నారాకు నారీ రక్ష

ABN , First Publish Date - 2023-10-10T01:37:24+05:30 IST

సీఎం జగనాసురుని అక్రమాలను ఓట్లతో తరిమివేద్దామంటూ మచిలీపట్నం తెలుగు మహిళలు మహిషాసుర మర్దిని, కాళికాదేవి, వాకాలమ్మ, పోలేరమ్మ వేషధారణలతో వినూత్న రీతిలో నిరసన తెలిపారు.

నారాకు నారీ రక్ష

మచిలీపట్నం టౌన్‌, అక్టోబరు 9 : సీఎం జగనాసురుని అక్రమాలను ఓట్లతో తరిమివేద్దామంటూ మచిలీపట్నం తెలుగు మహిళలు మహిషాసుర మర్దిని, కాళికాదేవి, వాకాలమ్మ, పోలేరమ్మ వేషధారణలతో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. సోమవారం మచిలీపట్నం పార్టీ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాలు వినూత్న రీతిలో కొనసాగాయి. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సతీమణి కొల్లు నీలిమ ఆధ్వర్యంలో తెలుగు మహిళలు శూలం పట్టుకుని దుర్గాదేవిలా నాట్యం చేసారు. వేపమండలతో నాట్యం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. జగన్‌ పాలన చూస్తూంటే పూనకం వస్తోందంటూ తెలుగు మహిళ నాగమణి చేసిన నాట్యం నగర ప్రజలను ఆకట్టుకుంది.

రక్తం చిందించిన నేత..

చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ టీడీపీ పట్టణ మాజీ అధ్యక్షుడు దేవర ప్రసాద్‌ చెండాకోళ్లుతో ఒంటిపై కొట్టుకుంటూ నిరసన వ్యక్తం చేశారు. నేలపై రక్తం చిందించి బాధను వ్యక్తం చేశారు. జగన్‌ రెడ్డి అవినీతి, అక్రమాలపై కొరడాలతో కొట్టే సమయం ఆసన్నమైందన్నారు.

సీఎం జగన్‌రెడ్డి ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ, అక్రమంగా జైళ్లకు పంపుతున్నారని రాష్ట్ర తెలుగురైతు అధికార ప్రతినిథి గొర్రెపాటి గోపీచంద్‌ అన్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ మాజీచైర్మన్‌ మోటమర్రి బాబా ప్రసాద్‌, నగర టీడీపీ అధ్యక్షుడు ఎండీ ఇలియాస్‌ బాషా, కార్యదర్శి పిప్పళ్ల కాంతారావు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బత్తుల బోసుబాబు, రూరల్‌ పార్టీ అధ్యక్షుడు కుంచే నాని, మరకాని పరబ్రహ్మం, లంకే శేషగిరి, కొక్కిలిగడ్డ నాగ సురేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

అమెరికాలోని డెన్వర్‌ కొలరాడోలో ..

నందిగామ : చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ ‘నారా తో నారీ’ కార్యక్రమాన్ని ప్రవాసాంధ్రులు నిర్వహించారు. అమెరికాలోని డెన్వర్‌ కొలరాడోలో అధిక సంఖ్యలో మహిళలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్లకార్డులు చేతబూని చంద్రబాబుకు సంఘీభావంగా నినాదాలు చేశారు. అత్యంత నిజాయితీ పరుడు, దార్శనికుడైన చంద్రబాబుపై అక్రమ కేసు పెట్టి జైలులో పెట్టడం అమానుషమని నినదించారు. చంద్రబాబు అరెస్టుపై రాష్ట్రం, దేశంతో పాటు విదేశీయులు సైతం విస్మయం చెందుతున్నారన్నారు. ఎప్పటికైనా న్యాయం గెలుస్తుందని పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ జిల్లాకు చెందిన గుదే శ్రీనివాస్‌, జాస్తి మహేష్‌, కొమ్మినేని అనిల్‌, ముడుపు నరసింహారెడ్డిల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.

కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారు.. : కొనకళ్ల నారాయణ

తోట్లవల్లూరు : సీఎం జగన్‌ తన అధికారంతో కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నాడని మాజీ ఎంపీ, జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొనకళ్ల నారాయణ ఆరోపించారు. చంద్రబాబునాయుడు అక్రమ అరె్‌స్టకు నిరసనగా వల్లూరుపాలెంలో నియోజకవర్గ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో సోమవారం రిలే నిరాహారదీక్షలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, నాడు అమెరికా అధ్యక్షుడు క్లింటన్‌ నుంచి ప్రశంసలు పొందిన ఘనత దేశంలో ఒక్క చంద్రబాబునాయుడుకే దక్కిందని, అలాంటి చంద్రబాబుని అక్రమ కేసులో జగన్‌ ప్రభుత్వం అరెస్ట్‌ చేయటం సిగ్గుచేటని విమర్శించారు. కార్యక్రమానికి స్థానిక సీనియర్‌ నేత చింతపల్లి వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించగా నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి వర్ల కుమార్‌ రాజా, రాష్ట్ర టీడీపీ బీసీ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి వీరంకి వెంకట గురుమూర్తి, పలు గ్రామాల టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.

బాబు కోసం.. సర్వమత ప్రార్థనలు

చందర్లపాడు : చంద్రబాబు జైలు నుంచి త్వరగా విడుదల కావాలని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సర్వమత ప్రార్థనలు జరిగాయి. సోమవారం మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో గుడిమెట్ల శివాలయం, ద్వారకా వెంకటేశ్వరస్వామి ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోనాయపాలెంలో ముస్లిం పెద్దల ఆఽధ్వర్యంలో ప్రార్థనలు జరిగాయి. చర్చిలో పార్థనలు చేశారు. చంద్రబాబు త్వరగా బయటకు రావాలని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండాలని వారు ప్రార్థించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యుడు వాసిరెడ్డి ప్రసాద్‌, గుత్తికొండ రాంబాబు, ఎంపీటీసీ సభ్యురాలు గుత్తికొండ కల్పన, వెంకటరమణ, నతానియేలు పాల్గొన్నారు.

జగన్‌ వైఖరిపై ప్రజల్లో చైతన్యం : నెట్టెం రఘురాం

జగ్గయ్యపేట : రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని నేరుగా ఎదుర్కొనే దమ్ము లేక జగన్‌రెడ్డి అడ్డదారులు తొక్కుతున్నాడని, చంద్రబాబు అరెస్టు తర్వాత ప్రభుత్వ బండారం బయటపడి ప్రజల్లో చైతన్యం పెరిగిందని మాజీ మంత్రి, విజయవాడ పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం అన్నారు. అరెస్టుతో తనకేమీ సంబంధం లేదని కబుర్లు చెబితే నమ్మే స్థితిలో ప్రజలు లేరని, జగన్‌కు వాత పెట్టటం తధ్యమని అన్నారు. సోమవారం జగ్గయ్యపేటలో అనిగండ్లపాడు గ్రామ మహిళలు భారీసంఖ్యలో పాల్గొన్న రిలేదీక్షా శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్యతో కలిసి ప్రారంభించారు. శ్రీరాం తాతయ్య మాట్లాడుతూ పదో తేదీ వస్తున్నా.. లబ్ధిదారులకు పింఛన్‌ ఇవ్వలేదని, ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని అన్ని వర్గాలు గగ్గోలు పెడుతున్నారన్నారు. నెట్టెం శివరాం, శ్రీరాం చినబాబు, కొఠారు సత్యనారాయణప్రసాద్‌, మేకా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. రిలేదీక్షను శ్రీరాం తాతయ్య సతీమణి అమ్మాజీ నిమ్మరసం ఇచ్చి విరమింప చేశారు.

అవినీతి బురద అంటించే కుట్ర : దేవినేని ఉమా

గొల్లపూడి/జి.కొండూరు/మైలవరం : అవినీతిలో నిండా మునిగిన జగన్‌ ఆ బురదను చంద్రబాబుకు అంటించే క్రుటలు చేయడం దారణమని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. గొల్లపూడిలో రిలే నిరాహార దీక్షకు ఆయన సోమవారం సంఘీభావం తెలిపి మాట్లాడుతూ, జగన్‌ పాలనలో అన్ని రంగాలు నిర్వీర్యమయ్యాయన్నారు. వైసీపీ అరాచకాలతో ప్రజలు కూడా భయాందోళన చెందుతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి గుణపాఠం తప్పదన్నారు.

ఫ జి.కొండూరు మండలం వెల్లటూరు శివారు భీమవరప్పాడులో టీడీపీ నేతలు రిలే నిరాహార దీక్ష చేపట్టగా.. ధనేకుల సాంబశివరావు (బుల్లిబాబు), పజ్జూరు రవికుమార్‌, లంక రామకృష్ణ, పంటాపంచల నరసింహారావు, రామిశెట్టి శ్రీనివాసరావు, భోగినేని సురేంద్ర, ఉయ్యూరు నరసింహారావు, బూర్సు శివలు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేశారు.

ఫ మైలవరంలో దీక్షలో పొందుగల గ్రామ నేతలు పాల్గొన్నారు. వారికి మండల, పట్టణ, తెలుగుయువత నాయకులు సంఘీభావం తెలిపారు. ఉప్పు రాజగోపాల్‌, ఉప్పు విజయ్‌బాబు, నంద్యాల వెంకటేశ్వరరావు, నంద్యాల పెద్ద సాంబయ్య, నంద్యాల పంగిడయ్య, డొలా నాయక్‌, బి.రంగ, బి.జమలయ్య తదితరులు పాల్గొన్నారు.

చంద్రబాబుకు మద్దతుగా కాగడాల ప్రదర్శన

తిరువూరు : చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తు కారు చీకట్లు తొలగిపోవాలని కాంతితో క్రాంతి కార్యక్రమంలో భాగంగా యూనిట్‌ ఇన్‌చార్జి డాక్టర్‌ సూరపనేని జయసింహ ఆధ్వర్యంలో రాజుపేటలో కాగడాల ప్రదర్శన సోమవారం రాత్రి నిర్వహించారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి శావల దేవదత్‌, మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసులు మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అభాసుపాలై చీకట్లు కమ్ముకుంటున్నాయన్నారు. కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్ష ప్రదాన కార్యదర్శి బొమ్మసాని మహేష్‌, సింధు శ్రీను, వాసం మునియ్య, మారేపల్లి వంశీ, తదితరులు పాల్గొన్నారు.

నారా భువనేశ్వరిని కలిసిన టీడీపీ నేతలు

గన్నవరం : టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిని రాజమండ్రి క్యాంపు కార్యాలయం వద్ద గన్నవరం టీడీపీ నాయకులు కలిసి సంఘీభావం తెలిపారు. తెలుగు మహిళ రాష్ట్ర కార్యదర్శి మండవలక్ష్మి, టీడీపీ జిల్లా కార్యదర్శి జూపల్లి సురేష్‌, తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షుడు మండవ అన్వేష్‌, చీమలదండు రామకృష్ణ, మైనార్టీసెల్‌ మండల అధ్యక్షుడు షేక్‌ అబుల్యాజ్‌, రాహుల్‌, లోకేశ్‌ తదితరులు ఉన్నారు.

రాష్ర్టానికి చంద్రబాబు అవసరం ఉంది : యార్లగడ్డ వెంకట్రావు

రాష్ర్టానికి చంద్రబాబు అవసరం ఎంతో ఉందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌ చార్జి యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. పోలవరం, అమరావతి అభివృద్ధి ఆగిపోయిందని, ఐటీ జాడే లేదని చెప్పారు. బూతులు తిట్టే పరిస్థితి తప్ప మరొకటి కనిపించటం లేదన్నారు. నియోజకవర్గ కార్యాలయంలో దీక్షలో తెలుగు మహిళలు వినూత్నంగా నిరసన తెలిపారు. టీడీపీ మండల అధ్యక్షుడు జాస్తి వెంకటేశ్వరరావు, ఆళ్ల గోపాలకృష్ణ, ఆరుమళ్ల కృష్ణారెడ్డి, జాస్తి శ్రీధర్‌, ఎ.పద్మ, కళ్యాణి, జానకిదేవి, శ్రీదేవి, విజయకుమారి, దేవినేని సులోచన, ఆళ్ళ దమయంతి, శేషురత్నం, లక్ష్మీ, జయ, జొన్నలగడ్డ రంగమ్మ, సుధాకర్‌, శేషయ్య, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

అవనిగడ్డలో కొనసాగిన దీక్షలు..

అవనిగడ్డ/నాగాయలంక : చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ అవనిగడ్డలో దీక్షలను బండే నాగ వెంకట కనకదుర్గ, రావి దుర్గావాణి, దొప్పలపూడి గంగాభవాని, మోర్ల జయలక్ష్మి, కొక్కిలిగడ్డ మాధవి, మద్దాల శ్రావణి, యాసం లంకమ్మ, సనకా అన్నపూర్ణమ్మ ప్రారంభించి సంఘీభావం తెలిపారు. జనసేన పార్టీ నాయకులు మత్తి వెంకటేశ్వరరావు, గుడివాక శేషుబాబు తదితరులు సంఘీభావం తెలియజేసి ప్రసంగించారు. పైడిపాముల కృష్ణకుమారి, బండే కనకదుర్గ, దీవి యుగంధర్‌, గుడివాక శే షుబాబు దీక్షలో పాల్గొన్న వారికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపచేశారు.

చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా నాగాయలంకలో కొవ్వొత్తులతో మహిళలు, రైతులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు తలశిల స్వర్ణలత మాట్లాడుతూ, జగన్‌ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందన్నారు.

Updated Date - 2023-10-10T01:37:24+05:30 IST