అహింస రన్ జయప్రదం చేయండి
ABN , First Publish Date - 2023-03-05T00:00:52+05:30 IST
విశ్వశాంతిని కోరుతూ జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే జీతో రన్‌లో ప్రతిఒక్కరు భాగస్వాములై జయప్రదం చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.దిల్లీరావు కోరారు.
కలెక్టరేట్, మార్చి 4 : విశ్వశాంతిని కోరుతూ జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే జీతో రన్‌లో ప్రతిఒక్కరు భాగస్వాములై జయప్రదం చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.దిల్లీరావు కోరారు. ఏప్రిల్ 2వ తేదీన జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘అహింస మారథాన్’ పోస్టర్‌ను కలెక్టర్ శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రకృతి మనకు ఎన్నో వనరులను ప్రసాదించిందన్నారు. వాటిని కాపాడుకోవలసిన అవసరం సమాజంలో ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రపంచవ్యాప్తంగా విశ్వశాంతిని కోరుతూ పలు సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నదన్నారు. దీనిలో భాగంగా దేశ ప్రజలు ఐకమత్యం, అహింస, శాంతి మార్గాలతో నడవాలని, ప్రతి ఒక్కరు సుఖసంతోషాలతో ఉండాలని ఏప్రిల్ 2న నగరంలో అహింస రన్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
దేశ వ్యాప్తంగా 65 నగరాలలో 3కే, 5కే, 10కే మారథాన్ నిర్వహిస్తున్నారన్నారు. రన్‌లో వేలాదిగా ప్రజలు పాల్గొని జయప్రదం చేయడం ద్వారా అహింస, శాంతి మార్గాలను అనుసరించాలని కోరుతున్నామన్నారు. ఏప్రిల్ 4న శాంతి, అహింసలను కోరుకునే మహవీర్ జయంతిని పురస్కరించుకుని పలు కార్యక్రమాలను చేపడుతున్నారని, ఇందులో భాగంగా అహింస మారథాన్ నిర్వహించడం అభినందనీయమని కలెక్టర్ అన్నారు. జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ విజయవాడ చాప్టర్ కార్యదర్శి మనీష్ దోషి మాట్లాడుతూ, విజ్ఞానం, ఆర్ధిక-సాధికారణ, సమాజ సేవ ప్రధాన లక్ష్యాలతో తమ ఆర్గనైజేషన్ పనిచేస్తుందన్నారు. రన్‌లో పాల్గొనాలనే ఉత్సాహవంతులు డబ్ల్యూ.డబ్ల్యూ.డబ్ల్యూ.అహింసరన్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. వివరాలకు 9440280906 నెంబర్‌లో సంప్రదించాలని కోరారు.