కంకిపాడు బస్టాండ్‌లో కీచకుడు
ABN , First Publish Date - 2023-01-11T00:54:41+05:30 IST
ఆర్టీసీలో మహిళా ఉద్యోగులకు రక్షణ కరువైంది. కామం తలకెక్కిన కీచకులు మహిళలను లైంగికంగా వేధించటంతో పాటు హీనంగా చూస్తున్నారు. అసభ్యంగా, తప్పుగా మాట్లాడుతూ మహిళా ఉద్యోగులను వేధిస్తున్నారు. కంకిపాడు బస్ డిపోలో తాజాగా జరిగిన సంఘటనే ఇందుకు నిదర్శనం.
కన్నీటిపర్యంతమైన ఉద్యోగిని
ప్రయాణికుల అండతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు
విచారణాధికారి ఓవరాక్షన్
ప్రయాణికులతో అనుచితంగా..
(ఆంధ్రజ్యోతి, విజయవాడ /ఉయ్యూరు) : ఉయ్యూరు ఆర్టీసీ బస్ డిపో పరిధిలోని కంకిపాడు బస్టాండ్‌లో ఆన్ డ్యూటీ ఓడీ కంట్రోలర్ వీఎస్ రెడ్డి కామంతో ప్రవర్తిస్తున్నాడు. ఉన్నతాధికారుల దగ్గర పలుకుబడి, రాజకీయ నేతల పరిచయాలు, ధనబలంతో తరచూ మహిళా కండక్టర్లపై వేధింపులకు పాల్పడుతున్నాడు. లైంగిక వేధింపులపై గొంతెత్తాలన్నా భయపడేలా చేయటం ఈ కీచకుడి నైజం. ప్రయాణికులు అండగా నిలబడటంతో ఓ బాధిత మహిళా కండక్టర్ డిపో మేనేజర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన గుడివాడ డిపో సీఐ ఆధ్వర్యంలో విచారణకు ఆదేశించారు. సదరు విచారణాధికారి తన పాత్ర తాను నిర్వహించకుండా సాక్షులుగా ఉన్న ప్రయాణికులకు ఫోన్లు చేసి అనుచిత వ్యాఖ్యలు చేయటం దుమారం రేపుతోంది.
జరిగింది ఇదీ..
ఈనెల 2వ తేదీన రూట్ నెంబర్ 203కే కుందే రు బస్సులో పనిచేస్తున్న మహిళా కండక్టర్ ఉయ్యూరు డిపో నుంచి కంకిపాడు బస్టేషన్‌కు వచ్చారు. బస్సు దిగి ప్రయాణికులను ఎక్కించుకోవటానికి ఆమె లౌడ్ అండ్ షౌట్ (పెద్దగా అరవడం) చేస్తున్నారు. కంకిపాడు బస్‌స్టేషన్‌లో ఆన్ డ్యూటీలో ఉన్న ఓడీ కంట్రోలర్ తన పక్కనే ఉన్న మరో వ్యక్తితో ‘డబ్బు ఇస్తే వీరెందుకు రారు..‘ అని మహిళా కండక్టర్‌ను ఉద్దేశించి అసభ్యంగా అన్నాడు. అంతేకాదు.. ఆమె వద్దకు వచ్చి ‘డబ్బు ఇస్తా.. వస్తావా..‘ అని అడిగాడు. ఈ విషయాన్ని కండక్టర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే తాను షాక్‌కు గురయ్యానని, తేరుకున్న తర్వాత పిచ్చిపిచ్చిగా ఉందా? దిశ యాక్ట్ కేసు పెడతానని హెచ్చరించానని ఆమె తెలిపారు. అవమానంతో, దుఃఖంతో బాధపడుతున్న ఆమెను బస్సులోని ప్రయాణికులు ఓదార్చారు. అలాంటి వారిని ఉపేక్షించకూడదన్నారు. అవసరమైతే ఉన్నతాధికారులకు తాము జరిగింది చెబుతామని ఆమెకు అండగా నిలిచారు. బస్సు కాళేశ్వరరావు మార్కెట్‌కు వచ్చాక డిపో దిశ కమిటీ సభ్యురాలైన కె.స్వరూపరాణికి ఆమె ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని ఎస్‌ఆర్‌లో కూడా నమోదు చేశారు. డ్యూటీ దిగిన అనంతరం మహిళా కండక్టర్ ఇంటికి వెళ్లి కండక్టరైన తన భర్తకు ఈ విషయాన్ని వివరించారు. అనంతరం డిపో మేనేజర్‌కు కూడా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై డిపో మేనేజర్ వెంటనే స్పందించి విచారణకు ఆదేశించారు.
విచారణాధికారి అతి
విచారణాధికారిగా గుడివాడ డిపో సీఐను నియమించారు. ఆన్‌డ్యూటీ ఓడీ కంట్రోలర్‌పై విచారణ జరపాల్సిన విచారణాధికారి అత్యుత్సాహం ప్రదర్శిం చటం విమర్శలకు తావిస్తోంది. మహిళా కండక్టర్‌కు మద్దతుగా బస్సులోని ప్రయాణికులు ఉన్నారు. ఫిర్యా దులో వారి పేర్లు, ఫోన్ నెంబర్లు చేర్చారు. వారికి విచారణాధికారి ఫోన్లు చేసినట్టు తెలుస్తోంది. లేనిపోని ప్రశ్నలతో ఇబ్బంది పెట్టినట్టు సమాచారం. ప్రయాణికులు ఉద్దేశపూర్వకంగా సాక్షులుగా ఉన్నట్టుగా ఆయన తీరు ఉండటం విస్మయం గొలుపుతోంది.
ఆది నుంచి వివాదాస్పదుడే..
ఆన్‌డ్యూటీ కంట్రోలర్ వీఎస్ రెడ్డికి ఉన్నతాధికారుల దగ్గర పలుకుబడి ఉండటం, రాజకీయ నాయకులు బాగా తెలిసి ఉండటం, ధనబలం కావడంతో ఇప్పటికే ఎన్నో ఆరోపణలు ఉన్నా శిక్షలు పడలేదు. గతంలో ఉయ్యూరు డిపోలనే పనిచేసిన ఓ మహిళా కండక్టర్‌ను కూడా లైంగికంగా వేధిస్తుండటంతో ఫిర్యాదు చేశారని, అప్పుడు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, మచిలీపట్నం డిపోకు బదిలీ చేసి చేతులు దులుపుకొన్నారని, తిరిగి ఏడాదిలోనే మళ్లీ ఉయ్యూరు డిపోకు వచ్చాడని చెబుతున్నారు. కాగా, ఈ వ్యవహారంలో ఆర్టీసీ విజయవాడ జోన్ ఈడీ గిడుగు వెంకటేశ్వరరావు కల్పించుకుంటే తప్ప న్యాయం జరగదని మహిళా కండక్టర్లు వాపోతున్నారు. తక్షణం ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవటంతో పాటు జోన్ స్థాయి అధికారిని సమగ్ర విచారణకు ఆదేశించాలని కోరుతున్నారు.