రోడ్డెక్కిన ఎమ్మెల్యే వంశీ వర్గం
ABN , Publish Date - Dec 26 , 2023 | 01:25 AM
విజయవాడ రూరల్ గ్రామం అంబాపురంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వర్గీయులు రోడ్డెక్కారు.
క్రిస్మస్ వేడుకల్లో ఘర్షణ..అంబాపురం సర్పంచ్‌పై దాడి
విజయవాడ రూరల్, డిసెంబరు 25: విజయవాడ రూరల్ గ్రామం అంబాపురంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వర్గీయులు రోడ్డెక్కారు. సోమవారం క్రిస్మస్ వేడుకల్లో భాగంగా రెండు వర్గాలుగా విడిపోయి పరస్పరం ఘర్షణకు దిగారు. ఓ వర్గానికి చెందిన నేత పంచాయతీ ప్రెసిడెంట్‌పై కర్రతో దాడి చేశాడు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. అంబాపురం సర్పంచ్ గండికోట సీతయ్య, బెంజిమెన్‌లు ఎమ్మెల్యే వంశీ వర్గంలో ఉన్నారు. సోమవారం క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని బెంజిమెన్ స్థానిక చర్చి సమీపంలోని ఖాళీ స్థలంలో సాంఘిక నాటకాల ప్రదర్శన కోసం స్టేజ్‌ను ఏర్పాటు చేసేందుకు పనులు ప్రారంభించాడు. సాంఘిక నాటకాల పేరుతో రికార్డింగ్ డాన్స్‌లు వేయిస్తారని టూటౌన్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని స్టేజ్ ఏర్పాటు పను లను నిలిపివేశారు. తమ కార్యక్రమాన్ని పంచాయతీ ప్రెసిడెంట్ సీతయ్య వెనకుండి అడ్డుకున్నారని బెంజిమెన్ వర్గం భావించింది. ఆ నోట ఈ నోట ఈ విషయాన్ని తెలుసుకున్న సీతయ్య స్టేజ్ ఏర్పాటు చేయిస్తున్న చర్చి ప్రాంతానికి వెళ్లాడు. పోలీ సులు స్టేజీ ఏర్పాటును అడ్డుకోవడానికి తనకు ఏ సంబంధం లేదని వివరణ ఇచ్చేం దుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య మాటా మాట పెరిగింది. వివాదం పెద్దదై తోపులాటకు దారితీసింది. ఇంతలో బెంజిమెన్ అక్కడే ఉన్న కర్ర తీసుకుని సీతయ్యపై దాడి చేశాడు. స్థానికులు ఇద్దరికీ సర్ది చెప్పి పంపించి వేశారు. అనంతరం ఇరువర్గాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నాయి.