సరికొత్తగా..
ABN , First Publish Date - 2023-03-10T00:40:26+05:30 IST
విజయవాడ రైల్వేస్టేషన్‌ను రూ.400 కోట్లతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కన్సల్టెన్సీ సంస్థ పలు డిజైన్లను రూపొందించింది. ఈ డిజైన్లు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కొద్దికాలంలోనే పూర్తిస్థాయి ప్రణాళికలు సిద్ధమయ్యే అవకాశం ఉంది.
కన్సల్టెన్సీ ద్వారా ప్రైమరీ డిజైన్లు
ఆధునిక భవనాలు, బుకింగ్ కౌంటర్లు
భారీ స్కైవాక్, అందులోనే వెయిటింగ్ రూమ్‌లు
అదనంగా మరో ప్లాట్‌ఫాం నిర్మాణం
విజయవాడ, మార్చి 9 (ఆంధ్రజ్యోతి) : విజయవాడ రైల్వేస్టేషన్‌ను రూ.400 కోట్లతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కన్సల్టెన్సీ సంస్థ పలు డిజైన్లను రూపొందించింది. ఈ డిజైన్లు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కొద్దికాలంలోనే పూర్తిస్థాయి ప్రణాళికలు సిద్ధమయ్యే అవకాశం ఉంది. కన్సల్టెన్సీ రూపొందించిన ప్రణాళికలు విజయవాడ డివిజన్ రైల్వే ఉన్నతాధికారులకు చేరాయి. వీటిని పరిశీలించాక విజయవాడ భౌగోళిక పరిస్థితులు, ప్రయాణికుల అవసరాలు, రైల్వేస్టేషన్ లో ఏర్పాటు కావాల్సిన సౌకర్యాలు, అందరూ తేలిగ్గా ఉపయోగించుకునేందుకు వీలుగా పలు మార్పులు, చేర్పులు సూచించినట్టు తెలుస్తోంది. వీటికి అనుగుణంగా విజయవాడ రైల్వేస్టేషన్ రీ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు తుది ప్రణాళికలు రూపుదిద్దుకోనున్నాయి. విజయవాడ డివిజన్ పరిధిలో రైల్వే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల వివరాలను అడిషనల్ డివిజనల్ రైల్వే మేనేజర్ (ఏడీఆర్‌ఎం) డి.శ్రీనివాసరావు గురువారం మీడియాకు వివరించారు. విజయవాడ స్టేషన్ రీ డెవలప్‌మెంట్‌కు సంబంధించి పాక్షిక అంశాలను ఆయన పంచుకున్నారు. రైల్వేబోర్డు నేతృత్వంలో స్టేషన్ల రీ డెవలప్‌మెంట్ పనులకు సంబంధించి ప్రత్యేక సెల్ నడుస్తోందని, ఈ సెల్ ద్వారా విజయవాడ స్టేషన్ రీ డెవలప్‌మెంట్ ప్లాన్స్ పర్యవేక్షణ జరుగుతోందన్నారు. ప్రాథమికంగా రూ.400 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. రానున్న 20 ఏళ్ల అవసరాలు దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టును రూపొందించామన్నారు.
మార్పులు చేర్పులివే..
రైల్వేస్టేషన్ దక్షిణంవైపు ఇప్పుడున్న భవనాలన్నింటినీ పూర్తిగా తొలగించి, వాటిస్థానంలో స్టేషన్ అవసరాలకు తగినట్టుగా అధునాతన భవనాలను నిర్మించనున్నారు. దక్షిణం వైపున ఉన్న పార్శిల్ ఆఫీసును కూడా మార్చే అవకాశాలు ఉన్నాయి. 6, 7 నెంబర్ల ప్లాట్‌ఫాంలను ఆనుకుని ఉన్న పాత బిల్డింగ్‌ను కూల్చివేసి దాని స్థానంలో కొత్తగా మరో ప్లాట్‌ఫాంను అభివృద్ధి చేయాలన్న ఆలోచన కూడా ఉంది. దీనిని స్టేషన్ రీ డెవలప్‌మెంట్‌లో కలిపే అవకాశం ఉందా లేదా అన్న దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకున్న తర్వాత స్టేషన్‌లోకి వచ్చేలా రీ డెవలప్‌మెంట్ ఉంటుంది. బుకింగ్ కౌంటర్లను స్టేడియం సమీపంలో ఏర్పాటుచేసే అవకాశం ఉంది. ఇక్కడ విశాలమైన పార్కింగ్ సదుపాయం కూడా కల్పించనున్నారు. నేరుగా పది ప్లాట్‌ఫాంలను కలిపేలా అతిపెద్ద స్కై వాక్‌ను నిర్మించనున్నారు. ఇది స్టేషన్ బయట నుంచి ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ స్కై వాక్ సాధారణ ఫుట్ బ్రిడ్జిల కంటే పెద్దగా ఉంటుంది. స్కైవాక్‌లోనే వెయిటింగ్ హాల్స్, డార్మిటరీలు ఏర్పాటు చేస్తారు. అత్యాధునిక భవనాలతో పాటు ఎటుచూసినా లిఫ్టులు, ఎస్కలేటర్లు ఆకట్టుకుంటాయి.