వచ్చే.. వచ్చే.. వాన జల్లుల్లారా..
ABN , First Publish Date - 2023-09-22T00:19:16+05:30 IST
జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఒకమోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.
బంటుమిల్లిలో 89.2 మిల్లీమీటర్ల వర్షపాతం
నేడు కోస్తాతీరం వెంబడి వర్ష సూచన
మచిలీపట్నం,సెప్టెంబర్ 22 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఒకమోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. గురువారం ఉదయం 8.30 గంటలవరకు బంటుమిల్లిలో అత్యధికంగా 89.2 మిల్లీమీటర్లు, అత్యల్పంగా మొవ్వలో 2.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా సగటు వర్షపాతం 19.4 మిల్లీమీటర్లుగా నమోదైంది శుక్రవారం కూడా కోస్తాతీరం వెంబడి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.
జిల్లాలో వర్షపాతం ఇలా..
గన్నవరంలో 73.2 మిల్లీమీటర్లు, ఉంగుటూరులో 63.8, నందివాడలో 57.8, కృత్తివెన్నులో 36.0, గుడివాడలో 35.2, పెదపారుపూడిలో 32.6, బాపులపాడులో 21.8, గూడూరులో 12.8, పెనమలూరులో 104, కంకిపాడులో 10.2, మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాభావం కారణంగా సాగునీటి కాలువల ద్వారా నీరు సక్రమంగా రాకపోవడంతో వరి పొలాలకు నీరు అందడంలేదు. దీంతో రైతులు వరిపొలాలకు నీరు పెట్టేందుకు పడరానిపాట్లు పడుతున్నారు. గురువారం కురిసిన వర్షంతో వరిపైరు కొంతమర ఊపిరిపోసుకుంటుందని రైతులు చెబుతున్నారు. కాలువ శివారు ప్రాంతాలైన మచిలీపట్నం, కోడూరు. నాగాయలంక మండలాల్లో ఇంకా వరినాట్లు వేస్తున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో సాగునీటి కొరత కొంతమేర తీరుతుందని రైతులు చెబుతున్నారు. ప్రకాశం బ్యారేజీకి ఎగువ ప్రాంతం నుంచి నీరు రాకపోవడంతో వంతులవారీగా సాగునీటిని ప్రధాన కాలువలకు విడుదల చేస్తున్నారు. దీంతో శివారు ప్రాంతాలకు సాగునీరు అందక రైతులు ఇక్కట్ల పాలవుతున్నారు.