మో‘డల్‌’.. లే అవుట్‌!

ABN , First Publish Date - 2023-01-18T00:01:20+05:30 IST

పునాదులు దాటని ఇళ్ల నిర్మాణాలు..! పునాదులతోనే ఆగిపోయిన నిర్మాణాలు..! ఆ నిర్మాణాల్లోనే పిచ్చి పొదలు.. నున్నలో తలపెట్టిన మోడల్‌ లే అవుట్‌ తీరిది. జగనన్న కాలనీలలో కెల్లా ది బెస్ట్‌ లే అవుట్‌ ఇది. మోడల్‌ లే అవుట్‌లోనే పరిస్థితులు ఎంత అధ్వానంగా ఈ ఫొటోను బట్టి తెలుస్తోంది. డబ్బులు రాక కట్టుకునేవారు కూడా పనులు నిలిపివేయటంతో... పునాది దశలోనే ఇళ్లున్నాయి. ఆ పునాది నిర్మాణాల్లో కూడా గడ్డి, పిచ్చి మొక్కలు, పొదలు పెరుగుతున్నాయే తప్ప.. గోడలు మాత్రం ఎదగటం లేదు. ఒకవైపు నాసిరకం పనులు, మరోవైపు ఆగిపోయిన పనులు వెరసి నున్నలోని జగనన్న మోడల్‌ లే అవుట్‌ కాలనీ అపహాస్యం పాలౌతోంది

 మో‘డల్‌’.. లే అవుట్‌!

నున్న లే అవుట్‌లో పునాదుల్లోనే పొదలు.. నాసిరకం బేస్‌మెంట్‌ నిర్మాణాలు

లబ్ధిదారులు స్వయంగా నిర్మించుకునే ఇళ్లు కూడా పునాదులకే పరిమితం

అక్టోబరు నుంచి బిల్లులు రాకపోవటంతో.. నాలుగు నెలలుగా నిలిచిన పనులు

బేస్‌మెంట్‌ నిర్మాణాల్లో ఏపుగా పెరుగుతున్న పిచ్చి మొక్కలు, దుబ్బులు

పునాదులు దాటని ఇళ్ల నిర్మాణాలు..! పునాదులతోనే ఆగిపోయిన నిర్మాణాలు..! ఆ నిర్మాణాల్లోనే పిచ్చి పొదలు.. నున్నలో తలపెట్టిన మోడల్‌ లే అవుట్‌ తీరిది. జగనన్న కాలనీలలో కెల్లా ది బెస్ట్‌ లే అవుట్‌ ఇది. మోడల్‌ లే అవుట్‌లోనే పరిస్థితులు ఎంత అధ్వానంగా ఈ ఫొటోను బట్టి తెలుస్తోంది. డబ్బులు రాక కట్టుకునేవారు కూడా పనులు నిలిపివేయటంతో... పునాది దశలోనే ఇళ్లున్నాయి. ఆ పునాది నిర్మాణాల్లో కూడా గడ్డి, పిచ్చి మొక్కలు, పొదలు పెరుగుతున్నాయే తప్ప.. గోడలు మాత్రం ఎదగటం లేదు. ఒకవైపు నాసిరకం పనులు, మరోవైపు ఆగిపోయిన పనులు వెరసి నున్నలోని జగనన్న మోడల్‌ లే అవుట్‌ కాలనీ అపహాస్యం పాలౌతోంది

(ఆంధ్రజ్యోతి, విజయవాడ / విజయవాడ రూరల్‌ ) : జగనన్న కాలనీలలో కెల్లా మోడల్‌గా ఎన్టీఆర్‌ జిల్లాలో చెప్పుకుంటున్న నున్న లే అవుట్‌లో ఇళ్ళ నిర్మాణాలు పునాదుల దశ దాటడం కష్టంగా ఉంటోంది. కాంట్రాక్టర్ల నాసి రకపు పనులు ఒకవైపు, ఆగిపోయిన పనులు మరోవైపు వెరసి నున్న లే అవుట్‌ దుస్థితిని చాటుతున్నాయి. పునాదుల దశలోని నిర్మాణాలు పిచ్చిమొక్కలు, దుబ్బులు పేరుకుని శిథిల స్థితికి చేరుతున్నాయి. మోడల్‌ లే అవుట్‌ కోసం నున్నలో 189.44 ఎకరాల విస్తీర్ణంలో జిల్లా యంత్రాంగం భూ సేకరణ జరిపింది. గ్రామీణ ప్రాంతాల వారి కోసం 113.65 ఎకరాల విస్తీర్ణంలో ఒక లే అవుట్‌, పట్టణ ప్రాంతాల వారి కోసం 75.79 ఎకరాల విస్తీర్ణంలో మరో లే అవుట్‌ను విభజించి మొత్తాన్ని మెగా లే అవుట్‌గా మార్చారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు 6,343 ఇళ్లు, విజయవాడలో నివశిస్తున్న వారికి 4,199 ఇళ్లు చొప్పున మొత్తంగా 10,532 ఇళ్ల నిర్మాణానికి పూనుకుంది. ఇంత వరకు బాగానే ఉంది. నూటికి 70 శాతం మేర ఇక్కడ ఇళ్ల నిర్మాణ పనులు గ్రౌండింగ్‌ దశకు వచ్చాయి. కానీ నిర్మాణ పనులు పునాదులు దాటడం లేదు. పునాదుల దశలోనే సింహభాగం ఇళ్ల నిర్మాణాలు ఆగిపోయాయి. వీటిలో కాంట్రాక్టర్ల నాసి రకపు పనులు, అర్ధంతరంగా వదిలి వెళ్ళిపోవటమే కారణం. మోడల్‌ లే అవుట్‌లో ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఆప్షన్‌ ఇచ్చిన లబ్ధిదారులకు సంబంధించి కాంట్రాక్టర్ల ద్వారా ఇళ్ల నిర్మాణ పనులకు అధికారులు శ్రీకారం చుట్టారు. కాంట్రాక్టర్లు ఇళ్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. వీటిలో చాలా వరకు కాంట్రాక్టర్లు చేపట్టినవి. ఇవన్నీ అత్యంత నాసిరకంగా ఉంటున్నాయి. కాంట్రాక్టర్లు బేస్‌మెంట్‌ పనులు మాత్రమే చేపట్టారు. ఈ పనులు కూడా అత్యంత దారుణంగా ఉంటున్నాయి. బేస్‌మెంట్‌కు సంబంధించి పైకి కనిపించే బెడ్‌లు, పిల్లర్ల నిర్మాణాలు చూస్తే నాసిరకంగా ఉంటున్నాయి. బలంగా నిర్మించాల్సిన పిల్లర్లను ఊగిపోయేలా బలహీనంగా నిర్మించారు. బెడ్‌లు కూడా ఓ పద్ధతిగా లేవు. పిల్లర్లు మధ్య మధ్యలో విరిగిపోయి ఉండటం కనిపిస్తున్నాయి. ఈ దృశ్యాలు చూస్తే కచ్చితంగా ఆందోళన చెందాల్సిందే. మెటీరియల్‌ను మిగుల్చుకోవటానికి పడిన కక్కుర్తి కారణంగా.. పిల్లర్లు బలహీనంగా నిర్మించారు. కొన్ని ఇళ్లకు ఆరు పిల్లర్లు వేయాల్సి ఉండగా.. నాలుగు పిల్లర్లు మాత్రమే వదిలేశారు. ఆ నాలుగు పిల్లర్లు కూడా నాసిరకంగా నిర్మించారు. మిగిలిన రెండు పిల్లర్ల స్థానంలో గోడలను నిర్మించి స్లాబు వేసే ఆలోచనతో కాంట్రాక్టర్లు ఈ పని చేసినట్టుగా తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులను కూడా ప్రభుత్వం విడుదల చేయకపోవటంతో.. కాంట్రాక్టర్లు పలువురు తాము మిగుల్చుకున్నంత మేర మిగుల్చుకుని వివిధ దశల పనులు పూర్తి కాకుండానే జారుకున్నారు. దీంతో పనులు ఆగిపోయాయి. నాసిరకపు పనుల తాలూకా బేస్‌మెంట్‌ పనుల దృశ్యాలు వెక్కిరిస్తున్నాయి. దీంతో పాటు లబ్ధిదారులు స్వయంగా కట్టుకునే గృహాలు కూడా సింహభాగం బేస్‌మెంట్‌ దశలోనే ఆగిపోయాయి. దీనికి కారణంగా అక్టోబరు నెల నుంచి ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోవటమే కారణం. ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోవటంతో.. లబ్ధిదారులు బేస్‌మెంట్‌ వరకే నిర్మాణాలు చేపట్టి వదిలేశారు. గత నాలుగు నెలలుగా పనులు జరగకపోవటంతో.. నున్న మోడల్‌ లే అవుట్‌లో బేస్‌మెంట్‌ పనులు చేపట్టిన ప్రాంతంలో పిచ్చి చెట్లు ఏపుగా పెరుగుతున్నాయి. దుబ్బులు పొదలతో నిండిపోతున్నాయి. బేస్‌మెంట్‌ దశలోనే నెలల తరబడి ఆగిపోవటంతో.. ఈ పరిస్థితి దాపురించింది. ఇలానే మరో నాలుగైదు నెలలు ఉంటే.. ఈ పునాదులు కూడా కనిపించే అవకాశం ఉండదు. ప్రజలు తమ దగ్గర డబ్బులు లేకపోయినా.. అప్పులు చేసి మరీ ముందస్తుగా బేస్‌మెంట్‌ నిర్మాణ పనులు చేపట్టారు. చేసిన బేస్‌మెంట్‌ పనులకు సంబంధించి డబ్బులు రాకపోవటంతో.. లబోదిబోమంటున్నారు. అప్పులకు వడ్డీలు చెల్లించలేక నానా అవస్థలు పడుతున్నారు. అగచాట్లు పడుతున్నారు. మోడల్‌ లే అవుట్‌గా చెప్పుకుంటున్న చోటే ఇళ్ల నిర్మాణాల పరిస్థితి ఈ విధంగా ఉందంటే ఇక మిగిలిన లే అవుట్ల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవాల్సిందే.

Updated Date - 2023-01-18T00:01:26+05:30 IST