రన్‌వేకు దారేదీ?
ABN , First Publish Date - 2023-07-01T01:05:57+05:30 IST
అంతర్జాతీయ స్థాయిలో రన్ వే నిర్మాణం.. అత్యాధునిక టెక్నాలజీతో అందంగా రూపకల్పన.. రూ.కోట్లలో ఖర్చు.. అయినా పూర్తిస్థాయిలో వినియోగించుకునే అవకాశమే లేని పరిస్థితి. విజయవాడ విమానాశ్రయంలో విస్తరించిన నూతన రన్ వే ఆపరేషన్స్‌కు పేదల నివాసాలు ప్రతిబంధకంగా మారుతున్న నేపథ్యంలో నిర్వాసితులను వారికి కేటాయించిన ప్రాంతాల్లోకి పంపేయాలని ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) నుంచి జిల్లా యంత్రాంగానికి ప్రతిపాదన వచ్చింది. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చతికిలపడిన ఈ సమస్యను ఏం చేయాలా అని యంత్రాంగం దిక్కులు చూస్తోంది.
వెంటనే నిర్వాసితులను తరలించాలంటున్న ఏఏఐ
ఇంకా అపరిష్కృతంగానే నిర్వాసితుల సమస్య
ఆర్‌అండ్‌ఆర్ లే అవుట్‌లో ఇళ్ల నిర్మాణానికి డబ్బివ్వని ప్రభుత్వం
తమ భూములను వదలని నిర్వాసితులు
నూతన రన్ వేకు అడ్డంకులే..
సందిగ్ధంలో జిల్లా యంత్రాంగం
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : విజయవాడ విమానాశ్రయ నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కల్పనలో ప్రభుత్వం అంతులేని నిర్లక్ష్యం చూపిస్తోంది. విస్తరణ క్రమంలో ఇళ్లు కోల్పోయిన 423 మందికి కిందటి టీడీపీ ప్రభుత్వ హయాంలో చిన్న అవుటపల్లి గ్రామంలో 48 ఎకరాలు సేకరించారు. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కల్పించి, వారందరినీ అక్కడికి తరలించాలని నాటి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం లే అవుట్ కూడా వేసింది. అర్హులైన నిర్వాసితులను గుర్తించి, వారికి మోడల్ ఇళ్లు నిర్మించి, సకల సదుపాయాలతో తీర్చిదిద్దాలనుకుంది. పనులు కూడా ప్రారంభించింది. ఈలోపు ఎన్నికలు రావడం, వైసీపీ అధికారం చేపట్టడంతో రెండేళ్ల పాటు ఈ అంశాన్ని పక్కన పెట్టేశారు. నిర్వాసితుల పోరుబాట ఫలితంగా ఆర్‌అండ్‌ఆర్ ప్యాకే జీపై ప్రభుత్వం స్పందించింది. మోడల్ ఇళ్లు నిర్మించలేమని, నిర్వాసితులే ఇళ్లు కట్టుకునేందుకు రూ.9 లక్షల చొప్పున రెండు వాయిదాల్లో ఇస్తామని తెలిపింది. ఆ తర్వాత ఈ ప్రతిపాదనను కూడా పక్కన పెట్టేసింది. మళ్లీ నిర్వాసితులు ఆందోళన బాట పట్టారు. దీంతో లాటరీ తీసి చిన్న అవుటపల్లి లే అవుట్‌లో ప్లాట్లను కేటాయించారు. ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. తీరా నెలలు గడిచినా ఇళ్లు కట్టుకోవటానికి ప్రభుత్వం డబ్బు ఇవ్వలేదు. నిర్వాసితుల ఆందోళనల నేపథ్యంలో రూ.111 కోట్లు కేటాయిస్తూ జీవో ఇచ్చింది. అయినా నేటికీ డబ్బు విడుదల కాలేదు. ఇప్పటికే నాలుగేళ్లు గడిచిపోవటంతో నిర్మాణ వ్యయం బాగా పెరిగిపోయింది. రూ.9 లక్షలు కూడా సరిపోవని నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు.. విమానాశ్రయం సమీపంలోని తమ నివాసాల నుంచి కదలకుండా ఉండిపోయారు. కొంతమంది బయట అద్దెకు తీసుకుని ఉంటున్నారు. వీరికి అద్దె డబ్బు కూడా ప్రభుత్వమే చెల్లించాలి. ఆ పరిస్థితి కూడా లేదు. బుద్ధవరం, అజ్జంపూడి, కేసరపల్లి, దావాజీ గూడెం గ్రామాలకు చెందిన 423 మంది లబ్ధిదారులను తరలించాల్సి ఉంది. కొత్త రన్ వేకు సమీపంలోనే 423 నిర్వాసిత కుటుంబాలు ఉంటున్నాయి. వీటి కారణంగా విమానాల రాకపోకలకు ఇబ్బందిగా ఉంటుందన్నది ఏఏఐ వాదన. ఈ సమస్యను జిల్లా యంత్రాంగ ం పరిష్కరించే పరిస్థితుల్లో లేదు.
వంతెన సమస్య తీరేదెన్నడు..?
విస్తరించిన రన్‌వే ప్రాంతంలో ఏలూరు కాల్వ ఉంది. దీని అవతల కూడా రన్‌వేను విస్తరించటానికి వీలుగా భూమిని రిజర్వు చేసి ఉంచారు. ఈ రిజర్వుడు స్థలంలోనే మినీ రాడార్‌ను ఏర్పాటు చేశారు. విమానాలు ఈ ప్రాంతం నుంచే చాలా దిగువగా నూతన రన్‌వే మీదకు వస్తాయి. ఏలూరు కాల్వ మీద దావాజీగూడెం-ఉంగుటూరు రోడ్డుకు అనుసంధానంగా వంతెన ఉంది. ఇలా మధ్య నుంచి వాహనాలు వెళ్లటం విమానాల రాకపోకలకు ఇబ్బందిగా మారుతోంది. ఈ రోడ్డును విమానాశ్రయ రిజర్వు భూముల అవతల దావాజీగూడెం-పుట్టగుంట రోడ్డుపై వంతెన ఏర్పాటు చేసి రోడ్డును పూర్తిస్థాయిలో మళ్లించాలని ఏఏఐ అధికారులు కోరుతున్నారు. ఈ వంతెన కారణంగా అప్రోచ్ లైటింగ్‌కు ఇబ్బందిగా ఉంటోందని, విమానాలకు సమస్యగా ఉందని అంటున్నారు. ఇది కూడా పరిష్కారం కాలేదు.
కొత్త ఏటీసీ టవర్ నిర్మాణానికి అవరోధం
విమానాశ్రయంలో నూతన ఏటీసీ టవర్ నిర్మాణ పనులు చేపట్టాలని ఏఏఐ ఎప్పుడో నిర్ణయించింది. ఎక్కడైతే ఏటీసీ టవర్ ఏర్పాటు చేయాలనుకున్నారో అటు నుంచి హైటెన్షన్ విద్యుత్ లైన్లు వెళ్తున్నాయి. వీటిని తొలగించాలని గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వైసీపీ ప్రభుత్వం మాత్రం ఇందుకు సహకరించలేదు. దీంతో నూతన ఏటీసీ టవర్ నిర్మాణానికి అవరోధం కలుగుతోంది.