పాయ పేరుతో మాయ!

ABN , First Publish Date - 2023-01-22T00:26:10+05:30 IST

రంగు మారిన ధాన్యాన్ని సైతం రైతుకి నష్టం లేకుండా కొంటామని ప్రభుత్వ పెద్దలు ప్రకటనలు గుప్పిస్తుంటే.. కిందిస్థాయిలో అందుకు విరుద్దంగా జరుగుతోంది.. ఆరుగాలం కాయకష్టం చేసి పండించిన పంటను దోచుకోవటానికి అడ్డదారులు వెదుకుతున్నారు..

పాయ పేరుతో మాయ!
బిల్లుపై రూ. 1100 రాసిన విషయాన్ని చూపుతున్న రైతు

తోట్లవల్లూరు, జనవరి 21 : రంగు మారిన ధాన్యాన్ని సైతం రైతుకి నష్టం లేకుండా కొంటామని ప్రభుత్వ పెద్దలు ప్రకటనలు గుప్పిస్తుంటే.. కిందిస్థాయిలో అందుకు విరుద్దంగా జరుగుతోంది.. ఆరుగాలం కాయకష్టం చేసి పండించిన పంటను దోచుకోవటానికి అడ్డదారులు వెదుకుతున్నారు.. మద్దతు ధర రూ. 1530లో ఏకంగా రూ. 400 కొట్టేయటానికి మిల్లర్ల నుంచి ఆర్బీకే, పీఏసీఎస్‌ సిబ్బంది కలిసి ఆడుతున్న నాటకం బట్టబయలైంది. గరికపర్రుకు చెందిన రైతు బి.మధుసూదనరావు శనివారం విలేకరుల ఎదుట మిల్లర్‌, పీఏసీఎస్‌ ఉద్యోగి చేతివాటాన్ని బయట పెట్టాడు. ఈ నెల 6న ఉయ్యూరులోని శ్రీ రాధాకృష్ణా రైస్‌ మిల్లుకి 138 టిక్కీల ధాన్యాన్ని తీసుకు వెళ్లగా.. పాయ వచ్చిందని, రేటు తగ్గిస్తామని చెప్పారని, రూ.1300 చెప్పడంతో దానికి సరే అన్నట్టు రైతు చెప్పాడు. అయితే తనకు ఇచ్చిన కంప్యూటర్‌ కాటా బిల్లుపై రూ. 1100 రేటును చేతితో రాసిచ్చారని మధుసూదనరావు ఆరోపించాడు. ఇదిలా ఉంటే రూ. 30 వేలు చెల్లిస్తే తన బ్యాంకులో ధాన్యం డబ్బు పడుతుందని కబురు పెట్టారని రైతు పేర్కొన్నాడు. తాను చెల్లించనని చెప్పటంతో ఇంత వరకు తనకు డబ్బులు రాకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు.

తాను రూ.30 వేలు చెల్లిస్తే తన ఖాతాలో బస్తాకి మద్దతు ధర రూ. 1530 చొప్పున వచ్చేటట్టు చేసేవారని, దానిలో తనకు రూ.1100 ఇచ్చి పైన డబ్బులు కాజేసేవారని మధుసూదనరావు ఆరోపించాడు. దీనిపై పీఏసీఎస్‌ కార్యదర్శి శ్రీకాంత్‌ను వివరణ కోరగా మధుసూదనరావు 100 బ్యాగులే తోలాడని, పొరపాటున 138 మిల్లుకి తోలినట్టు బిల్లు కొట్టారని, అందుచేత రూ.30వేలు తిరిగి కట్టాలని కోరినట్టు చెప్పారు. ఆర్‌బీకే ధాన్యాన్ని పంపిన తరువాత మిల్లర్లు వివిధ కారణాలు చెప్పి మద్దతు ధరలో కోత విధిస్తున్నారని రైతులు బాహాటంగా పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని తహసీల్ధార్‌ కె.వెంకట శివయ్య దృష్టికి తీసుకెళ్లగా మధుసూదనరావు రూ.1100లకు ఇస్తానని మిల్లర్‌ దగ్గర ఒప్పుకుని రూ.1300 ఇవ్వాలని అంటున్నాడని తెలిపారు. రైతు డబ్బులు చెల్లించకుండా డబ్బులు వచ్చేటట్టు చర్యలు తీసుకున్నామని తెలిపారు.

Updated Date - 2023-01-22T00:26:12+05:30 IST