ఏప్రిల్‌ రేషన్‌పై సందిగ్ధం!

ABN , First Publish Date - 2023-03-31T00:12:13+05:30 IST

ఏప్రిల్‌ నెల రేషన్‌ పంపిణీలో సందిగ్ధం నెలకొంది. ఏప్రిల్‌ ఒకటో తేదీ వస్తున్నా కోటా నిత్యావసరాలు చౌక డిపోలకు ఇప్పటికీ సరఫరా కాలేదు. ఈ నెల దిగుమతి చార్జీలు కూడా స్టేజ్‌ 2 కాంట్రాక్టర్లే పెట్టుకోవాలని ప్రభుత్వం చెప్పడం, కాంట్రాక్టర్లు ససేమిరా అనడంతో సరుకుల సరఫరా నిలిచిపోయిట్టు తెలుస్తోంది.

ఏప్రిల్‌ రేషన్‌పై సందిగ్ధం!

నిలిచిపోయిన సరుకుల రవాణా

దిగుమతి చార్జీలు మోయలేమంటున్న స్టేజ్‌ 2 కాంట్రాక్టర్లు

దిగుమతి ఆపేసిన హమాలీలు

నెలాఖరు అవుతున్నా సరఫరా కాని సరుకులు

ఏప్రిల్‌ నెల రేషన్‌ పంపిణీలో సందిగ్ధం నెలకొంది. ఏప్రిల్‌ ఒకటో తేదీ వస్తున్నా కోటా నిత్యావసరాలు చౌక డిపోలకు ఇప్పటికీ సరఫరా కాలేదు. ఈ నెల దిగుమతి చార్జీలు కూడా స్టేజ్‌ 2 కాంట్రాక్టర్లే పెట్టుకోవాలని ప్రభుత్వం చెప్పడం, కాంట్రాక్టర్లు ససేమిరా అనడంతో సరుకుల సరఫరా నిలిచిపోయిట్టు తెలుస్తోంది.

విజయవాడ, మార్చి 30 (ఆంధ్రజ్యోతి) : మండల లెవల్‌ స్టాక్‌ (ఎంఎల్‌ఎస్‌) పాయింట్ల నుంచి రేషన్‌ దుకాణాలకు దిగుమతి కావాల్సిన నిత్యావసరాల దిగుమతి చార్జీలను ప్రభుత్వం భరించాలి. గత నెలలో స్టేజ్‌-2 కాంట్రాక్టర్లు భరిస్తే తరువాత చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఉమ్మడి కృష్ణాజిల్లాలో స్టేజ్‌-2 కాంట్రాక్టర్లు రూ.20 లక్షల మేర సొంత ఖర్చులు పెట్టి చౌక దుకాణాలకు దిగుమతి చేశారు. మళ్లీ ఈ నెలలో కూడా స్టేజ్‌-2 కాంట్రాక్టర్లపైనే ఆ భారం మోపటంతో.. కాంట్రాక్టర్లు తమ వల్లకాదని తేల్చి చెప్పారు. లోడింగ్‌ చేసినందుకు తమకు డబ్బులు ఎవరిస్తారని హమాలీలు దిగుమతి చేయడం లేదు. దీంతో ఏప్రిల్‌ నెల నిత్యావసరాల కోటా దిగుమతిపై అనిశ్చితి తలెత్తింది. నెలాఖరు కావస్తున్నా ఇప్పటి వరకు ఉమ్మడి కృష్ణా జిల్లాలో చౌక దుకాణాలకు ఏప్రిల్‌ నెల కోటా నిత్యావసరాలు పంపిణీ కాలేదు. చౌక దుకాణాలకు నిత్యావసరాలు వస్తేనే.. ఎండీయూ ఆపరేటర్లు వాటిని దిగుమతి చేసుకుని డోర్‌ డెలివరీ చేస్తారు.

ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం 2300 రేషన్‌ దుకాణాలున్నాయి. ఈ చౌక డిపోల నుంచి ఎండీయూ ఆపరేటర్ల ద్వారా ప్రతి నెలా కార్డుదారులకు 1.70 లక్షల క్వింటాళ్ల బియ్యం పంపిణీ చేయాలి. ప్రతి నెలా 20వ తేదీ నుంచి పంపిణీ చేస్తేనే నెలాఖరుకు పూర్తిస్థాయిలో దుకాణాలకు నిత్యావసరాలు చేరతాయి. ఏప్రిల్‌ నెలకు చూస్తే తాజా వివాదంతో మార్చి 28వ తేదీ నాటికి కూడా నిత్యావసరాలు పంపిణీ కాలేదు.

Updated Date - 2023-03-31T00:12:13+05:30 IST