Share News

ధాన్యం రైతుల ధర్నా

ABN , First Publish Date - 2023-10-30T23:56:06+05:30 IST

రైతులు తోలిన ధాన్యానికి రవాణా ఖర్చులు నెలలు గడిచినా చెల్లించకపోవటంతో అన్నదాతులు రోడ్డెక్కారు. మోపిదేవి మండలంలోని కె.కొత్తపాలెం రైతు భరోసా కేంద్రం వద్ద సోమవారం ఆందోళనకు దిగారు.

ధాన్యం రైతుల ధర్నా

రవాణా చార్జీలు చెల్లించాలని డిమాండ్‌

కె.కొత్తపాలెం ఆర్‌బికే వద్ద ఆందోళన

రైతులకు చెల్లించాల్సిన నగదు ఎమ్మెల్యే చెప్పారని వైసీపీ కార్యకర్త అకౌంట్‌లో జమ

మోపిదేవి, అక్టోబరు 30 : రైతులు తోలిన ధాన్యానికి రవాణా ఖర్చులు నెలలు గడిచినా చెల్లించకపోవటంతో అన్నదాతులు రోడ్డెక్కారు. మోపిదేవి మండలంలోని కె.కొత్తపాలెం రైతు భరోసా కేంద్రం వద్ద సోమవారం ఆందోళనకు దిగారు. మండలంలోని కె.కొత్తపాలెం గ్రామానికి చెందిన రైతులు ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో ధాన్యాన్ని పీఏసీఎస్‌ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేసింది. దాదాపు 1000 ఎకరాల్లో ధాన్యం కొనుగోలు చేసింది. ధాన్యాన్ని వాహనంలో ఎగుమతి చేయటం, దిగుమతి చేసిన చార్జీలు, వాహన రవాణా చార్జీలు చెల్లిస్తామని అధికారులు బ్యాంక్‌ ఖాతా నెంబర్లు తీసుకున్నారు. నెలలు గడిచినా నగదు ఖాతాల్లోకి జమ కాలేదు. పీఏసీఎస్‌కు వచ్చిన అధికారులను కొద్దిరోజుల క్రితం రైతులు ప్రశ్నించారు. ఎప్పుడో చెల్లించామని చెప్పడంతో రైతులు కంగుతిన్నారు. తమ ఖాతాల్లోకి నగదు జమ చేయకుండా ఎవరికి చెల్లించారని అధికారులను రైతులు గట్టిగా నిలదీశారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించిన కాంట్రాక్టరుకు ఫోన్‌ చేయగా, ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ఫోన్‌ చేసి వైసీపీ కార్యకర్త అనిశెట్టి బాబురావు ఖాతాల్లోకి ట్రాన్స్‌ఫర్‌ చేయాలని చెప్పినట్టు తేలింది. ఇదేమని అధికారులను ప్రశ్నించగా అది తమకు సంబంధం లేదని, ధాన్యం సేకరణ పౌరసరఫరాల శాఖ ద్వారా జరుగుతుందని, వారినే అడగాలని ఆర్‌బికే ఉద్యోగులు చెప్పారు. దీంతో రైతులు సోమవారం సాయంత్రం రైతు భరోసా కేంద్రం వద్ద ఆందోళన చేపట్టారు. వీరి ఆందోళనకు టీడీపీ, జనసేన నాయకులు సంఘీభావం తెలిపారు. రైతులకు చెల్లించాల్సిన వాహన రవాణా చార్జీలు వెంటనే చెల్లించని పక్షంలో మండల కార్యాలయాల వద్ద ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఆందోళనలో రైతులు దుట్టా రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, చందన రంగారావు, మత్తి రామకృష్ణ, మత్తి రాజశేఖర్‌, చందన సుబ్బారావు, పూషడపు రత్నగోపాల్‌, వంశీ, శివనంది పాల్గొన్నారు.

500 బస్తాలకు రవాణా చార్జీలు ఇవ్వాలి

కె.కొత్తపాలెంలో 16 ఎకరాలకు సంబంధించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి విక్రయించా. రైతు భరోసా కేంద్రంలో పండించిన ధాన్యానికి 1545గా ధర నిర్ణయించి మిల్లుకు తీసుకెళ్లమన్నారు. మిల్లు వద్దకు తీసుకెళ్లగా, కొంతమొత్తంలో డబ్బు చెల్లిస్తేనే ధాన్యాన్ని తీసుకుంటామని చెప్పారు. దిక్కుతోచని స్థితిలో ధాన్యాన్ని విక్రయించా. 500 బస్తాలకు సంబంధించి ఇప్పటి వరకు రవాణా చార్జీలు, ఏ ఇతర చార్జీలు మాకు ప్రభుత్వం నుంచి రాలేదు.

- మత్తి రఘు, రైతు

Updated Date - 2023-10-30T23:56:06+05:30 IST