దసరా ఉత్సవాలను విజయవంతం చేయండి
ABN , First Publish Date - 2023-09-26T01:19:17+05:30 IST
ఇంద్రకీలాద్రిపై వచ్చే నెల 15 నుంచి జరగనున్న దసరా ఉత్సవాలకు సంబంధించి మంత్రుల స్థాయిలో తొలి సమన్వయ కమిటీ సమావేశం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించారు.

వన్‌టౌన్, సెప్టెంబరు 25: ఇంద్రకీలాద్రిపై వచ్చే నెల 15 నుంచి జరగనున్న దసరా ఉత్సవాలకు సంబంధించి మంత్రుల స్థాయిలో తొలి సమన్వయ కమిటీ సమావేశం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. అధ్యక్షత వహించిన డిప్యూటీ సీఎం, దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ దుర్గగుడిలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను అన్ని శాఖల సమన్వయంతో విజయవంతం చేయాలని సూచించారు. రెవెన్యూ, పోలీసు, ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ, నగరపాలక సంస్థ, విద్యుత్‌శాఖ, దేవదాయ శాఖల అధికారులు వారి పరిధిలో పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. భక్తుల మనోభావాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. కొండచరియలు విరిగిపటంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. దేవస్థానం ఇప్పటికే చర్యలు తీసుకుంటోందని తెలిపారు. దేవస్థానం ప్రాంగణం లో 24గంటల పాటు విద్యుత్ సరఫరా ఉండాలని, అదనపు జనరేటర్లు, ప్రత్యేక పవర్‌లైన్‌లను ఏర్పాటు చేయాలన్నారు. హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారి దర్శనం జరిగేలా పటిష్ట క్యూలైన్లు ఏర్పా టు చేయాలన్నారు. కలెక్టర్ దిల్లీరావు మాట్లాడుతూ అధికారులతో సమన్వయం చేసుకుని చిట్టచివరి భక్తుడికీ దర్శనం అందేలా చర్యలు తీసుకోవాలన్నా రు. ఈవో భ్రమరాంబ మాట్లాడుతూ అక్టోబరు 15 నుంచి జరగనున్న దసరా ఉత్సవాల్లో అమ్మవారికి చే సే అలంకారాలను వివరించారు. మూల నక్షత్రం నా డు సీఎం పట్టువస్త్రాలను సమర్పిస్తారన్నారు. 14 పా యింట్లలో దర్శనం టికెట్ల విక్రయాలకు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కనకదుర్గనగర్‌లో 11 ప్రసాదం కౌంటర్‌లు ఏర్పాటు చేస్తుండగా కొండపైన ఓం ట ర్నింగ్ వద్ద మరో కౌంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. సీతమ్మవారి పాదాల వద్ద 500, పున్నమిఘాట్ వద్ద 200, భవానీఘాట్ వద్ద 100 మొత్తం 800 షవర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, సీపీ కాంతిరాణా, ఎమ్మెల్సీ రుహుల్లా, మేయర్ భాగ్యలక్ష్మి, ట్రస్ట్‌బోర్డు చైర్మన్ రాంబాబు, జేసీ డాక్టర్ పి.సంపత్ కుమార్, వీఎంసీ కమిషనర్ స్వప్నిల్, తూర్పు వైసీపీ ఇన్‌చార్జి దేవినేని అవినాష్ హాజరయ్యారు.
ఈవోకు అదే అవమానం
దుర్గగుడి ఈవో డి.భ్రమరాంబ దేవదాయ శాఖ జాయింట్ కమిషనర్ హోదాలో దేవస్థానంలో పనిచేస్తున్నారు. దసరా ఉత్సవాలు మొత్తం ఆమె ఆధ్వర్యంలోనే జరగాలి. కానీ కమిటీ సమావేశంలో ఆమెకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రొటోకాల్ లేని వాళ్లను వేదికపై కూర్చోబెట్టగా కీలకమైన ఈవోను మాత్రం వేదిక దిగువన కూర్చోబెట్టడంపై ఆక్షేపణ వ్యక్తమవుతోంది. ఉద్యోగులు సైతం పెదవి విరిచారు. ఏదీ కావాలన్నా ఆమె సంతకం త ప్పనిసరిగా ఉండాలి. మహిళ హోంమంత్రి, మేయర్ మహిళలుగా ఉన్నా ఆమెను మాటమాత్రంగానైనా వేదికపైకి ఆహ్వానించకపోవడంపై సిబ్బంది, ఉద్యోగులు తమకవమానం జరిగినట్లుగా భావిస్తున్నారు.