ఇంద్రకీలాద్రిపై అర్జునుడు

ABN , First Publish Date - 2023-03-11T00:22:30+05:30 IST

ఇంద్రకీలాద్రిపై ఉన్న ఆలయాల్లో కంటే ఎత్తులో కొత్త ఆలయం కనిపించబోతోంది. శివుడు, అర్జునుడి విగ్రహాలతో ఒక ఆలయాన్ని నిర్మించాలన్న ప్రతిపాదనపై చర్చలు జరుగుతున్నాయి. ద్వాపరయుగం నాటి ఘట్టం ఆధారంగా దీన్ని నిర్మించాలని భావిస్తున్నారు. ఆ ఘట్టం ఆధారాలను కొన్నాళ్ల క్రితం ఆలయ స్తపతి, పురావస్తుశాఖ అధికారులు నిర్ధారించారు. అందుకు మూలాలను పరిశీలించారు. భవిష్యత్తులో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని మాస్టర్‌ ప్లాన్‌ రూపొందిస్తున్నారు. అందులో ఇంద్రకీలాద్రిపై నిర్మించే ఆలయ ప్రతిపాదనను చేర్చాలని అధికారవర్గాలు భావిస్తున్నాయి.

ఇంద్రకీలాద్రిపై అర్జునుడు

పురాణంలో ఘట్టం ఆధారంగా ఆలయ నిర్మాణం

పాశుపతాస్త్రం కోసం తపస్సు చేసిన అర్జునుడు

కిరాతుడు రూపంలో ఉన్న శివుడితో అర్జునుడి యుద్ధం

శివుడు, అర్జునుడి విగ్రహాలను కొండపై ఏర్పాటు చేసే యోచన

మాస్టర్‌ప్లాన్‌లో చేర్చే అవకాశం

అధికారులు, వేదపండితుల మధ్య చర్చలు

ఇంద్రకీలాద్రిపై ఉన్న ఆలయాల్లో కంటే ఎత్తులో కొత్త ఆలయం కనిపించబోతోంది. శివుడు, అర్జునుడి విగ్రహాలతో ఒక ఆలయాన్ని నిర్మించాలన్న ప్రతిపాదనపై చర్చలు జరుగుతున్నాయి. ద్వాపరయుగం నాటి ఘట్టం ఆధారంగా దీన్ని నిర్మించాలని భావిస్తున్నారు. ఆ ఘట్టం ఆధారాలను కొన్నాళ్ల క్రితం ఆలయ స్తపతి, పురావస్తుశాఖ అధికారులు నిర్ధారించారు. అందుకు మూలాలను పరిశీలించారు. భవిష్యత్తులో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని మాస్టర్‌ ప్లాన్‌ రూపొందిస్తున్నారు. అందులో ఇంద్రకీలాద్రిపై నిర్మించే ఆలయ ప్రతిపాదనను చేర్చాలని అధికారవర్గాలు భావిస్తున్నాయి.

(ఆంధ్రజ్యోతి - విజయవాడ) : ద్వాపరయుగంలో పాండవులకు, కౌరవులకు యుద్ధం జరిగింది. అందులో కర్ణుడితో అర్జునుడు తలపడ్డాడు. ఈ యుద్ధంలో పైచేయి సాధించడానికి పాశుపతాస్త్రం కోసం అర్జునుడు శివుడిని పూజించాడు. ఆయన కోసం తపస్సు చేశాడు. ఇంద్రకీలాద్రిపై ఈ తపస్సును అర్జునుడు చేశాడని పురాణాలు చెబుతున్నాయి. అర్జునుడిని పరీక్షించడం కోసం శివుడు కిరాతుడు రూపంలో ప్రత్యక్షమయ్యాడు. అర్జునుడు కిరాతుడు రూపంలో ఉన్న శివుడితో తలపడి విజయం సాధించాడు. దీనికి మెచ్చిన శివుడు అర్జునుడికి పాశుపతాస్త్రాన్ని వరంగా ఇచ్చాడు. నాడు అర్జునుడు తపస్సు చేసినట్టుగా పురాణాల్లో చెబుతున్న ప్రదేశంలో రాతి గోడలతో ఒక గుహ వంటి నిర్మాణం ఇంద్రకీలాద్రిపై ఉంది. ప్రస్తుతం ఇది శిథిలావస్థకు చేరుకుంది. 15 ఏళ్ల క్రితం ఇంజనీరింగ్‌ విభాగంలోని అధికారుల బృందం కొండపైకి వెళ్లి ఈ గుహను పరిశీలించింది. రెండేళ్ల క్రితం పురావస్తు శాఖ, దేవదాయ శాఖ స్తపతితో కూడిన బృందం రోప్‌ల సహాయంతో ఇంద్రకీలాద్రిపైకి వెళ్లింది. మల్లికార్జున మండపం, కనకదుర్గ నగర్‌ నుంచి ఇంద్రకీలాద్రి వైపు తలెత్తి చూస్తే చెట్ల మధ్యలో ఉన్న ఈ నిర్మాణం కనిపిస్తోంది. ఉత్తర భారతదేశానికి చెందిన కవి భారవి ఆరో శతాబ్దంలో రాసిన సంస్కృత కావ్యం కిరాతార్జునీయంలో అర్జునుడు, శివుడికి మధ్య జరిగిన యుద్ధానికి సంబంధించిన ప్రస్తావన ఉంది. ఆయన మొత్తం ఆరు పద్య కావ్యాలను రాయగా అందులో ఒకటి కిరాతార్జునీయం. దీన్ని శ్రీనాథుడు తెలుగులోకి అనువదించారు. ఇందులో శివుడు బోయవాడి అవతారంలో వచ్చి అర్జునుడితో యుద్ధం చేసినట్టు పేర్కొన్నారు.

ఏం చేస్తారు?

ఇంద్రకీలాద్రిపై ప్రస్తుతం ఉన్న శిథిల నిర్మాణం ప్రాంతంలోనే కొత్తగా శివుడి, అర్జునుడి విగ్రహాలు ఏర్పాటు చేసి ఆలయాన్ని నిర్మించాలని భావిస్తున్నారు. భక్తులు ఇంద్రకీలాద్రిపైకి వెళ్లి ఈ ఆలయాన్ని సందర్శించేలా నిర్మాణం చేయాలన్నది వారి భావనగా కనిపిస్తోంది. మల్లికార్జున మండపం వద్ద ఉన్న కొండపైకి మెట్లు, ర్యాంప్‌లను నిర్మాణం చేయాలని భావిస్తున్నారు. ఇక్కడి నుంచి అర్జునుడు తపస్సు చేసిన ప్రదేశం అర కిలోమీటరు ఉంటుంది. నాటి చరిత్ర ఆనవాళ్లను చెదరకుండా భద్రంగా ఉంచాలనుకుంటే అర్జునుడు, శివుడి ఆలయాన్ని ఓం ఉన్న కొండ పైభాగంలో నిర్మించాలన్న ప్రతిపాదన ఉన్నట్టు తెలిసింది. ఇది కొలిక్కి వచ్చిన తర్వాత మాస్టర్‌ ప్లాన్‌లో చేర్చాలని అధికారులు నిర్ణయించారు. కొత్తగా నిర్మించబోయే ఆలయంలో శివుడి, అర్జునుడి విగ్రహాలను మాత్రమే ఏర్పాటు చేస్తారా? ఇద్దరి మధ్య జరిగిన యుద్ధ సన్నివేశాలను ప్రతిబింబించే విగ్రహాలను ఏర్పాటు చేస్తారా? అనేది త్వరలో తేలబోతోంది.

Updated Date - 2023-03-11T00:22:30+05:30 IST