కువైట్.. రైట్ రైట్..
ABN , First Publish Date - 2023-02-20T00:57:34+05:30 IST
బెజవాడ విమానాశ్రయం నుంచి కువైట్‌కు అంతర్జాతీయ సర్వీసు ప్రారంభం కానుంది.
ఉన్నతాధికారులకు ఎయిర్ ఇండియా ప్రతిపాదన
బైలేట్రల్ ట్రాఫిక్ రైట్స్ కోసం ఏఏఐకు లేఖ
త్వరలో కేంద్ర పరిశీలనలోకి విజయవాడ ప్రతిపాదన
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : బెజవాడ విమానాశ్రయం నుంచి కువైట్‌కు అంతర్జాతీయ సర్వీసు ప్రారంభం కానుంది. కువైట్ నుంచి విజయవాడకు అరైవల్ ఫ్లైట్ నడుపుతున్న ఎయిరిండియా నుంచి డిపార్చర్ సర్వీసుకు ప్రతిపాదన వచ్చింది. దీంతో విమానాశ్రయ అధికారులు స్లాట్ కోసం పౌర విమానయాన శాఖకు నివేదించారు. కువైట్ నుంచి విజయవాడ విమానాశ్రయానికి ప్రతి బుధవారం అంతర్జాతీయ విమాన సర్వీసు నడుస్తోంది. ఈ సర్వీసు విజయవాడ నుంచి బయల్దేరట్లేదు. విజయవాడ నుంచి కూడా బయల్దేరడానికి వీలుగా విమానయాన సంస్థ నుంచి ప్రతిపాదన వచ్చింది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మస్కట్, షార్జాలకు విమాన సర్వీసులు నడుస్తుండగా, ఇటీవలే మస్కట్ సర్వీసును సంబంధిత విమానయాన సంస్థ రద్దు చేసుకుంది. ప్రయాణికుల ఆదరణ లేక ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విమానం హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చి ఇక్కడి నుంచి తిరిగి మస్కట్ వెళ్లేది. ప్రయాణికులు లేకపోవటం వల్ల ఈ సర్వీసును అర్ధంతరంగా రద్దు చేసుకున్నారు. ఈ సర్వీసు స్థానంలో షార్జాకు రెండో సర్వీసును ప్రారంభించారు.
బైలేట్రల్ ట్రాఫిక్ రైట్స్ కోసం లేఖ
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి బైలేట్రల్ ట్రాఫిక్ రైట్స్ కల్పించాల్సిందిగా విజయవాడ విమానాశ్రయ అధికారులు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాకు లేఖ రాశారు. విజయవాడ నుంచి మరిన్ని అంతర్జాతీయ సర్వీసులు నడవాలంటే బైలేట్రల్ ట్రాఫిక్ రైట్స్ అవసరం. ప్రస్తుతం షార్జాకు సర్వీసులు నడుస్తున్నాయంటే ఆ దేశంతో బైలేట్రల్ ట్రాఫిక్ రైట్స్ ఉండటమే. విజయవాడ విమానాశ్రయానికి అవి లేకపోవటంతో విమానయాన సంస్థలు పెద్దగా ఆసక్తి చూపించట్లేదు.
డిమాండ్ ఉన్న విదేశాలివే..
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తూర్పు ఈశాన్య, మధ్య ఆసియా దేశాలకు ఎంతో కనెక్టివిటీ ఉంటుంది. ఈ ప్రాంతాలకు డిమాండ్ కూడా ఎక్కువ ఉంది. కోస్తా జిల్లాల నుంచి ఆయా విదేశాలకు రాకపోకలు సాగించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. విదేశాల్లో తమ పిల్లల చదువులు, ఉద్యోగాల నేపథ్యంలో రాకపోకలు సాగించటం తరచూ జరుగుతూ ఉంటుంది. వ్యాపార లావాదేవీలు, పర్యాటక యాత్రల కోసం విరివిగా వెళ్తుంటారు. హైదరాబాద్ నుంచి వెళ్లే వారిలో దాదాపు 40 శాతం మంది విదేశీ ప్రయాణికులు కోస్తా జిల్లాల నుంచే ఉంటారు. విజయవాడ నుంచి మరిన్ని అంతర్జాతీయ విమానాలు నడిస్తే వీరంతా హైదరాబాద్ వెళ్లే అవసరం ఉండదు. దీనిని దృష్టిలో ఉంచుకుని విమానాశ్రయ అధికారులు తాజాగా ఏఏఐకు బైలేట్రల్ ట్రాఫిక్ రైట్స్‌కు సంబంధించి లేఖ రాశారు. దీనిని ఎయిర్ ఇండియా పరిశీలిస్తోంది. ఈ అంశాన్ని త్వరలో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్టు తెలుస్తోంది.