అన్నదాతకు.. అకాల కష్టం!

ABN , First Publish Date - 2023-03-19T00:48:43+05:30 IST

అకాల వర్షం మొక్కజొన్న రైతుకు తీవ్ర నష్టం మిగిల్చింది. రెండు రోజులుగా వర్షాలు, ఈదురుగాలులకు మొక్కజొన్న, మిర్చి, మామిడి పంటలు దెబ్బతిన్నాయి. కల్లాల్లో ఆరబెట్టిన మిర్చి తడిసిపోగా, 1500 ఎకరాల్లో మొక్కజొన్న నేలకొరిగింది.

అన్నదాతకు.. అకాల కష్టం!
షేర్‌మహ్మద్‌పేటలో పడిపోయిన మొక్కజొన్న

ఎ.కొండూరు/జగ్గయ్యపేట రూరల్‌, మార్చి 18 : అకాల వర్షం మొక్కజొన్న రైతుకు తీవ్ర నష్టం మిగిల్చింది. రెండు రోజులుగా వర్షాలు, ఈదురుగాలులకు మొక్కజొన్న, మిర్చి, మామిడి పంటలు దెబ్బతిన్నాయి. కల్లాల్లో ఆరబెట్టిన మిర్చి తడిసిపోగా, 1500 ఎకరాల్లో మొక్కజొన్న నేలకొరిగింది. గొల్లమందల, కంభంపాడు, రేపూడి, ఎ.కొండూరు, కుమ్మరికుంట్ల, కృష్ణారావుపాలెం, మాధవరం, చీమలపాడు, రామచంద్రాపురం గ్రామాల్లో నష్టం పంటనష్టం వాటిల్లినట్టు రైతులు పేర్కొన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

అకాలవర్షంతో పడిపోయిన మొక్కజొన్న పంటను ప్రభుత్వం తక్షణమే పరిశీలించి ఆదుకోవాలని, లేకుంటే ఆత్మహత్యలే శరణ్యమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగ్గయ్యపేట మండలంలోని షేర్‌మహ్మద్‌పేట గ్రామంలో సుమారు 100 ఎకరాలకు పైగా పూత, పిందె దశలో ఉన్న మొక్కజొన్న పంట నేలకొరగటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నిలువునా ముంచిన వాన : జడ దుర్గయ్య, రైతు..

రెండున్నర ఎకరాలలో మొక్కజొన్న సాగుచేసి కోత దశలో అకాల వర్షం నిలువునా ముంచింది. దాదాపు రూ. 2.50 లక్షలు నష్టపోవాల్సి వస్తుంది ప్రభుత్వం ఆదుకోవాలి.

పెట్టుబడులు కూడా రావు : సోమోజు బ్రహ్మం

రెండవ పంటగా మొక్కజొన్నను సాగుచేసి ఇటీవల వేలాది రూపాయలు వెచ్చించి మందులు కూడా వేశాం. అకాల వర్షంతో రాత్రికి రాత్రే ఆశలు అడియాశలయ్యాయి. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలి.

పంట నేల మట్టం :షేక్‌ మస్తాన్‌ వలీ, రైతు

నాలుగు ఎకరాలలో మొక్కజొన్న సాగు చేశాం. కంకి పాలు పోసుకునే దశలో ఉండి ఏపుగా ఉన్న పైరుతో ఈ ఏడాది ఆశాజనకంగా ఉంది.. పర్వాలేదనుకుంటున్న తరుణంలో అకాల వర్షంతో నేల మట్టమైంది. ప్రభుత్వం స్పందించి అధికారులను పంపి నష్టపరిహారం అందించాలి.

పభుత్వం నష్ట పరిహారం ఇవ్వాలి : టీడీపీ

గంపలగూడెం: అకాల వర్షాలకు దెబ్బతిన్న మిర్చి, మొక్కజొన్న, పెసర పంటలకు నష్టహారం ఇవ్వాలని తెలుగు రైతు జిల్లా అధ్యక్షుడు చెరుకూరి రాజేశ్వరరావు, రాజమండ్రి పార్లమెంట్‌ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు కొత్తపల్లి జవహర్‌ డిమాండ్‌ చేశారు. శనివారం తోటమూల పార్టీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ, మెట్ట ప్రాంతంలో ఐదువేల ఎకరాల్లో మొక్కజొన్న, ఆరువేల ఎకరాల్లో పెసర పంటలను రైతులు సాగు చేశారన్నారు. ఎన్‌ఎ్‌సపీ జోన్‌ 2, 3 పరిఽధిలో సాగర్‌ జలాలు ఇవ్వకపోవడంతో మొక్కజొన్న, పెసర పంటలు బాగా దెబ్బతిన్నాయని సాగునీటి కోసం పాలకులు, అధికారులు కనీస ప్రయత్నం చేయలేదని ఆరోపించారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం మైలవరం, తిరువూరు, జగ్గయ్యపేట, నందిగామ ప్రాంతాల్లోని భూములకు సాగునీరు పుష్కలంగా లభిస్తున్నదన్నారు. అకాల వర్షాలతో మొక్కజొన్నకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పంట నష్టం అంచనా వేసి పరిహారం అందించాలన్నారు. కట్లేరు వంతెన నిర్మాణంలో ఎమ్మెల్యే రక్షణనిధి పూర్తిగా విఫలమయ్యారన్నారు.

ముఖ్యమంత్రి హామీలు ఏమయ్యాయి..

జగన్‌ గతంలో నియోజకవర్గ అభివృద్ధికి 15 హామీలు ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఏ ముఖం పెట్టుకొని తిరువూరు వస్తున్నారో చెప్పాలన్నారు. సీఎం సభ ఏర్పాట్ల కోసం అధికారులు, ఉద్యోగుల నుంచి లక్షలాది రూపాయలు వసూళ్లు చేయడం మొదటిసారి చూస్తున్నామన్నారు. సమావేశంలో మండల నాయకులు దిరిశాల వెంకట కృష్ణారావు, వై.పుల్లయ్యచౌదరి, గువ్వల వెంకటేశ్వర రెడ్డి, బూరుగు నారాయణ, హనుమంతరావు, కారుమంచి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-19T00:48:43+05:30 IST