ఫుడ్ పాయిజన్..
ABN , First Publish Date - 2023-03-19T01:06:28+05:30 IST
నగరంలోని మారిస్ స్టెల్లా కళాశాల హాస్టల్‌లో విద్యార్థినులు విషాహారం తిని అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం రాత్రి క్యాబేజీ, కాకరకాయ వేపుడు తిన్న విద్యార్థినులకు వాంతులు, విరేచనాలు అయ్యాయి.

స్టెల్లా కాలేజీలో ఘటన
విజయవాడ, మార్చి 18 (ఆంధ్రజ్యోతి)/పటమట : నగరంలోని మారిస్ స్టెల్లా కళాశాల హాస్టల్‌లో విద్యార్థినులు విషాహారం తిని అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం రాత్రి క్యాబేజీ, కాకరకాయ వేపుడు తిన్న విద్యార్థినులకు వాంతులు, విరేచనాలు అయ్యాయి. హాస్టల్‌లో మొత్తం 250 మంది ఇంటర్, డిగ్రీ విద్యార్థినులు ఉంటారు. వారికి శుక్రవారం రాత్రి భోజనంలో క్యాబేజీ, కాకరకాయ వేపుడు పెట్టారు. ఈ ఆహారం తిన్న విద్యార్థినులకు రాత్రి నుంచి వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. తొలుత ఐదుగురు విద్యార్థినులు అస్వస్థతకు లోనవ్వడంతో వారిని హాస్టల్ సిబ్బంది ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. తర్వాత అస్వస్థత బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగింది. శనివారం ఉదయానికి 30 మందికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. దీంతో కళాశాల అధికారులు జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి సుహాసినికి ఫోన్‌లో సమాచారం ఇచ్చారు. ఆమె వెంటనే కళాశాల ప్రాంగణానికి చేరుకున్నారు. అక్కడే వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయించారు. కొంతమందిని అంబులెన్స్‌లో ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. హాస్టల్ వంటగదిని ఫుడ్ సేఫ్టీ అధికారులు, డీఎం అండ్ హెచ్‌వో పరిశీలించారు. విద్యార్థులు తిన్న ఆహార పదార్థాల నమూనాలను సేకరించారు. వాటిని ప్రయోగశాలకు పంపారు. పెరుగన్నం తిన్నవారికీ వాంతులు, విరేచనాలు అయినట్టు చెబుతున్నారు.
ఇది మూడోసారి
స్టెల్లా కళాశాల హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ కావడం ఇదే ప్రథమం కాదు. ఇంతకుముందు మూడుసార్లు ఇదే హాస్టల్‌లో ఉన్న విద్యార్థినులు వాంతులు, విరేచనాలతో అస్వస్థత బారిన పడ్డారు. దీనికి విషాహారమే కారణమని నిర్ధారణైంది. హాస్టల్‌లో ఆహారం ఏమాత్రం రుచిగా ఉండదని, దిక్కులేని పరిస్థితుల్లో తినాల్సి వస్తోందని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, కళాశాల అధ్యాపకులు చెబుతున్న వాదన మరోలా ఉంది. విద్యార్థులు స్విగ్గీ, జుమోటోలో ఆహారాన్ని తెప్పించుకుని తింటున్నారని చెబుతున్నారు. అస్వస్థతకు అదే కారణమంటున్నారు. కళాశాలలోకి బయటి ఆహారం అనుమతించబోమని అధికారులు అక్కడ బోర్డులు ఏర్పాటు చేశారు. అటువంటప్పుడు బయట ఆహారం హాస్టల్ విద్యార్థినులకు ఎలా వస్తుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. కాగా, స్టెల్లా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జసింతా క్వాడ్రస్ మాట్లాడుతూ కొంతమంది విద్యార్థినులకు వాంతులు అవ్వడంతో ప్రాథమిక చికిత్స చేశామని, జిల్లా వైద్యాధికారుల సహకారంతో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశామని, తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దన్నారు. ఆహార తనిఖీ అధికారులు ఫుడ్ శాంపిల్స్‌ను పరీక్షలకు పంపించారని, ప్రస్తుతం విద్యార్థినుల పరిస్థితి నిలకడగానే ఉందని ఆమె పేర్కొన్నారు.