పోర్న్ ‘స్ర్టోక్’
ABN , First Publish Date - 2023-05-31T00:19:06+05:30 IST
పోర్న్ వీడియో పోస్టు వ్యవహారం జడ్పీని కుదిపేస్తోంది. ఉద్యోగుల గ్రూపులో జడ్పీ సీసీ చేసిన పోర్న్ పోస్ట్ ప్రకంపనలు రివర్స్ బదిలీలకు దారి తీస్తోంది. పోర్న్ పోస్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన మహిళా ఉద్యోగులను, ప్రశ్నించిన ఉద్యోగులను బదిలీల ముసుగులో బంతాట ఆడేందుకు చాపకింద నీరులా జడ్పీ అధికారులు పావులు కదుపుతున్నారు.
జడ్పీలో బలవంతపు రివర్స్ బదిలీలు
ఉద్యోగుల గ్రూపులో సీసీ ‘పోర్న్ పోస్ట్’పై ఆరని మంటలు
సీసీపై చర్యలు తీసుకోవాలంటూ ఎన్‌జీవో సంఘం తాజాగా జడ్పీకి లేఖాస్త్రం
ఉద్యోగులపై ఉడికిపోతున్న సీసీ..
ఉద్యోగుల అడ్డగోలు బదిలీలకు శ్రీకారం
జడ్పీ చైర్‌పర్సన్ భర్త సిఫార్సులతో బదిలీ లిస్టు
మహిళా ఉద్యోగులకూ బెదిరింపులు..
పోర్న్ వీడియో పోస్టు వ్యవహారం జడ్పీని కుదిపేస్తోంది. ఉద్యోగుల గ్రూపులో జడ్పీ సీసీ చేసిన పోర్న్ పోస్ట్ ప్రకంపనలు రివర్స్ బదిలీలకు దారి తీస్తోంది. పోర్న్ పోస్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన మహిళా ఉద్యోగులను, ప్రశ్నించిన ఉద్యోగులను బదిలీల ముసుగులో బంతాట ఆడేందుకు చాపకింద నీరులా జడ్పీ అధికారులు పావులు కదుపుతున్నారు. బదిలీల అంశాన్ని ఉద్యోగుల ప్రయోజనాలకు అనుగుణంగా కాకుండా.. తమకు అడ్డుగోడలుగా ఉంటున్నారన్న ఉద్దేశంతో వదిలించుకోవటానికి ఉపయోగించుకోవడం కలకలాన్ని రేపుతోంది. దీనిపై జడ్పీ సీఈవోను వివరణ కోరటానికి ప్రయత్నించగా.. ఆయన అందుబాటులోకి రాలేదు. పోర్న్ వీడియో వ్యవహారంలో పీకల్లోతున ఇరుక్కుపోయిన సీసీపై జడ్పీ చైర్‌పర్సన్, జడ్పీ సీఈవో చర్యలు తీసుకోకపోగా కాపాడటం అనేక అనుమానాలకు దారితీస్తోంది.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): ఉద్యోగుల బదిలీలపై జడ్పీ అధికారులు దండోపాయాన్ని ప్రయోగిస్తున్నారు. తమ వికృత చేష్టలను ప్రశ్నిస్తున్నారని, సమాచారాన్ని ఆంధ్రజ్యోతికి చేరవేస్తున్నారని అక్కసుతో బదిలీలను జడ్పీ అధికారులు తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారు. ఉద్యోగుల ఐచ్ఛికానికి భిన్నంగా ఎడాపెడా బదిలీలు చేసేందుకు రహస్యంగా జాబితా తయారు చేయటం సంచలనంగా మారింది.
జడ్పీ చైర్‌పర్సన్ భర్తపై అధికారులు గుర్రు..
బదిలీలపై జడ్పీ సీసీతోపాటు, జడ్పీ చైర్‌పర్సన్ భర్త ముద్ర ఉండటం గమనార్హం. జడ్పీ చైర్ పర్సన్ భర్త సాగిస్తున్న అరాచకాలను ఇటీవల కాలంలో కొందరు జడ్పీ ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. జడ్పీ చైర్‌పర్సన్ డమ్మీగా మారిపోవటం.. ఆమె భర్త అసలైన ఆ పీఠానికి అధిపతి అన్నట్టు వ్యవహరిస్తుండటం ఉద్యోగులకు నచ్చటం లేదు. అంతమాత్రాన జడ్పీలో జరుగుతున్న అవినీతి వ్యవహారాలన్నీ ఉద్యోగులు కావాలని బయటకు లీక్ చేస్తున్నారన్న అనుమానంతో చైర్మన్ భర్త కొందరి లిస్ట్ తయారు చేసి జడ్పీ సీసీకి పంపించాడు. ఇదే అదనుగా భావించిన జడ్పీ సీసీ కూడా తన లిస్టును తయారు చేసుకున్నాడు. ఇంతకు ముందు ఉద్యోగుల గ్రూపులో తాను పోర్న్ వీడియోను పోస్టు చేయటం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే.
సీసీపై చర్యలేవి?
పోర్న్ పోస్టుపై ఉద్యోగ వర్గాలు భగ్గుమన్నాయి. మహిళా ఉద్యోగులు తీవ్రంగా దుయ్యబట్టారు. దీనిపై అప్పట్లో గ్రూప్ అడ్మిన్‌కు ఫిర్యాదు చేయటంతో పోర్న్ పోస్ట్‌ను గుర్తించి తొలగించారు. జడ్పీ మహిళా ఉద్యోగులు కూడా ఆ గ్రూపులో ఉన్నారు. ఈ సమాచారం తెలియటంతో.. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న సీసీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇతర ప్రభుత్వ శాఖల మహిళా ఉద్యోగినులు సీఈవో, చైర్‌పర్సన్‌లకు ఫిర్యాదు చేశారు. అయినా చర్యలు చేపట్టలేదు. తాజాగా ఏపీఎన్‌జీవో సంఘం తరపున జడ్పీ అధికారులకు పోర్న్ పోస్ట్‌కు పాల్పడిన సీసీపై చర్యలు తీసుకోవాలని లేఖాస్ర్తాన్ని సంధించారు. దీంతో సీసీ అగ్గిమీద గుగ్గిలమయ్యారు.
వ్యక్తిగత యాత్రలకు జడ్పీ సొమ్ము
జడ్పీ చైర్‌పర్సన్ కారును అనధికారికంగా వ్యక్తిగత యాత్రలకు ఉపయోగించటం, లక్షలాది రూపాయలను డీజిల్ వినియోగం పేరుతో ఖర్చు చేయటం, జడీ ్పలో ఫలహారాల పేరిట లక్షలాది రూపాయాలను ఖర్చు చేయటం, ఖరీదైన ఫార్చ్యూనర్ కారు కొనాలనుకోవటం, నిర్మాణాలు.. రెన్నోవేషన్ పేరుతో సొంత వ్యవహారాలు నడపటం, తన దగ్గర పనిచేసే కొందరికి జీతాలు ఇప్పించటం వంటివాటిపై ఉద్యోగులు ప్రశ్నించటాన్ని చైర్‌పర్సన్ భర్త తట్టుకోలేకపోతున్నారు. దీంతో తాను అనుమానపడిన ఉద్యోగులను సాగనంపేందుకు ఈ బదిలీలను ఉపయోగించుకోవాలనుకోవటం గమనార్హం. మరి జడ్పీ సీఈవో ఏం చేస్తారో చూడాల్సిందే.
ఉద్యోగులపై అక్కసుతో..
తమ ఉద్యోగులే జడ్పీ అధికారులకు లేఖాస్ర్తాన్ని సంధించటానికి కారణమయ్యారన్న ఉద్దేశంతో అనుమానం ఉన్న వారి బదిలీలకు సీసీ ఒక జాబితా రూపొందించారు. ఇదే సందర్భంలో చైర్‌పర్సన్ భర్త కూడా జడ్పీలో తమకు అడ్డుగా ఉన్న వారిని వదిలించుకునేందుకు జాబితా తయారు చేయటంతో.. ఇద్దరూ కలిసి తమకు అనుకూలంగా లేనివారిని బలవంతంగా రివర్స్ బదిలీలకు తెరదీశారు. జడ్పీ సీసీ అయితే ఒకడుగు ముందుకేసి తాను టార్గెట్ చేసిన ఉద్యోగులను పంపించేస్తానంటూ బెదిరిస్తున్నట్టు సమాచారం. దీంతో మహిళా ఉద్యోగులతోపాటు, ఇతర ఉద్యోగులు కూడా సీసీ బెదిరింపులకు లొంగకూడదని, ధైర్యంగా ప్రతిఘటించాలని నిర్ణయం తీసుకున్నారు. చైర్‌పర్సన్ భర్త మాత్రం ఓ అరడజను మంది ఉద్యోగులను ఎట్టి పరిస్థితుల్లో బదిలీ చేయాల్సిందేనని ఒత్తిడి తీసుకువస్తుండటం గమనార్హం.