కబ్జాకాండ!

ABN , First Publish Date - 2023-06-01T00:21:09+05:30 IST

దోపిడీకి కాదేదీ అనర్హం అన్నట్టుంది వైసీపీ నాయకుల తీరు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య ధోరణి కూడా వీరికి కలిసి వచ్చింది. ఒక వైసీపీ నాయకుడు భూకబ్జాలకు పాల్పడుతుంటే... మరొక నాయకుడేమో ఏకంగా రైల్వే ఆస్తులను కైంకర్యం చేసే పనిలో పడ్డాడు. దర్జాగా సొంత ఆస్తిలా రిజిస్ట్రేషన్‌ కూడా చేసుకున్నాడు. గుడివాడలో ఈ దందా మూడు పూలు ఆరు కాయలు అన్న చందంగా సాగుతోంది.

కబ్జాకాండ!

భూ యజమానులకు తెలియకుండా 69 సెంట్ల అక్రమ రిజిస్ట్రేషన్‌

4 సెంట్ల రైల్వే స్థలం కూడా రిజిస్ట్రేషన్‌

వైసీపీ నాయకుల దందా

మార్కెట్‌ యార్డు చైర్మన్‌ భర్త బరితెగింపు

దోపిడీకి కాదేదీ అనర్హం అన్నట్టుంది వైసీపీ నాయకుల తీరు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య ధోరణి కూడా వీరికి కలిసి వచ్చింది. ఒక వైసీపీ నాయకుడు భూకబ్జాలకు పాల్పడుతుంటే... మరొక నాయకుడేమో ఏకంగా రైల్వే ఆస్తులను కైంకర్యం చేసే పనిలో పడ్డాడు. దర్జాగా సొంత ఆస్తిలా రిజిస్ట్రేషన్‌ కూడా చేసుకున్నాడు. గుడివాడలో ఈ దందా మూడు పూలు ఆరు కాయలు అన్న చందంగా సాగుతోంది.

గుడివాడ : గుడివాడ-భీమవరం రైల్వే డబ్లింగ్‌ పనులు 2013-14 సంవత్సరంలో ప్రారంభించారు. రెండో రైల్వే లైను ఏర్పాటుకు కావలసిన భూమిని రైల్వే శాఖ రైతుల నుంచి కొనుగోలు చేసింది. కరోనా సమయంలో అసలు ఆస్తిపరులకు తెలియకుండా గుడివాడ మార్కెట్‌ యార్డు చైర్మన్‌ మోండ్రు సునీత భర్త అయిన నందివాడ మండలం రామాపురం మాజీ సర్పంచ్‌ వెంకటేశ్వరరావు గుడివాడ రెవెన్యూ పరిధిలోని ఆర్‌.ఎస్‌ నెం. 448/2లో 69 సెంట్ల స్థలాన్ని గజాల లెక్కన తన కుమార్తెల పేరున దర్జాగా రిజిస్ట్రేషన్‌ చేసేసుకున్నారు. అసలు హక్కుదారులైన కాకరాల వెంకట్రామయ్య, కాకరాల రవిశంకర్‌లకు తమకు తెలియకుండా 69 సెంట్ల స్థలాన్ని దొంగ రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని ఏకంగా కలెక్టర్‌కు స్పందనలో ఫిర్యాదు చేశారు. రెవెన్యూ యంత్రాంగం కదిలింది. క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లిన రెవెన్యూ అధికారులు షాక్‌కు గురయ్యారు. రైల్వే రెండో లైనుకు సంబంధించి 4 సెంట్ల స్థలం కూడా అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేయించినట్టు నిర్ధారించుకున్నారు. వెంటనే రెవెన్యూ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.

కంగుతిన్న రెవెన్యూ అధికారులు

రైల్వే డబ్లింగ్‌ నిమిత్తం కొనుగోలు చేసిన భూమిని రైల్వే శాఖ పేరున బదిలీ చేయమని రైల్వే అధికారులు రెవెన్యూ అధికారులను కోరారు. రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం వల్ల పదేళ్లుగా ఎక్కడా రైల్వే ఆస్తిగా చూపిన దాఖలాలు లేవు. క్షేత్రస్థాయిలో పరిశీలనతో చేసిన తప్పు బయట పడటంతో రెవెన్యూ అధికారులు నాలుక్కరుచుకున్నారు. ఒకపక్క మాజీ మంత్రి, మరోపక్క కలెక్టర్‌, ఇంకోపక్క రైల్వే శాఖ.... ప్రశ్నించడంతో అక్రమార్కులకు ఏమి చేయాలో పాలుపోక కుడితిలో పడ్డ ఎలుకలా గిలగిలా కొట్టుకుంటున్నారు. అయితే దొంగ రిజిస్ట్రేషన్‌కు కారకుడైన వ్యక్తి మాజీ మంత్రి కొడాలి నాని ముఖ్య అనుచరుల్లో ఒక్కడు కావడంతో అధికారులు మింగలేక కక్కలేక తలలు పట్టుకుంటున్నారు. జరిగిన పొరపాటు కలెక్టర్‌ దృష్టికి వెళితే తమ పరిస్థితి ఏమిటా అని మల్లగుల్లాలు పడుతున్నారు.

రైల్వే శాఖ ఊరుకుంటుందా?

రైల్వేకు చెందిన ఆస్తి ఏకంగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్నట్టు తెలిస్తే వారు తీసుకునే చర్యలు ఏ విధంగా ఉంటాయో అని రెవెన్యూ వర్గాలు భయపడుతున్నాయి. ఎలాగోలా గుట్టుచప్పుడు కాకుండా వివాదాన్ని సద్దుమణిగించాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

Updated Date - 2023-06-01T00:21:09+05:30 IST