Share News

హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు, జరిమానా

ABN , Publish Date - Dec 22 , 2023 | 01:17 AM

ఆస్తి వివాదం నేపథ్యంలో తాతయ్యను హతమార్చిన మనువడు పులి దుర్గారావు (43)పై నేరం రుజువవడంతో అతడికి జీవితఖైదు, జరిమానా విధిస్తూ 8వ అడిషనల్‌ డిస్ట్రిక్ట్‌ సెషన్స్‌ న్యాయాధికారి డి.లక్ష్మి గురువారం తీర్పు వెల్లడించారు.

హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు, జరిమానా

గుణదల, డిసెంబరు 21: ఆస్తి వివాదం నేపథ్యంలో తాతయ్యను హతమార్చిన మనువడు పులి దుర్గారావు (43)పై నేరం రుజువవడంతో అతడికి జీవితఖైదు, జరిమానా విధిస్తూ 8వ అడిషనల్‌ డిస్ట్రిక్ట్‌ సెషన్స్‌ న్యాయాధికారి డి.లక్ష్మి గురువారం తీర్పు వెల్లడించారు. ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం గవర్నర్‌పేట బీసెంట్‌రోడ్‌లోని ఒక ఇంటి కింద ఉన్న షాపును నగరానికి చెందిన వ్యక్తి అద్దెకు తీసుకుని జీవిస్తున్నాడు. ఇంటి యజమాని పులి అప్పారావు (93)కు అతడి మనవడు పులి దుర్గారావు (43)కు తరచూ ఆస్తి విషయమై గొడవ జరుగుతుండేది. వాదన ఎందుకని అద్దెకుంటున్న వ్యక్తి అడిగితే ఇది మా కుటుంబ వ్యవహారం మీరు రావద్దని దుర్గారావు చెప్పేవాడు. 2020 జూలై 22న తెల్లవారు జామున మేడపై నుంచి పెద్దగా కేకలు వినిపించాయి. కంగారుపడ్డ అద్దెకుంటున్న వ్యక్తి వచ్చి చూసేసరికి దుర్గారావు రక్తపు మరకలతో వెళ్లిపోతూ కనిపించాడు. పైకి వెళ్లి చూడగా అప్పారావు రక్తపు మడుగులో పడి ఉన్నాడు. అద్దెకుంటున్న వ్యక్తి తక్షణమే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. గవర్నర్‌పేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి జూలై 23న పరారీలో ఉన్న దుర్గారావును అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. పోలీసులు పొందుపర్చిన చార్జిషీటు ఆధారంగా దర్యాప్తు మొదలు పెట్టిన న్యాయస్థానం 10 మంది సాక్షులను విచారించింది. నిందితుడిపై నేరం రుజువవడంతో పులి దుర్గారావుకు జీవితఖైదు రూ.500 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.

Updated Date - Dec 22 , 2023 | 01:17 AM