ఉద్యమాలపై ఉక్కుపాదం
ABN , First Publish Date - 2023-09-26T00:59:14+05:30 IST
నిర్బంధం.. నిర్బంధం.. నిర్బంధం.. నిలదీస్తే నిర్బంధం.. గొంతెత్తితే నిర్బంధం.. పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాస్తూ పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిర్బంధాల పరంపరను సాగిస్తున్న సర్కారుకు సహకారంగా సోమవారం పోలీసులు మరో అడుగు ముందుకేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా అంగన్‌వాడీల ‘చలో విజయవాడ’కు అడుగడుగునా అడ్డు తగిలారు. పోలీసుల బెదిరింపులకు తలొగ్గని అంగన్‌వాడీలు భారీగా బెజవాడ చేరుకోగా, ఎక్కడికక్కడ అరెస్టులు చేసి కల్యాణ మండపాలకు తరలించారు. మరోవైపు అసెంబ్లీ సమావేశాల పేరుచెప్పి అమరావతిలో అన్ని రహదారులను అష్టదిగ్బంధనం చేశారు. ఇంకోవైపు ఫ్యాప్టో ఆధ్వర్యంలో బందరులో కలెక్టరేట్ ముట్టడికి వెళ్తున్న ఉద్యోగులను అడ్డుకున్నారు.

ఎక్కడికక్కడ భారీ బందోబస్తుతో హల్‌చల్
విజయవాడ అష్ట దిగ్బంధనం.. రోడ్లకు అడ్డుగా బారికేడ్లు
అంగన్‌వాడీల ‘చలో విజయవాడ’కు అడ్డంకులు
అయినా.. భారీగా బెజవాడ చేరుకున్న అంగన్‌వాడీలు
అరెస్టు చేసి కల్యాణ మండపాలకు తరలింపు
పలువురు మహిళలకు అస్వస్థత.. కొందరికి గాయాలు
సమగ్ర శిక్ష ఉద్యోగుల సత్యాగ్రహ దీక్షకూ అడ్డు
రెండు జిల్లాల్లో టీడీపీ, జనసేన నేతల గృహ నిర్బంధం
ఖాకీల చేతిలో అమరావతి.. సామాన్యుల అవస్థలు..
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : గాంధీనగర్‌ను అష్టదిగ్బంధనం చేసినా అంగన్‌వాడీలు ఆగలేదు. ధర్నాచౌక్ మాత్రమే తమ వేదిక కాదని, పోలీసులు నిర్బంధించినా తమ నిరసన ఆగదని అంగన్‌వాడీలు ముందుకు దూసుకొచ్చారు. రైల్వేస్టేషన్, బస్టాండ్, ప్రకాశం బ్యారేజీ, కనకదుర్గమ్మ వారధి, గొల్లపూడి, నిడమానూరు, నున్న ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం నుంచే పోలీసులు భారీగా మోహరించారు. అయినప్పటికీ అంగన్‌వాడీలు వేలాదిగా ముందుకు కదిలారు. తొలుత బస్టాండ్, రైల్వేస్టేషన్‌లో అరెస్టులు జరిగాయి. భారీగా తరలివచ్చిన వారిని అరెస్టు చేసి కల్యాణమండపాలకు తరలించారు. వేలాదిమందిని పోలీసులు నిర్బంధించి కల్యాణ మండపాలకు తరలించారు. అజిత్‌సింగ్‌నగర్‌లోని గంగానమ్మ ఆలయ కల్యాణ మండపంలో 140 మంది అంగన్‌వాడీలను నిర్బంధించగా, కండ్రికలోని లగడపాటి కల్యాణ మండపంలో మరో 228 మందిని ఉంచారు. సెంట్రల్ జోన్ పరిధిలోనే 1,000 మందిని అరెస్టు చేశారు. ఇక రైల్వేస్టేషన్ నుంచి 1,500 మందిని, పీఎన్‌బీఎస్‌లో 800 మందిని, ప్రకాశం బ్యారేజీ దగ్గర 300 మందిని, ఏలూరు రోడ్డులో 500 మందిని అరెస్టు చేశారు.
పలువురు మహిళలకు గాయాలు, అస్వస్థత
అంగన్‌వాడీలను అరెస్టు చేసే క్రమంలో మహిళా పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు. చీరలు, చున్నీలు లాగేస్తూ రోడ్లపై యుద్ధ వాతావరణాన్ని సృష్టించారు. అనేక మంది అంగన్‌వాడీలకు గాయాలయ్యాయి. కండ్రిక కాలనీకి తరలించిన అంగన్‌వాడీల్లో ఇద్దరు స్పృహ కోల్పోయారు.
పోలీస్ బారికేడ్లతో అవస్థలు
అంగన్‌వాడీలు ధర్నాచౌక్‌కు చేరుకోకుండా ఆ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ మళ్లించడంతో వాహనదారులకు చుక్కలు కనిపించాయి.
కాలికి గాయమైనా నోటీస్
ఇసుక అక్రమ రవాణాపై జనసేన చేపట్టిన ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమాన్ని భగ్నంచేసే క్రమంలో పోలీసులు అత్యుత్సాహం చూపారనడానికి ఈ ఫొటోనే నిదర్శనం. నెల రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ, కాలికి శస్త్ర చికిత్స చేయించుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాలరావుకు కూడా సోమవారం గృహ నిర్బంధం విధించి నోటీసు అందజేశారు.