మినుములో సిండికేట్లు!
ABN , First Publish Date - 2023-03-18T00:07:15+05:30 IST
ఆరుగాలం కష్టించి పంట పండించే రైతే లక్ష్యంగా సిండికేట్లు దోపిడీకి తెరలేపారు. నిన్నటి వరకు ధాన్యంలో తేమ తప్ప, రంగుమార్పు పేరుతోనూ.. నేడు మినుములో మట్టి పేరుతోనూ చిన్న, సన్నకారు రైతులను నిలువునా దోచేస్తున్నారు. దళారులను రంగంలోకి దింపి దగా చేస్తున్నారు.
మట్టి పేరుతో వ్యాపారుల దోపిడీ
చిన్న రైతును చితక్కొడుతున్న దళారులు
బస్తాకు రూ.200 నుంచి
రూ.500 వరకు కోత
పట్టించుకోని అధికారులు
గత్యంతరం లేక అమ్మేస్తున్న రైతులు
ఆరుగాలం కష్టించి పంట పండించే రైతే లక్ష్యంగా సిండికేట్లు దోపిడీకి తెరలేపారు. నిన్నటి వరకు ధాన్యంలో తేమ తప్ప, రంగుమార్పు పేరుతోనూ.. నేడు మినుములో మట్టి పేరుతోనూ చిన్న, సన్నకారు రైతులను నిలువునా దోచేస్తున్నారు. దళారులను రంగంలోకి దింపి దగా చేస్తున్నారు.
గుడివాడ : గుడివాడలో మినుము సిండికేట్లు తమ చేతివాటాన్ని చూపడం ప్రారంభించారు. ఇప్పటికే ఆశించిన స్థాయిలో ధాన్యం దిగుబడి రాక, కనీసం ఖర్చులు కూడా రాక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. రెండో పంట అయిన మినుముపైనే ఆశలు పెట్టుకున్నారు. ఆ ఆశలపై సిండికేట్లు నీళ్లు చల్లుతున్నారు. మినుములో మార్కెట్ రేటు అందరికీ వర్తించదు. తమ దళారుల ద్వారా వచ్చిన సరుకుకు ఎటువంటి అభ్యంతరాలు పెట్టకుండా కొంటున్నారు. అలా కాకుండా నేరుగా సరుకు అమ్మేందుకు వచ్చే వారికి మాత్రం చుక్కలు చూపిస్తున్నారు. కనీసం రూ.200 నుంచి రూ.500 వరకు కోత విధిస్తున్నారు. రెండు రోజుల క్రితం గుడివాడ మండలం మల్లాయిపాలేనికి చెందిన చిన్న రైతు తాను పండించిన మినుము శాంపిల్‌ను తీసుకుని స్థానిక బంటుమిల్లి రోడ్డులోని ఒక పెద్ద వ్యాపారి వద్దకు వెళ్లాడు. శాంపిల్ చూసిన వ్యాపారి వెంటనే మినుములో మట్టి శాతం ఎక్కువగా ఉందని, గింజ సైజు కూడా తక్కువగా ఉందని బస్తా రూ.6950 చెల్లిస్తానని చెప్పాడు. రైతు దళారిని ఆశ్రయించాడు. గంటల వ్యవధిలోనూ రూ.7200 కొనడంతో రైతు నిర్ఘాంతపోయాడు. అదే శాంపిల్‌ను తొలుత పట్టణంలో ఇంకో వ్యాపారి వద్దకు తీసుకువెళ్లగా రూ.6900కు కొనుగోలు చేస్తానని చెప్పాడు. మరో వ్యాపారి అయితే రూ.7000కు కొంటానని, కానీ నగదు మాత్రం వారం తరువాత చెల్లిస్తానని చెప్పాడు. మినుము కొనుగోలులో సిండికేట్ల మాయ ఏ స్థాయిలో ఉందో ఈ రైతుకు ఎదురైన అనుభవమే చెబుతోంది.
అధికారుల పర్యవేక్షణ కరువు
ధాన్యం కొనుగోలులో సవాలక్ష ఆంక్షలు పెట్టి రైతులను ముప్పుతిప్పలు పెట్టిన ప్రభుత్వం మినుము విషయంలో కూడా అదే రీతిలో వ్యవహరిస్తోంది. ధాన్యం ఽవిషయంలో లేనిపోని హడావుడి చేసిన అధికారుల నేడు మినుములకు వచ్చే సరికి పత్తా లేకుండాపోయారు. దీంతో వ్యాపారులు సిండికేట్ అయి రైతులను దోచుకుంటున్నారు.