వాణిజ్య పన్నుల శాఖలో.. పంచతంత్రం!
ABN , First Publish Date - 2023-06-26T02:05:50+05:30 IST
వాణిజ్యపన్నుల శాఖలోని ఇంటెలిజెన్స్ అండ్ ఆడిట్ విభాగంలో అదృశ్యమైన ఫైళ్లకు సంబంధించి ఆ శాఖలో చర్చ విస్తృతంగా సాగుతోంది. ఇంటెలిజెన్స్ అండ్ ఆడిట్ విభాగంలో మొత్తం 17 ఫైళ్లు అదృశ్యమైనట్టు అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. వాటిలో ఆరు ఫైళ్లను ప్రభుత్వ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ, జీఎస్టీవో బి.మోహర్‌కుమార్, గుడివాడ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ కె.సంధ్య, సీనియర్ అసిస్టెంట్ వెంకట చలపతి నుంచి స్వాధీనం చేసుకున్నారు.
(ఆంధ్రజ్యోతి - విజయవాడ)
వాణిజ్యపన్నుల శాఖలోని ఇంటెలిజెన్స్ అండ్ ఆడిట్ విభాగంలో అదృశ్యమైన ఫైళ్లకు సంబంధించి ఆ శాఖలో చర్చ విస్తృతంగా సాగుతోంది. ఇంటెలిజెన్స్ అండ్ ఆడిట్ విభాగంలో మొత్తం 17 ఫైళ్లు అదృశ్యమైనట్టు అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. వాటిలో ఆరు ఫైళ్లను ప్రభుత్వ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ, జీఎస్టీవో బి.మోహర్‌కుమార్, గుడివాడ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ కె.సంధ్య, సీనియర్ అసిస్టెంట్ వెంకట చలపతి నుంచి స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన 11 ఫైళ్ల గురించి ఇప్పుడు చర్చ నడుస్తోంది. ప్రస్తుతం కేసులో ఉన్న ఐదుగురి నిందితులకు మాత్రమే విషయం తెలుస్తుందని వాణిజ్య పన్నుల శాఖలోని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే నలుగురి ఇళ్లలో ఆరు ఫైళ్లు లభించినందున మిగిలిన ఫైళ్లూ వారి వద్దే ఉండిఉంటాయని అధికారులు విశ్వసిస్తున్నారు. ఆ 11 ఫైళ్లు అత్యంత కీలకమైనవని చెబుతున్నారు. ఇప్పుడు ఈ ఫైళ్ల కోసం అన్వేషణ కొనసాగుతోంది.
త్రిమూర్తులు ఎవరు?
కేఆర్ సూర్యనారాయణ, బి.మోహర్‌కుమార్, కె.సంధ్య, వెంకటచలపతి, సత్యనారాయణ కేసులో ప్రస్తుతం నిందితులు. వాళ్లంతా ఇంటెలిజెన్స్ అండ్ ఆడిట్ విభాగంలో పనిచేసినప్పుడు గ్రూపుగా ఉండేవారని వాణిజ్య పన్నుల శాఖ వర్గాలు చెబుతున్నాయి. వాణిజ్య పన్నుల శాఖలో ప్రతి డివిజన్‌కు ఒక ఇంటెలిజెన్స్ అండ్ ఆడిట్ విభాగం ఉంటుంది. ఆ డివిజన్ పరిధిలో ఎనిమిది వరకు సర్కిళ్లు ఉంటాయి. సూర్యనారాయణ, మోహర్‌కుమార్, సంఽధ్య, వెంకటచలపతి మొత్తం స్కెచ్‌లు వేసి మిగిలిన వారిని పావులుగా ఉపయోగించుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అదృశ్యమైన ఫైళ్లలో నీరు-చెట్టు, ఈఎ్‌సఐకి సంబంధించిన ఫైళ్లు ఉన్నాయని వాణిజ్య పన్నుల శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈఎ్‌సఐకి మందులు, వైద్యపరికరాలను కొన్ని ఏజెన్సీలు సరఫరా చేశాయి. ఈ ఏజెన్సీలు చెల్లించాల్సిన జీఎస్టీ విషయంలో ఈ నిందితులు పంచతంత్రాన్ని ప్రయోగించినట్టు చెబుతున్నారు. ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన నలుగురికి మరో ముగ్గురు బినామీలుగా ఉన్నట్టు సమాచారం. వారిలో ఒక డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్, ఒక జీఎస్టీవో, ఒక సీనియర్ అసిస్టెంట్ పాత్ర ఉందని అధికారులు ఇప్పటికే నిర్ధారించారు. ఈ ముగ్గురికి అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారని విశ్వసనీయంగా తెలిసింది. కనిపించకుండా పోయిన 11 ఫైళ్లు ఈ ముగ్గురి వద్ద ఉన్నట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది కాకపోతే అప్పటికే డబ్బులు వసూలు చేసినందున ఫైళ్లను దహనం చేసి ఉంటారని మరో అనుమానం ఉన్నది.
నష్టం ఎంత?
ఇంటెలిజెన్స్ అండ్ ఆడిట్ విభాగంలో ఫైళ్లను పరిశీలించి జీఎస్టీ సక్రమంగా చెల్లించకపోతే జరిమానా విధిస్తారు. అటువంటిది విజయవాడ ఒకటో డివిజన్‌లో పనిచేసిన ఈ ఐదుగురు నిందితులు పక్క డివిజన్లలో వేలు పెట్టినట్టు అధికారులు గుర్తించారు. మొత్తం 17 ఫైళ్ల ద్వారా రూ.400కోట్ల వరకు ఆ శాఖ ఖజానాకు నష్టం చేకూర్చినట్టు అంచనా వేశారు. అధికారికంగా రూ.200కోట్ల వరకు నష్టం కలిగించినట్టు అధికారులు ఇప్పటికే లెక్కించారు. సూర్యనారాయణ, సంధ్య, మోహర్‌కుమార్, వెంకటచలపతి ఫైళ్లను పరిశీలిస్తే, ప్రస్తుతం విజయవాడలో పనిచేస్తున్న ముగ్గురు వ్యక్తులు ఏజెన్సీలకు, ఈ నలుగురికి మధ్యవర్తులుగా వ్యవహరించారని సమాచారం.