ఆస్తి గొడవలతో ఘాతుకం

ABN , First Publish Date - 2023-09-22T00:18:21+05:30 IST

రూపాయి... రూపాయి.. నువ్వేం చేస్తావంటే.. ‘హరిశ్చంద్రుడితో అబద్ధం ఆడిస్తా.. భార్యాభర్తల మధ్య చిచ్చు పెడతా.. తండ్రీ బిడ్డలను విడదీస్తా.. అన్నదమ్ముల మధ్య వైరం పెడతా.. అఖరికి ప్రాణ స్నేహితులను కూడా విడగొడతా’ అందట. ఇది ఎప్పటి నుంచో ఉన్న నానుడి. ఇప్పుడు అదే రూపాయి అన్నదమ్ములను హత్యలకు కూడా ప్రేరేపిస్తోంది. ఆస్తి గొడవల నేపథ్యంలో కూచిపూడి మండలం అయ్యంకి గ్రామంలో పట్టపగలే ఇద్దరు దంపతులను కుటుంబ సభ్యులే అతి కిరాతకంగా హత్య చేసి చంపిన ఘటనే ఇందుకు నిదర్శనం.

ఆస్తి గొడవలతో ఘాతుకం

దంపతులను కత్తులతో నరికి చంపిన కుటుంబ సభ్యులు

గతంలో ఇవే గొడవల్లో ఇద్దరి హత్య

మళ్లీ హత్యలతో ఉలిక్కిపడ్డ అయ్యంకి గ్రామం

రూపాయి... రూపాయి.. నువ్వేం చేస్తావంటే.. ‘హరిశ్చంద్రుడితో అబద్ధం ఆడిస్తా.. భార్యాభర్తల మధ్య చిచ్చు పెడతా.. తండ్రీ బిడ్డలను విడదీస్తా.. అన్నదమ్ముల మధ్య వైరం పెడతా.. అఖరికి ప్రాణ స్నేహితులను కూడా విడగొడతా’ అందట. ఇది ఎప్పటి నుంచో ఉన్న నానుడి. ఇప్పుడు అదే రూపాయి అన్నదమ్ములను హత్యలకు కూడా ప్రేరేపిస్తోంది. ఆస్తి గొడవల నేపథ్యంలో కూచిపూడి మండలం అయ్యంకి గ్రామంలో పట్టపగలే ఇద్దరు దంపతులను కుటుంబ సభ్యులే అతి కిరాతకంగా హత్య చేసి చంపిన ఘటనే ఇందుకు నిదర్శనం.

కూచిపూడి, సెప్టెంబరు 21 : గ్రామానికి చెందిన వీరంకి చిన ఆంజనేయులుకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఇతనికి 3.1 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆస్తి తగాదాల నేపథ్యంలో చిన్న ఆంజనేయులు 2008వ సంవత్సరంలో హత్యకు గురయ్యారు. ఆస్తి కోసం కుటుంబసభ్యులే ఆయన్ను హత్య చేసినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. తదనంతరం చిన్న ఆంజనేయులు చిన్న కుమారుడు వీరంకి పూర్ణచంద్రరావు 2012లో హత్యకు గురయ్యారు. అతని సోదరులు వీరంకి వీర కృష్ణ, కుటుంబసభ్యులు ఆస్తి కోసం అతన్ని హత్య చేసినట్టు ప్రచారం జరిగింది. దీనిపై కేసులు కూడా నమోదయ్యాయి. ఈ ఘటన తరువాత పూర్ణచంద్రరావు భార్య స్వర్ణ, ఆమె ముగ్గురు కుమారులైన గణేశ్‌, లోకేశ్‌, భువనేష్‌లతో గుంటూరు జిల్లాకు వలసెళ్లిపోయారు. అక్కడే కూలి పని చేసుకుని బతుకీడుస్తున్నారు. పొలం సమస్యపై స్వర్ణ, ముగ్గురు కుమారులు గురువారం అయ్యంకిలో రెవెన్యూ కార్యాలయానికి వచ్చారు. తాము గతంలో పట్టాదారు పాసుపుస్తకాలకు అర్జీ దాఖలు చేశామని, పాస్‌ పుస్తకాలు ఇవ్వకుండా పెండింగ్‌ ఎందుకు పెడుతున్నారని ఆర్‌ఐ విజయలక్ష్మిని, వీఆర్వో గోపిని కలిసి అడిగారు. అదే సమయంలో అక్కడే ఉన్న వీరంకి వీర కృష్ణ వారికి పాస్‌ పుస్తకాలు ఇవ్వటానికి వీల్లేదని, ప్రస్తుతం ఆ పొలం తన స్వాధీనంలో ఉందని చెప్పటంతో ఘర్షణ మొదలైంది. మాటా మాట పెరిగింది. స్వర్ణ కుమారుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ‘గతంలో మా నాన్నను చంపింది నువ్వే. ఇప్పుడు మాకు ఆస్తి రాకుండా చేస్తున్నావు’ అంటూ కత్తులతో వీర కృష్ణాపైనా, కొద్ది దూరంలో ఉన్న అతని భార్య వరలక్ష్మిపైనా విచక్షణారహితంగా దాడి చేసి గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలోనే హత్యమార్చారు. గతంలో తన తండ్రిని చంపిన కారణంగా కక్ష పెంచుకున్న వీరంకి పూర్ణ కుమారులు తల్లి ప్రోద్బలంతో ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఈ హత్యకు పాల్పడినట్టు పోలీసులు భావిస్తూ ఆ కోణంలో విచారణ చేపట్టారు. చనిపోయిన దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమారుడు లారీ డ్రైవర్‌. మృతులిద్దరూ కూలి పని చేసుకుని పొట్టగడుపుకుంటున్నారు. వీరి మృతితో అయ్యంకి గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. పామర్రు, కూచిపూడి ఎస్‌ఐలు సందీప్‌, ప్రవీణ్‌ ఈ కేసును విచారిస్తున్నారు.

ఆస్తి తగాదాల నేపథ్యంలో హత్య

అన్నదమ్ముల మధ్య నెలకొన్న ఆస్తి వివాదంలో వీరంకి వీర కృష్ణ, అతని భార్య వరలక్ష్మి హత్యకు గురైనట్టు ప్రాథమిక ఆధారాల ద్వారా తెలిసింది. లోతైన దర్యాప్తు చేసి మరిన్ని వివరాలు సేకరిస్తాం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం.

- వెంకట నారాయణ, సీఐ, పామర్రు

Updated Date - 2023-09-26T12:26:06+05:30 IST