ప్రతి ఇంటికీ రక్షితనీరే జలజీవన్‌ మిషన్‌ లక్ష్యం

ABN , First Publish Date - 2023-06-07T00:39:52+05:30 IST

ప్రతి కుటుంబానికి రక్షితనీటిని సరిపడా అందించాలని కేంద్ర జలజీవన్‌ మిషన్‌ కార్యదర్శి విని మహజన్‌ అన్నారు. కేంద్ర జలజీవన్‌ మిషన్‌ కింద ఎంపికైన పొందుగలలో ఆమె పర్యటించారు.

ప్రతి ఇంటికీ రక్షితనీరే జలజీవన్‌ మిషన్‌ లక్ష్యం
మహజన్‌కు స్వాగతం పలుకుతున్న గిరిజన మహిళలు

మైలవరం రూరల్‌, జూన్‌ 6: ప్రతి కుటుంబానికి రక్షితనీటిని సరిపడా అందించాలని కేంద్ర జలజీవన్‌ మిషన్‌ కార్యదర్శి విని మహజన్‌ అన్నారు. కేంద్ర జలజీవన్‌ మిషన్‌ కింద ఎంపికైన పొందుగలలో ఆమె పర్యటించారు. పొందు గలకు రూ.1.25కోట్లు మంజూరుకాగా, రూ.55లక్షలతో నిర్మించిన రక్షితనీటి ట్యాంకును కలెక్టర్‌ దిల్లీరావు, సర్పంచ్‌ కోటమ్మ, ఎంపీపీ ఇస్లావత్‌ ప్రసన్నరాణి లతో కలిసి ప్రారంభించారు. గ్రామంలో ఇంటింటికి మంచినీటి కుళాయిలు, పారిశుధ్య వ్యవస్థను, విజయవాహిని చారిటబుల్‌ ట్రస్టు, టాటా ట్రస్టు సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఐవోడీ సిస్టం, క్లోరినేషన్‌ ప్రక్రియను పరిశీలించి పలు సూచనలు చేశారు. గిరిజన తండాలోని ముత్యాలమ్మ దేవాలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడుతూ నీటిని పొదుపుగా వినియోగించాలని, వృథాను అరికట్టాలని సూచించారు. ఈసందర్భంగా గ్రీన్‌ అంబాసిడర్లు, విలేజ్‌ వాటర్‌ శానిటేషన్‌ కమిటీని విధుల నిర్వహణ, పనిచేసే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ఇంకుడు గుంతలు తవ్వుకొని భూగర్భజలాలు పెరిగేలా చూడాలని, పచ్చదనం, పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు.

జూపూడిలో..

గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అన్ని రకాల సేవలను ప్రజలకు అందుబాటులో ఉంచటం అభినందనీయమని కేంద్ర జల జీవన్‌ మిషన్‌ కార్యదర్శి విని మహాజన్‌ అన్నారు. జూపూడిలో మంగళవారం పర్యటించారు. జూపూడి ఇప్పటికే బహిరంగ మలవిసర్జన రహిత గ్రామంగా కేంద్రం గుర్తించిందన్నారు. రక్షితనీటిని ప్రజలకు అందిస్తున్న తీరును ఆమె అధికారులను అడిగి తెలుసుకున్నారు. చెత్త నుంచి సంపద తయారు చేసే కేంద్రాల పనితీరును ప్రశంసించారు. గ్రామీణ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకే కేంద్రం వివిధ పథకాలను అమలుచేస్తుందన్నారు. అనంతరం అంగన్‌వాడీ, ఆశా వర్కర్లలతో ఆమె ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. గ్రామాల అభివృద్ధికి వివిధ పథకాలకు వస్తున్న నిధుల వివరాలను రాష్ట్ర పంచాయతీ రాజ్‌, రూరల్‌ డెవలప్‌మెంట్‌ ప్రత్యేక కార్యదర్శి బుడితి రాజశేఖర్‌, కేంద్ర ప్రభుత్వ నిధులతో జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులను కలెక్టర్‌ దిల్లీరావు వివరించారు. కార్యక్రమంలో జేసీ డాక్టర్‌ పి.సంపత్‌కుమార్‌, సబ్‌కలెక్టర్‌ అదితి సింగ్‌, జిల్లా పంచాయతీ అధికారి జె.సునీత, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాస్‌, ఎంపీడీవో రామకృష్ణ నాయక్‌, తహసీల్దార్‌ సూర్యారావు, సర్పంచ్‌ కాకి దేవమాత, జడ్పీ వైస్‌ చైర్మెన్‌ జి.శ్రీదేవి, ఎంపీపీ పాలడుగు జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-07T00:39:52+05:30 IST