కట్టారు.. కూల్చారు..

ABN , First Publish Date - 2023-09-26T01:02:44+05:30 IST

దుర్గగుడి మహామండపానికి వెళ్లే మార్గంలో కనకదుర్గానగర్‌లో రెండువైపులా నిర్మించిన పెర్గోలాను దుర్గగుడి అధికారులు సోమవారం కూల్చేశారు. భక్తులు కనకదుర్గానగర్‌లో అడ్డదిడ్డంగా నడవకుండా పక్కనుంచి క్రమపద్ధతిలో రాకపోకలు సాగించేందుకు గతంలో ఈ పెర్గోలా నిర్మించారు.

కట్టారు.. కూల్చారు..
ఇంద్రకీలాద్రి దిగువన కనకదుర్గానగర్‌లో పెర్గోలా తొలగిస్తున్న దృశ్యం

కొత్త క్యూల నిర్మాణం కోసమట..!

రూ.9 కోట్ల పైచిలుకు సొమ్ము నేలపాలు

మల్లికార్జున మహామండపం కూలగొట్టేందుకు ప్రతిపాదనలు

దుర్గగుడి అధికారుల తీరుపై భక్తుల ఆగ్రహం

(విజయవాడ-ఆంధ్రజ్యోతి/వన్‌టౌన్‌) : దుర్గగుడి మహామండపానికి వెళ్లే మార్గంలో కనకదుర్గానగర్‌లో రెండువైపులా నిర్మించిన పెర్గోలాను దుర్గగుడి అధికారులు సోమవారం కూల్చేశారు. భక్తులు కనకదుర్గానగర్‌లో అడ్డదిడ్డంగా నడవకుండా పక్కనుంచి క్రమపద్ధతిలో రాకపోకలు సాగించేందుకు గతంలో ఈ పెర్గోలా నిర్మించారు. తీగలుగా పాకే మొక్కలను నాటి, స్తంభాలపైకి ఎక్కేలా ఏర్పాట్లు చేసి భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ పెర్గోలాను నిర్మించారు. 2016లో కృష్ణా పుష్కరాల సమయంలో దీని నిర్మాణం జరిగింది. అప్పట్లో పెర్గోలా నిర్మాణంపై విమర్శలు వచ్చినా, ఆ తరువాత భక్తులకు ఎంతో ఉపయుక్తంగా మారడంతో ఆ ఆరోపణలు క్రమేణా తగ్గిపోయాయి. తాజాగా దుర్గగుడిలో కొన్ని మార్పులు చేర్పులు చేపట్టారు. దసరా ఉత్సవాలు, భవానీ దీక్షల విరమణ సమయంలో భక్తుల రద్దీని నియంత్రించేందుకు శాశ్వత క్యూలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ముఖ్యంగా ఎలివేటెడ్‌ క్యూను కనకదుర్గానగర్‌ నుంచి మహామండపంపై వరకు నిర్మించాలని, రాజగోపురం మీదుగా భక్తులను అనుతించాలన్న ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. గత దసరా ఉత్సవాల్లో కూడా కనకదుర్గానగర్‌లో ప్రసాదాల కౌంటర్ల వెనుక నుంచి ప్రారంభించి.. ఎడమవైపుగా పెర్గోలా నుంచి క్యూ నిర్మించారు. కానీ, పోలీసులు అభ్యంతరం చెప్పడంతో ఆ క్యూను వినియోగించలేదు. డబ్బు కూడా వృథా అయింది. మరో పక్షం రోజుల్లో దసరా ఉత్సవాలు ప్రారంభమవుతాయన్న సమయంలో ఉన్నట్టుండి పెర్గోలాను కూలగొట్టి శాశ్వత కూలైన్ల నిర్మాణం చేపడతామని అధికారులు చెప్పడం విస్మయం కలిగిస్తోంది. ఈ విధ్వంసంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా ఈ కూల్చే కార్యక్రమానికి సంబంధించి పాలకమండలి నుంచి ఎలాంటి అనుమతి లేదని చెప్పడం గమనార్హం. పాలకమండలి అనుమతి తీసుకోవడం.. కూల్చడానికి ఎంత వ్యయం అవుతుందన్న దానిపై అంచనాలు తయారుచేసి టెండర్‌ పిలవడం వంటివేమీ చేయకుండా అకస్మాత్తుగా కూల్చివేత చేపట్టడం వెనుక నిధుల గోల్‌మాల్‌ జరిగిందన్న ఆరోపణలు వస్తున్నాయి.

మల్లికార్జున మహామండపం కూడా..

మల్లికార్జున మహామండపాన్ని కూడా కూల్చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మహామండపంలోని ఒక ఖానా పగలగొట్టి మెట్లు కట్టేందుకు ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు. మల్లికార్జున మహామండపం నిర్మాణానికి కొన్ని రూ.కోట్లు ఖర్చుపెట్టిన సంగతి తెలిసిందే.

Updated Date - 2023-09-26T01:12:05+05:30 IST