Share News

కట్టల మాటున కట్టడాలు

ABN , Publish Date - Dec 26 , 2023 | 12:12 AM

కొద్దిరోజుల క్రితం పశ్చిమ నియోజకవర్గానికి చెందిన ఒక మహిళా కార్పొరేటర్‌ తన డివిజన్‌లో అక్రమంగా జరుగుతున్న నిర్మాణంపై స్థానికుల నుంచి ఫిర్యాదులు రావడంతో వీఎంసీ టౌన్‌ప్లానింగ్‌ అధికారులతో కలిసి అడ్డుకున్నారు. దీంతో భవన నిర్మాణం తాత్కాలికంగా ఆగిపోయింది. ఆ తర్వాత ఆ భవన యజమాని ఎమ్మెల్యే వద్దకు వెళ్లారు. ఆ మరుసటి రోజు నుంచే స్థానిక కార్పొరేటర్‌ అభ్యంతరాలను బేఖాతర్‌ చేస్తూ అక్రమ నిర్మాణం యథేచ్ఛగా కొనసాగుతోంది. దీంతో మనస్థాపం చెందిన కార్పొరేటర్‌ తన పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యేకు, మేయర్‌కు పంపారు. వ్యవహారం ఇంతవరకు వస్తుందని ఊహించని ఎమ్మెల్యే కంగుతిని మధ్యవర్తుల ద్వారా రాయబారాలు జరిపి వివాదానికి ముగింపు పలికారు. పశ్చిమలో అక్రమ నిర్మాణాలు, వాటాల విషయంలో స్థానిక ఎమ్మెల్యేకు, కార్పొరేటర్లకు పొసగడం లేదు. కార్పొరేటర్ల వరకూ అందకుండా ఎమ్మెల్యే అనుచరులే సొమ్ము సైడ్‌ చేస్తుండటంతో పరిస్థితి రాజీనామాల వరకూ చేరుతోంది.

కట్టల మాటున కట్టడాలు
53వ డివిజన్‌లో ఓ అక్రమ నిర్మాణం

ఎమ్మెల్యే కనుసన్నల్లోనే అంతస్థులకు అంతస్థులు

ఎమ్మెల్యే-కార్పొరేటర్ల మధ్య వాటాలపై వివాదాలు

రచ్చకెక్కుతున్న పంచాయితీలు

రాజీనామాకు సిద్ధపడిన ఓ మహిళా కార్పొరేటర్‌

(విజయవాడ-ఆంధ్రజ్యోతి/వన్‌టౌన్‌) : విజయవాడ నగర పరిధిలోని మూడు నియోజకవర్గాల్లో అనధికార కట్టడాలు అధికార పార్టీ నాయకులు, కార్పొరేటర్లకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. అయితే, పశ్చిమ, సెంట్రల్‌లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఇక్కడ కార్పొరేటర్ల కంటే స్థానిక ఎమ్మెల్యేల మాటే ఎక్కువ చెల్లుబాటు అవుతోంది. దీంతో కార్పొరేటర్ల ఆదాయం తగ్గిపోయింది. తూర్పు నియోజకవర్గంలో అధికార పార్టీ కార్పొరేటర్లు అక్రమ నిర్మాణాల విషయంలో జేబులు నింపుకొంటుంటే పశ్చిమ, సెంట్రల్‌ నియోజకవర్గాల్లోని కార్పొరేటర్లు మాత్రం తమకు రావాల్సిన ఆదాయం వేరే వారికి వెళ్లిపోతుండటంతో రగిలిపోతున్నారు. పశ్చిమ నియోజకవర్గంలో అక్రమ నిర్మాణాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ నిర్మాణాల విషయంలో కార్పొరేటర్లు ముందుండి కాసులు జేబులో వేసుకుంటుంటారు. కానీ, పశ్చిమ ఎమ్మెల్యే అనుచరులు సొమ్మును కార్పొరేటర్ల వరకు రానివ్వడం లేదు. కాస్తోకూస్తో కార్పొరేటర్‌కు ఇవ్వమని చెప్పి భవన యజమాని నుంచి అధికభాగం ఎమ్మెల్యే అనుచరులే వసూలు చేసి జేబులో వేసుకుంటున్నారు. దీంతో కార్పొరేటర్లకు, ఎమ్మెల్యే అనుచరులకు నడుమ తరచూ వాటాల వివాదం నెలకొంటోంది.

మచ్చుకు కొన్ని..

  • 37వ డివిజన్‌ పరిధి, వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ సమీపంలోని పల్లె వీధిలో ఒక భవన యజమాని జీప్లస్‌2కు అనుమతి తీసుకుని ఇరుకు సందు అయినా సరే అదనంగా మరో అంతస్థు వేశారు. దీనికి అధికారులు అభ్యంతరం చెప్పారు. భవన యజమాని ఎమ్మెల్యే అనుచరులను సంప్రదించడంతో అక్రమం సక్రమం అయిపోయింది.

  • 53వ డివిజన్‌ హమీద్‌ వీధిలో ఓ వ్యాపారి కూడా అదే తరహాలో జీప్లస్‌2కు అనుమతి తీసుకుని అదనంగా మరో రెండంతస్థులు వేశారు. అక్రమంగా వేసిన అంతస్థులను టౌన్‌ప్లానింగ్‌ సిబ్బంది కూల్చేశారు. ఆ భవన యజమాని ఎమ్మెల్యే అనుచరులను సంప్రదించడంతో రాత్రికి రాత్రే కూల్చేసిన నిర్మాణాలను తిరిగి కట్టేసుకున్నారు.

  • హద్దు సాహెబ్‌ వీధిలో ఒక మార్వాడీ వ్యాపారి జీప్లస్‌2 తీసుకుని అదనంగా ఇంకో అంతస్థు నిర్మించారు. టౌన్‌ప్లానింగ్‌ అధికారులు కూల్చివేతకు ఉపక్రమిస్తే యజమాని వారితో గొడవపడి వారిని బెదిరించారు. ఎమ్మెల్యే అనుచరులతో ఫోన్లు చేయించడంతో టౌన్‌ప్లానింగ్‌ అధికారులు వెనుదిరిగారు. భవన యజమాని రాత్రి రాత్రికి నిర్మాణం చేసి పెయింటింగ్‌ కూడా వేసేశారు.

ఈ అక్రమ నిర్మాణాల విషయంలో లక్షలాది రూపాయలు ఎమ్మెల్యే అనుచరులకు ముడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అదంతా తమకు రావాల్సిన ఆదాయమని అధికార పార్టీ కార్పొరేటర్లు వాపోతున్నారు. కనీసం తమకు సమాచారం కూడా ఇవ్వకుండా ఎమ్మెల్యే అనుచరులే నేరుగా టౌన్‌ప్లానింగ్‌ సిబ్బందితో మాట్లాడి జేబులు నింపుకొంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వీఎంసీ ఖజానాకు గండి

అక్రమ నిర్మాణాలతో అధికార పార్టీ నేతల జేబులు నిండుతుండగా, వీఎంసీ ఖజానాకు మాత్రం గండిపడుతోంది. బాండ్లు కొనుగోలు చేసి నిర్దేశిత కట్టడాలను నిర్మించుకునే వెసులుబాటు ఉంది. అదేవిధంగా ప్లాన్‌ అతిక్రమించి నిర్మించిన భవనాల విషయంలో మార్ట్‌గేజ్‌ పెట్టుకున్న ఫ్లాట్లను వీఎంసీ సొంతం చేసుకునే నిబంధన కూడా ఉంది. ఇవేవీ అమలు కాకుండా అధికార పార్టీ నాయకులు తమ జేబులే నింపుకొంటున్నారు.

Updated Date - Dec 26 , 2023 | 12:12 AM