అధికారుల తీరుపై సభ్యుల ఆగ్రహం

ABN , First Publish Date - 2023-06-01T00:36:01+05:30 IST

మునిసిపల్‌ అధికారుల పనితీరుపై కౌన్సిల్‌ సమావేశంలో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధికారుల తీరుపై సభ్యుల ఆగ్రహం
వైసీపీ, టీడీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం

జగ్గయ్యపేట, మే 31: మునిసిపల్‌ అధికారుల పనితీరుపై కౌన్సిల్‌ సమావేశంలో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, కౌన్సిల్‌కు చెడ్డపేరు తెస్తున్నందున ట్రాన్స్‌కో ఏఏపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు, సీఎంవోకు ఫిర్యాదు చేయాలని చైర్మన్‌ రంగాపురం రాఘవేంద్ర కమిషనర్‌ను ఆదే శించారు. చైర్మన్‌ రంగాపురం రాఘవేంద్ర అధ్యక్షతన జరిగిన సమావేశంలో పట్టణంలో లోఓల్టేజ్‌, విద్యుత్‌ స్తంభాలు కూలేందుకు సిద్ధంగా ఉన్నా పట్టించుకోవటం లేదన్నారు. సమస్యపై ఫోన్‌ చేసినా విద్యుత్‌ శాఖ సిబ్బంది స్పందించటం లేదన్నారు. మునిసిపాలిటీ పరిధిలో అనధికారికంగా అక్రమ లేఅవుట్‌లు వేస్తున్నా టౌన్‌ప్లానింగ్‌ విభాగం పట్టించుకోవటం లేదని, కోట్లాది రూపాయల ఆదాయం పోతుందని కౌన్సిలర్‌ వి.మనోహర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుధ్య విభాగంలో 40 నుంచి 50 మంది మస్తర్లు వేసుకుని విధులకు రావటం లేదని, 24 మంది సచివాలయ కార్యదర్శులు 31 వార్డుల్లో పారిశుధ్యాన్ని పర్యవేక్షించుకోలేకపోవటం బాధాకరమని మనోహర్‌ అన్నారు. మునిసిపల్‌ రిజర్వ్‌సైట్‌లు ఆక్రమిస్తున్నా పట్టించుకోవట లేదని కౌన్సిలర్‌ రోశయ్య అన్నారు. మునిసిపల్‌ కాంప్లెక్స్‌ల్లో ఏళ్ల తరబడి అద్దెబకాయిలున్నా ఎందుకు పట్టించుకోవటం లేదని, కనీసం ఎస్‌బీఐకు అద్దెకు ఇచ్చిన ఏటీఎం అద్దె, అగ్రిమెంట్లు రెన్యువల్‌ చేయకపోవటంతో వైస్‌చైర్మన్‌ తుమ్మల ప్రభాకర్‌ అధికారులను నిలదీశారు. నోటీసులు ఇస్తూనే ఉన్నామని లీజుదారుల నుంచి స్పందన లేదని ఆర్‌వో రత్నాంజలి సమాధానమిచ్చారు. వైసీపీ వార్డుల్లో తప్ప టీడీపీ వార్డుల్లో అభివృద్ధి చేయటం లేదని టీడీపీ కౌన్సిలర్‌ పేరం సైదేశ్వరరావు విమర్శించారు.

చిన్న పనైయినా చేయలేరా : చైర్మన్‌

25వ వార్డులో రూ.1800లతో చిన్న ప్లాట్‌ఫామ్‌ కట్టాలని చెప్పి మూడు నెలలైనా ఇంతవరకు చేయలేదని మునిసిపల్‌ డీఈ, ఏఈలపై చైర్మన్‌ అసహనం వ్యక్తం చేశారు. లక్షల రూపాయలు పనులు చేస్తున్న కాంట్రాక్టర్ల్‌తో చిన్న పని వెంటనే చేయించలేకపోతున్నారన్నారు.

కాంట్రాక్టర్‌ను బతిమాలి రోడ్డు వేయించుకున్నాం : కౌన్సిలర్‌ వెంకటకృష్ణప్రసాద్‌

రోడ్డు భవనాలకు నిధుల్లేవు. కాంట్రాక్టర్‌ను బతిమాలి జగ్గయ్యపేట - చిల్లకల్లు రోడ్డు వేయించామని జగ్గయ్యపేట కౌన్సిల్‌ సమావేశంలో 8వ వార్డు వైసీపీ కౌన్సిలర్‌ సామినేని వెంకటకృష్ణ ప్రసాద్‌ అన్నారు. మునిసిపల్‌ చైర్మన్‌ రంగాపురం రాఘవేంద్ర అధ్యక్షతన జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో బుధవారం జగ్గయ్యపేట - చిల్లకల్లు రోడ్డు విస్తరణ అభివృద్ధి పనుల గురించి ప్రస్తావిస్తూ కాంట్రాక్టర్‌కు తన తండ్రి తో ఉన్న గత పరిచయాలతో బతిమిలాడి ఒప్పించి, ప్రజా శ్రేయస్సు దృష్ట్యా రోడ్డు వేయిస్తుంటే, మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య కాంట్రాక్టర్‌ను పిలిచి రోడ్డు వేయవద్దని బెదిరించారని ఆరోపించారు. కాంట్రాక్టర్‌ వెనక్కి తగ్గకుండా వేగంగా రోడ్డు వేశారన్నారు. కౌన్సిలర్‌ వ్యాఖ్యలపై టీడీపీ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. దాంతో వైసీపీ కౌన్సిలర్లు కృష్ణప్రసాద్‌కు మద్దతు వాగ్వాదానికి దిగటంతో సమావేశంలో గందరగోళం నెలకొంది.

Updated Date - 2023-06-01T00:36:01+05:30 IST