మట్టే ఆదాయంగా..

ABN , First Publish Date - 2023-02-07T00:46:46+05:30 IST

మట్టి అక్రమాలు పెరిగిపోతున్నాయి. అధికార పార్టీ అండదండలో అక్రమార్కులు పెట్రేగిపోతున్నారు. దందాలు, దౌర్జన్యాలు, జూదాలకు పాల్పడే గడ్డం గ్యాంగ్‌ కూడా మట్టి అక్రమాల్లోకి జొరబడింది. ఆక్రమణలకు తెగబడుతోంది.

మట్టే ఆదాయంగా..

అధికార పార్టీ అండతో విచ్చలవిడిగా మట్టి తవ్వకాలు

బుడమేరు గట్టునూ వదలని గడ్డం గ్యాంగ్‌

నందివాడ మండలం శంకరంపాడులో మరికొందరు చెరువు మట్టి తవ్వి అమ్మకాలు

చోద్యంచూస్తున్న రెవెన్యూ అధికారులు

మట్టి అక్రమాలు పెరిగిపోతున్నాయి. అధికార పార్టీ అండదండలో అక్రమార్కులు పెట్రేగిపోతున్నారు. దందాలు, దౌర్జన్యాలు, జూదాలకు పాల్పడే గడ్డం గ్యాంగ్‌ కూడా మట్టి అక్రమాల్లోకి జొరబడింది. ఆక్రమణలకు తెగబడుతోంది. నిన్నటి వరకూ చేపల చెరువు మట్టి అక్రమంగా తవ్వుకొని అమ్మి సొమ్ము చేసుకోగా.. నేడు బుడమేరు గట్టును గడ్డం గ్యాంగ్‌ అడ్డదిడ్డంగా తొలిచేస్తోంది. దర్జాగా ఇటు గుడివాడ అటు అరిపిరాల రోడ్డు వద్దకు స్థలాల మెరకకు మట్టి తరలిస్తూ కాసులు పిండుకుంటోంది. అధికారులు ఎవరూ ఆవైపు కన్నెత్తి చూడటం లేదు. నందివాడ మండలం శంకరంపాడులోనూ చెరువు మట్టిని కొందరు అక్రమంగా తరలించేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.

గుడివాడ : నందివాడ మండలం పుట్టగుంట అక్రమ చేపల చెరువులో గడ్డం గ్యాంగ్‌ మట్టి తవ్వకాలు చేపట్టిన విషయం విదితమే. ఏకంగా బుడమేరు వరద కట్టను కూడా తొలుస్తున్నారు. కరకట్టను ఒలిచేస్తున్నా డ్రైనేజీ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. సుమారు 20 అడుగుల లోతు మేర కరకట్టను ఒలిచేయడంతో కరకట్ట బలహీనంగా మారింది. భారీస్థాయిలో బుడమేరుకు వరద వస్తే నందివాడ మండల ప్రజలకు ప్రమాదం ఏర్పడుతుంది.

ఆగని మట్టి దోపిడీ

పగలు, రాత్రి తేడాలేకుండా గడ్డం గ్యాంగ్‌ యథేచ్ఛగా మట్టిని దోచేస్తున్నా రెవెన్యూ అధికారులకు కనిపించడం లేదు. మట్టిని బహిరంగంగానే ఇటు గుడివాడకు అటు అరిపిరాల రోడ్డు వద్ద గల స్థలాల మెరకుకు తరలిస్తున్నారు. ఎటువంటి అనుమతులూ లేకుండా మట్టిని తరలిస్తున్నా మైనింగ్‌ శాఖ అధికారులు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు.

గడ్డం గ్యాంగా....మజాకానా...?

గడ్డం గ్యాంగ్‌ ఆగడాలకు భయపడి నందివాడ మండల రెవెన్యూ అధికారి అనారోగ్య కారణాలను చూపుతూ సెలవుపై వెళ్లినట్టు సమాచారం. డ్రైనేజీ అధికారులు సైతం ఎక్కడా క్షేత్రస్థాయిలో పరిశీలనకు వచ్చిన దాఖలాలు లేవు. అసలు అటు వైపు చూడాలి అంటేనే అధికారులు భయపడిపోతున్నారంటే గడ్డం గ్యాంగ్‌ అధికారుల వెన్నులో ఎవలా వణుకు పుట్టిస్తుందో బహిర్గతమవుతోంది.

బుడమేరు గట్టును వదలరా?

మాజీ ఎమెలేఏ్య రావి వెంకటేశ్వరరావు

గుడివాడ : ఇష్టానుసారంగా నియోజకవర్గంలో కబ్జాలు, ఆక్రమణలు, గంజాయి, క్యాసినోలతో దోచుకున్న మాజీ మంత్రి కొడాలి నాని అనుచరులు బుడమేరు గట్టునూ వదలడం లేదని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ధ్వజమెత్తారు. సోమవారం స్థానిక ఆర్డీవో కార్యాలయం వద్ద టీడీపీ నాయకులతో కలిసి నిరసన తెలిపారు. ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి నాని చేస్తున్న దోపిడీతో ప్రజలు విసిగిపోయారన్నారు. నాని అనుచరులు, బినామీలతో దొరికినంత దోచుకుంటున్నారని, బుడమేరు కరకట్టను సైతం వదలకుండా తవ్వేసుకుంటున్నారని అన్నారు. జరుగుతున్న విధ్వంసాన్ని ఆర్డీవో, నందివాడ తహసీల్దార్‌ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు. కలెక్టర్‌ అయినా స్పందించి చర్యలు చేపట్టాలని కోరారు. అనంతరం ఆర్డీవో పి.పద్మావతికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు దింట్యాల రాంబాబు, నాగరాజు, కాశీ, పోలాసి ఉమా, జబీన్‌, జానీ షరీఫ్‌ తదితరులు పాల్గొన్నారు.

శంకరంపాడులో చెరువు మట్టి తవ్వకాలు

నందివాడ : మండలంలోని శంకరంపాడులో చెరువు అక్రమ తవ్వకాలు సాగుతున్నాయి. నాలుగు రోజులుగా మట్టి తోలకాలు సాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. 2021లో చేపల చెరువుల మరమ్మతులకు రీ పర్మిషన్‌ చేసుకోవాలని జగన్‌ ప్రభుత్వం అప్పట్లో నిబంధన పెట్టింది. కానీ మండలంలో నామమాత్రంగానే రీ పర్మిషన్లకు దరఖాస్తు చేసుకున్నారని ఎక్కువ శాతం మంది మాత్రం ఈ పర్మిషన్లు పట్టించుకోలేదు. ఫిషర్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు కూడా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించటంతో చేపల చెరువుల మట్టి తోలకాలు ఇష్టారాజ్యంగా కొనసాగుతున్నాయి. శంకరంపాడులో చెరువు చుట్టూ కట్లు పోసుకుంటూ చెరువులోని మట్టిని మాత్రం గ్రామంలోకి ట్రాక్టరు రూ.600 చొప్పున గత నాలుగు రోజులుగా తోలకాలు నిర్వహిస్తున్నారు. కలెక్టర్‌ స్పందించి ఈ అక్రమ చేపల చెరువుల తవ్వకాలను ఆపివేసి మట్టి తోలకాలను జగనన్న కాలనీలకు తోలే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

Updated Date - 2023-02-07T00:46:46+05:30 IST