పింఛను రాలే..
ABN , First Publish Date - 2023-08-02T00:57:25+05:30 IST
నిన్న అమ్మఒడి.. నేడు పెన్షన్లు. సామాజిక పెన్షన్లకు కూడా సర్కారు డబ్బులు ఇవ్వలేకపోతోంది. ప్రతినెలా మొదటి తేదీన 90 శాతంపైగా ఇంటింటికీ పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని డప్పులు కొంటుకున్న ప్రభుత్వం.. ఈ నెలలో చతికిలపడింది. పెన్షనర్లకు డబ్బులు సర్దుబాటు చేయలేక ఆపసోపాలు పడింది. ఎన్టీఆర్ జిల్లాలో డీఆర్‌డీఏ నేతృత్వంలో వలంటీర్ల ద్వారా ఇంటింటికీ జరిగిన పెన్షన్ల పంపిణీ కేవలం 66.99 శాతం జరిగింది. డబ్బులు సర్దుబాటు కాకపోవటంతో చాలా ప్రాంతాల్లో మధ్యాహ్నం వరకు కూడా పెన్షన్ల పంపిణీ జరగలేదు.
నిధుల సమస్యతో కొందరికే అందిన పింఛన్
ఎన్టీఆర్ జిల్లాలో ఇచ్చింది 66.99 శాతమే
రూ.62.80 కోట్లకుగాను రూ.42.02 కోట్లే పంపిణీ
అత్యల్పంగా చందర్లపాడు మండలంలో 26.4 శాతం అందజేత
సర్వర్లు పనిచేయటం లేదని ప్రచారం
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : నిన్న అమ్మఒడి.. నేడు పెన్షన్లు. సామాజిక పెన్షన్లకు కూడా సర్కారు డబ్బులు ఇవ్వలేకపోతోంది. ప్రతినెలా మొదటి తేదీన 90 శాతంపైగా ఇంటింటికీ పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని డప్పులు కొంటుకున్న ప్రభుత్వం.. ఈ నెలలో చతికిలపడింది. పెన్షనర్లకు డబ్బులు సర్దుబాటు చేయలేక ఆపసోపాలు పడింది. ఎన్టీఆర్ జిల్లాలో డీఆర్‌డీఏ నేతృత్వంలో వలంటీర్ల ద్వారా ఇంటింటికీ జరిగిన పెన్షన్ల పంపిణీ కేవలం 66.99 శాతం జరిగింది. డబ్బులు సర్దుబాటు కాకపోవటంతో చాలా ప్రాంతాల్లో మధ్యాహ్నం వరకు కూడా పెన్షన్ల పంపిణీ జరగలేదు. డబ్బులు సర్దుబాటు కాకపోవటంతో సర్వర్లు పనిచేయటం లేదన్న ప్రచారానికి తెరలేపారు. వలంటీర్లు తమ పరిధిలోని పెన్షనర్లకు ఉదయాన్నే ఫోన్లు చేసి సర్వర్ సమస్యలున్నాయని, సర్వర్ పనిచేసినపుడు తానే వచ్చి ఇస్తానని చెప్పింది. మధ్యాహ్నం తర్వాత డబ్బులు సర్దుబాటు కావటంతో వలంటీర్లు పెన్షన్ల పంపిణీ చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా రూ.62.80 కోట్ల మేర పెన్షన్ మొత్తం అందించాల్సి ఉండగా.. మంగళవారం రాత్రి 7 గంటల వరకు రూ.42.02 కోట్లను మాత్రమే అందించారు. చందర్లపాడు మండలంలో అత్యల్పంగా 26.4 శాతం మేర పెన్షన్లు పంపిణీ చేశారు. అత్యధికంగా జీ కొండూరులో 84.52 శాతం మేర పెన్షన్లను పంపిణీ చేశారు. సర్వర్లు పనిచేయటం అన్నది వాస్తవం కాకపోయనా.. వలంటీర్ల ద్వారా ప్రచారం చేయించారు. బ్యాంకుల నుంచి సచివాలయ అడ్మిన్స్ డబ్బులు విత్‌డ్రా చేసి తన సచివాలయం పరిధిలోని వలంటీర్లకు డబ్బులు అందజేస్తాడు. బ్యాంకుల సర్వర్లు బాగానే ఉన్నాయి. బ్యాంకులకు సకాలంలో డబ్బులు జమ కాకపోవటంతోనే ఈ సమస్య ఏర్పడినప్పటికీ సర్వర్ సమస్యలుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ దాదాపుగా మధ్యాహ్నం నుంచే ప్రారంభమైంది. ఇంటింటికీ రావాల్సిన వలంటీర్లు రాకపోవటంతో పెన్షనర్లు ఆందోళన చెందారు. ఇటీవల కాలంలో ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలకు బటన్ నొక్కినా ఆర్థిక సమస్యలతో డబ్బులు వేయటం లేదు.
కొందరికి ఇప్పటికీ అందని అమ్మఒడి
అమ్మఒడి పథకానికి సంబంధించి బటన్ నొక్కి చాలా రోజులు అవుతున్నా.. అర్హులైన చాలా మందికి ఇప్పటి వరకు ఇంకా డబ్బు పడలేదు. అదేమంటే వలంటీర్లు తమ వాట్సాప్ గ్రూప్‌లలో సర్వర్ సమస్యలు ఉన్నాయని, పది రోజుల్లో డబ్బులు పడతాయని పోస్టులు పెట్టారు. పది రోజులు దాటినా ఇప్పటి వరకు కూడా అమ్మఒడి డబ్బులు పడలేదు. అమ్మఒడి డబ్బులు సకాలంలో పడకపోవటంతో చాలా మంది పేద, మధ్య తరగతి వర్గాలు తమ పిల్లలకు అప్పులు చేసి డబ్బులు కట్టాల్సి వచ్చింది. అమ్మఒడి డబ్బులు పడకపోవటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రజల్లో విస్తృత చర్చకు దారితీసింది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులపై చర్చలు మొదలయ్యాయి. దీంతో ఇంట్లో ఉన్న వృద్ధులు, వికలాంగులు, వితంతువులు కూడా తమకు పెన్షన్లు వస్తాయో, రావోనని కొద్ది రోజులుగా భయపడుతున్నారు.