రైలు ప్రయాణం భద్రత ఎంత!

ABN , First Publish Date - 2023-07-08T00:56:37+05:30 IST

రైలు ప్రయాణం ఇటీవల కాలంలో ప్రమాదకరంగా మారుతోంది. రైల్వే ప్రైవేటీకరణకు చూపుతున్న శ్రద్ధ.. ప్రయాణికుల భద్రతపై చూపటం లేదన్నది వరుస సంఘటనలతో తేటతెల్లమవుతోంది. తాజాగా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ అగ్నిప్రమాదానికి గురి కావటం ఆందోళనకరం. ప్రమాదం జరిగాక కారణాలు పరిశీలించేదాని కంటే.. అసలు రైళ్లలో సరుకు రవాణాపై రైల్వే దృష్టి సారించాల్సి ఉంది.

రైలు ప్రయాణం భద్రత ఎంత!

(ఆంధ్రజ్యోతి, విజయవాడ)

రైలు ప్రయాణం ఇటీవల కాలంలో ప్రమాదకరంగా మారుతోంది. రైల్వే ప్రైవేటీకరణకు చూపుతున్న శ్రద్ధ.. ప్రయాణికుల భద్రతపై చూపటం లేదన్నది వరుస సంఘటనలతో తేటతెల్లమవుతోంది. తాజాగా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ అగ్నిప్రమాదానికి గురి కావటం ఆందోళనకరం. ప్రమాదం జరిగాక కారణాలు పరిశీలించేదాని కంటే.. అసలు రైళ్లలో సరుకు రవాణాపై రైల్వే దృష్టి సారించాల్సి ఉంది. గతంలో విజయవాడ కేంద్రంగా ప్రయాణికుల కోచ్‌లలో వంట గ్యాస్‌ సిలెండర్ల రవాణాపై ‘ఆంధ్రజ్యోతి’ ఆధారాలతో ప్రచురించింది. ఇప్పుడు వంటగ్యాస్‌ సిలెండర్లు లేకపోయినా.. అన్ని రకాల సరుకుల రవాణాకు అనుమతులు ఇచ్చేస్తున్నారు. అనుమతులు తీసుకున్న వారు నిబంధనలను అతిక్రమిస్తున్నారు. రైల్వే ప్రయాణీకుల భద్రత దృష్ట్యా రవాణా అవుతున్న సరుకులను పరిశీలించాల్సిన అవసరం ఉంది. దీనికోసం వ్యవస్థలు ఉన్నా.. కొందరు అవినీతి అధికారుల కారణంగా కేసులు నమోదు చేయటానికి కూడా సాహసించటం లేదు. ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ అగ్ని ప్రమాదం ఉదంతం చూస్తే.. షార్ట్‌ సర్క్యూట్‌ జరగటానికి అవకాశాలు చాలా తక్కువ. సిగరెట్‌ తాగినా.. రైలుబోగీలు దహనమయ్యేంత అగ్ని ప్రమాదం సంభవించటానికి అవకాశం ఉండదు. ఏవైనా అగ్ని కారక పదార్థాలను ప్రయాణికులు వెంట తీసుకుని వెళ్లవచ్చు. ప్యాంట్రీల కోసం అవసరమైన పదార్థాలను అందించే వారు నిషేధిత వస్తువులనైనా ఇచ్చి ఉండవచ్చు. రైల్వే నిఘా వ్యవస్థ పర్యవేక్షణ లోపం కారణంగా సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి.

విజయవాడ ఏ1 స్టేషన్‌లో కూడా రైళ్లలో అనేకం రవాణా అవుతుంటాయి. ప్యాంట్రీ నిర్వాహకుల నుంచి అనుమతులు తెచ్చుకుంటారు. దానికోసం ఇక్కడి అధికారులకు లేఖలు వస్తాయి. ఆ మేరకు అనుమతులు ఇస్తుంటారు. వారు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. రైల్వేస్టేషన్‌లోని సీసీ కెమెరాలను పరిశీలించే వ్యవస్థలు లేవు. ప్లాట్‌ఫామ్‌ల మీదకు వచ్చే బండ్లకు, ఉత్పత్తులను డంప్‌ చేసే వారికి కూడా అనుమతులతోపాటు గుర్తింపు కార్డులుండాలి. రైల్వే అధికారుల చర్యలు లేనపుడు విజిలెన్స్‌, ఇంటెలిజెన్స్‌ వ్యవస్థలైనా తక్షణం స్పందించకపోతే జరిగే నష్టాలకు బాధ్యత వహించాల్సి వస్తుంది.

Updated Date - 2023-07-08T00:56:37+05:30 IST