తొలిరోజే ‘పుంజు’కున్నాయ్‌

ABN , First Publish Date - 2023-01-15T00:59:00+05:30 IST

తొలికోడి కూసింది. ఏటా సంక్రాంతికి సందడి చేసే కోడి పందేలు ఒకరోజు ముందే కూత పెట్టాయి. కోడిపుంజులు పైపైకి ఎగిరాయి. కరెన్సీ కట్టలు జోరుగా చేతులు మారాయి. పేకముక్కలు గిరాగిరా తిరిగాయి. బరుల్లో పుంజులు చేసిన స్టంట్లను ఏకంగా ఎల్‌ఈడీ స్ర్కీన్లే చూపించాయి. అంపాపురం, ఈడుపుగల్లులో రూ.కోట్లు చేతులు మారగా, అనధికారిక మద్యం ఏరులై పారింది. ఎంట్రీ ఫీజులే ఏకంగా రూ.వేలల్లో వసూలు చేయడంతో భోగిరోజే భారీగా బరులు వెలిశాయి.

తొలిరోజే ‘పుంజు’కున్నాయ్‌

పందేలు, పేకాటపై రూ.50 కోట్ల వరకూ లావాదేవీలు

అధికార పార్టీ రాజకీయ నేతల కనుసన్నల్లోనే..

అంపాపురంలో పేకాటకు హైటెక్‌ హంగులు

ఎంట్రీ ఫీజే రూ.వేలల్లో..

ఈడుపుగల్లుకు పోటెత్తిన పందెపురాయుళ్లు

విజయవాడ/మచిలీపట్నం, ఆంధ్రజ్యోతి : సంక్రాంతి తొలిరోజే రెండు జిల్లాల్లో కోట్లాది రూపాయల్లో కోడి పందేలు జరిగాయి. పేకాట కూడా అంతకు భారీస్థాయిలోనే నడిచింది. ఒక్క భోగి రోజే రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకూ లావాదేవీలు నడిచాయని తెలుస్తోంది. ఏటా మాదిరిగానే అంపాపురం, ఈడుపుగల్లులో భారీగా కోడిపందేల బరులు, పేకాట శిబిరాలు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది కూడా హైటెక్‌ హంగులతో పందెం బరులు, పేకాట శిబిరాలు ఏర్పాటు చేశారు. అంపాపురంలో అత్యధికంగా బరులు ఏర్పాటయ్యాయి. ఆ తర్వాత ఈడుపుగల్లులో ఏర్పాట్లు చేశారు. పార్టీలతో సంబంధం లేకుండా రాజకీయ నేతలు బరులు సిద్ధం చేయగా, అధికార పార్టీ నేతల అనుచరులు అగ్రస్థానంలో ఉన్నారు.

భారీగా బరులు

కోడిపుంజులు ఒక రకం. వాటిపై జరిగే పందేలు మరో రకం. ఈ రెంటిలోనూ కామన్‌ పాయింట్‌ మాత్రం పందెం. పందేలపై కొందరు వేలల్లో పెడతారు. మరికొందరు లక్షల్లో కడతారు. వ్యత్యాసాలను బట్టి నిర్వాహకులు బరులు ఏర్పాటు చేశారు. రూ.లక్షల్లో పందేలు జరిగే బరుల చుట్టూ పటిష్ట ఏర్పాట్లు చేశారు. బరులకు చుట్టుపక్కల బౌన్సర్లను నియమించారు. వాళ్లందరినీ తెలంగాణ నుంచి రప్పించారు. బరులకు చుట్టుపక్కల కుర్చీలను ప్రముఖులకు, నిర్వాహకుల బంధువులు, స్నేహితులకు కేటాయించుకున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా పాస్‌లను ముద్రించారు. ఈ పాసులు ఉన్న వారినే బరుల సమీపానికి అనుమతించారు. తర్వాత వేలల్లో జరిగే పందేలకు సంబంధించి ప్రత్యేకంగా బరులను ఏర్పాటు చేశారు. వాటిని చిన్న బరులుగా వ్యవహరించారు. పెద్ద బరుల్లో మాత్రం రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు పందేలు జరిగాయి. సంక్రాంతి, కనుమ రోజున ఈ పందేలు మరింత పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విజయవాడ నగరానికి ఆనుకుని ఉన్న పాముల కాల్వ వద్ద ఈసారి కొత్తగా బరులు, శిబిరాలు వెలిశాయి. ఓ రాజకీయ పార్టీకి చెందిన నేత ఈ మొత్తం వ్యవహారాలను చక్కబెట్టినట్టు సమాచారం. పేకాట కోసం 50 టేబుళ్లను ఏర్పాటు చేశారు. వీటితో పాటు పందేలకు ప్రత్యేకంగా బరులను ఏర్పాటు చేశారు. కోడిపందేలు, పేకాట విచ్చలవిడిగా నిర్వహించిన ప్రాంతాల్లో అనధికారికంగా టోల్‌గేట్లు వెలిశాయి. టోలు చెల్లించిన వాహనాలనే అనుమతించారు.

సందట్లో సడేమియా

ప్రభుత్వ నిబంధనల ప్రకారం బీరు, లిక్కరును మద్యం దుకాణాల్లో మాత్రమే కొనాలి. ఇతర ప్రాంతాల్లో వాటిని ఎక్కడ విక్రయించినా నేరమే. అటువంటిది ఉమ్మడి కృష్ణాజిల్లాలో కోడిపందేల బరులు, పేకాట శిబిరాల వద్ద విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరిగాయి. ఎస్‌ఈబీ అధికారులు చూసీచూడనట్టు వ్యవహరించారు. అటు అంపాపురం, ఈడుపుగల్లు, అంబాపురం వద్ద పాములకాల్వ, జగ్గయ్యపేట, నందిగామ ప్రాంతాల్లో కోడిపందేలు, పేకాట జోరుగా నిర్వహించారు. ఈ వ్యవహారం ఈనెల 16 వరకు ఉంటుంది. పేకాటకు, కోడిపందేలకు వేర్వేరు శిబిరాలు ఉన్నట్టుగానే గుండాట, నెంబర్‌ ఆటలకు వేర్వేరుగా శిబిరాలు ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చే ఆటగాళ్లకు, వీక్షకులకు మందు అందజేయడానికి ప్రత్యేక కౌంటర్లు పెట్టారు. ఇక్కడ మద్యం, బీరు విక్రయించారు.

లైవ్‌లో వీక్షణ

కోడిపందేలు వీక్షించడానికి నిర్వాహకులు లైవ్‌ అనుభూతిని కల్పించారు. బరిలో పుంజులను దించిన వారిని బరిలోకి అనుమతిస్తారు. ప్రముఖులను, నిర్వాహకులకు పరిచయం ఉన్నవారిని బరికి చుట్టుపక్కల కూర్చోబెడతారు. పందేలను వీక్షించడానికి వెళ్లిన వారిని మాత్రం దూరంగా ఉంచుతారు. అటువంటి వారికోసం ప్రత్యేకంగా ఎల్‌ఈడీ స్ర్కీన్లు ఏర్పాటు చేశారు. బరుల వద్ద పందేలు చూసే వారి వల్ల ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఈ ఎల్‌ఈడీ స్ర్కీన్లు ఏర్పాటు చేశామని నిర్వాహకులు చెప్పారు.

తెర మూసేసి..

అంపాపురంలోని విశాల ఖాళీ స్థలంలో కోడిపందేలతో పాటు కేసినో నిర్వహించాలని నిర్వాహకులు భావించారు. దీనికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేశారు. కేసినో నిర్వాహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ విషయం పత్రికల్లో రావడంతో కేసినోకు కర్టెన్‌ వేసేశారు. దాని స్థానంలో పేకాట నిర్వహించారు. లోపల జరిగే వ్యవహారాలు బయటకు కనిపించకుండా చుట్టూ పరదాలు కట్టేశారు. లోగడ ఆసక్తి ఉన్న వారిని లోపలకు అనుమతించేవారు. ఈ ఏడాది మార్పు చేశారు. క్యాష్‌ కౌంటర్‌ను ఈసారి ప్రవేశద్వారం వద్ద ఏర్పాటు చేశారు. దీనికి రూ.60 వేలను నిర్ణయించారు. ఈ మొత్తం చెల్లించిన వారినే లోపలకు అనుమతించారు. పేకలు తిరగడానికి ప్రత్యేకంగా టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్‌పై లక్షలాది రూపాయలు చేతులు మారాయి. పేకాటలో ముక్కలు వదలకుండా కూర్చున్న వారికి తిన్నంత ఆహారం, తాగినంత మందు సమకూర్చారు. ఇందుకోసమే ప్రవేశ రుసుమును రూ.60 వేలుగా నిర్ణయించారని తెలిసింది.

Updated Date - 2023-01-15T00:59:02+05:30 IST