అంగన్వాడీలపై ప్రభుత్వ తీరు దుర్మార్గం
ABN , Publish Date - Dec 22 , 2023 | 12:49 AM
పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలుపుకోవాలని సమ్మె చేస్తున్న అంగన్వాడీ సిబ్బందిపై ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎన్.సి.హెచ్.సుప్రజ విమర్శించారు.
తిరువూరు, డిసెంబరు 21: పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలుపుకోవాలని సమ్మె చేస్తున్న అంగన్వాడీ సిబ్బందిపై ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎన్.సి.హెచ్.సుప్రజ విమర్శించారు. సమ్మె గురువారం పదోరోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సిబ్బంది చెవిలో పువ్వులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సుప్రజ మాట్లాడుతూ, 40 సంవత్సరాలుగా పిల్లలకు, బాలింతలు, గర్భివతుకు సేవలు అందిస్తున్న అంగన్‌వాడీల పట్ల ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. సెంటర్‌ను నిర్వాహించడం తాళాలు పగలగొట్టినంత ఈజీ కాదనే విషయం ప్రభుత్వం గుర్తించాలన్నారు. సిబ్బంది డిమాండ్లు నేరవేర్చకుండానే తాము సమస్యలు పరిష్కారించినట్లు ఈ ప్రభుత్వం ప్రచారం చేసుకోవాడం అత్యంత హేయమైన చర్య అన్నారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు, కుతంత్రాలకు పాల్పడినా తమ పోరాటం ఆగదన్నారు. ఆశ వర్కర్లు సంఘీభావం తెలిపారు. దీక్షలో పులిచర్ల పద్మ, నల్లగట్ల నాగమణి, శ్రీలక్ష్మి, ఉష, మల్లికా, కుమారి, పద్మ, సీఐటీయూ నాయకులు బి.వెంకటేశ్వరరావు, ఆకుల రవి, సాంబారు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి..
మైలవరం: అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలని జనసేన మైలవరం నియోజకవర్గం ఇన్‌చార్జి అక్కల రామ్మోహన్‌రావు (గాంధీ) అన్నారు. తమ డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు చేస్తున్న సమ్మె గురువారంతో పదో రోజుకు చేరుకుంది. ఈసందర్భంగా కార్యకర్తలు 10 అంకె వేసి నిరసన తెలిపారు. చెవిలో పువ్వు పెట్టుకొని మరీ నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ మండల అధ్యక్షుడు తాతా పోతురాజు, జనసేన నాయకులు, సీఐటీయూ నాయకులు సీ.హెచ్ సుధాకర్, మహేష్, కె.బాలకృష్ణ, సీపీఎం నాయకుడు ఆంజనేయులు సంఘీభావం తెలిపారు.
జనసేన, సీపీఎం సంఘీభావం
జగ్గయ్యపేట : పట్టణంలో ఎన్టీఆర్ సర్కిల్‌లో గురువారం అంగన్వాడీ కార్యకర్తలు మానవహారం ఏర్పాటు చేశారు. తహసీల్దార్ కార్యాలయం ఉదయం నుంచి పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో నిరసన తెలిపారు. నియోజకవర్గ జనసేన నేతలు కిశోర్, మురళీకృష్ణ తదితరులు సమ్మెకు మద్దతు తెలిపారు. ప్రభుత్వం మొండివైఖరి విడనాడాలని కోరారు. సీపీఎం నేతలు, సీఐటీయూ నేతలు సంఘీభావం తెలిపారు.