి రెండు రోజుల క్రితం ఖమ్మం ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఐపీ దాఖలు చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాలకు చెందిన మొత్తం 127 మందిని ప్రతివాదులుగా చేర్చుతూ, రూ.61.76 కోట్లకు దివాలా పిటీషన్ దాఖలు చేశారు. వ్యాపార అభివృద్ధి కోసం ప్రతివాదుల వద్ద అప్పులు తీసుకున్నామని, వ్యాపారంలో నష్టాలు వచ్చాయని పిటీషన్‌లో పేర్కొన్నారు.