పరిహారం ఇవ్వండి మహాప్రభో..!
ABN , First Publish Date - 2023-02-16T00:05:19+05:30 IST
మల్లవల్లి పారిశ్రామికవాడలో భూనిర్వాసితులు ఆందోళనబాట పట్టారు. 8 ఏళ్లుగా పరిహారం ఇవ్వకుండా అధికారుల చుట్టూ తిప్పుకుంటున్నారని ఆగ్రహించారు. భూమిని పంటలకూ ఉపయోగించకుండా, ఫ్యాక్టరీకి వినియోగించకుండా వదిలేశారని రైతులు మండిపడ్డారు. న్యాయం జరిగే వరకూ పోరాటం ఆపబోమని బీష్మించారు. పరిహారం కోసం బుధవారం గ్రీన్‌ఫీల్డ్ రహదారిని దిగ్బంధించారు. సీఐ హామీతో ఆందోళన విరమించారు.
మల్లవల్లి పారిశ్రామికవాడ భూనిర్వాసితుల గగ్గోలు
8 ఏళ్లుగా తిప్పుకుంటున్న అధికారులు
ఆదాయ మార్గంలేక కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతున్నాయని ఆవేదన
రహదారిని దిగ్బంధించిన రైతులు
మల్లవల్లి పారిశ్రామికవాడలో భూనిర్వాసితులు ఆందోళనబాట పట్టారు. 8 ఏళ్లుగా పరిహారం ఇవ్వకుండా అధికారుల చుట్టూ తిప్పుకుంటున్నారని ఆగ్రహించారు. భూమిని పంటలకూ ఉపయోగించకుండా, ఫ్యాక్టరీకి వినియోగించకుండా వదిలేశారని రైతులు మండిపడ్డారు. న్యాయం జరిగే వరకూ పోరాటం ఆపబోమని బీష్మించారు. పరిహారం కోసం బుధవారం గ్రీన్‌ఫీల్డ్ రహదారిని దిగ్బంధించారు. సీఐ హామీతో ఆందోళన విరమించారు.
హనుమాన్‌జంక్షన్ రూరల్, ఫిబ్రవరి 15 : మల్లవల్లిలోని మోడల్ పారిశ్రామికవాడను అభివృద్ధి చేసే నిమిత్తం ఆర్‌ఎస్ నంబరు 11లో రైతుల వద్ద నుంచి 1470 ఎకరాలను ఎకరానికి 7.50 లక్షల నష్టపరిహారం చెల్లించి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. జియోకాన్ సర్వే ఆధారంగా గుర్తించిన రైతుల్లోనే 112 మంది రైతులకు నష్టపరిహారం అందించలేదు. 8 ఏళ్లుగా భూనిర్వాసిత రైతులు తమ దగ్గర ఉన్న ఆధారాలతో ప్రజాప్రతినిధులు చుట్టూ తిరుగుతూ, గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి అధికారుల వరకు అందరికీ అర్జీలు సమర్పించినా సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. అందులోమామిడితోటలు, మొక్కజొన్న, పామాయిల్, ఉలవలు సాగులో ఉన్న భూములను అటు రైతులు ఉపయోగించుకోకుండా ఇటు ఫ్యాక్టరీలకు ఇవ్వకుండా పాడు బెడుతున్నారని భూనిర్వాసిత రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. త్రిసభ్య కమిటీలంటూ జిల్లాస్థాయి అధికారులు ఆర్జీలు తీసుకుని కూడా క్షేత్రస్థాయిలో సమస్య ఇంత వరకు పరిస్కారమవడం లేదంటే కారణమేమిటో తెలియట్లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. సహనం చచ్చిపోయి నష్టపరిహారం విషయంలో న్యాయం జరిగేవరకూ మల్లవల్లి పారిశ్రామికవాడ గ్రీన్‌ఫీల్డ్ రహదారిపై అందోళన చేసేందుకు రైతులు సిద్ధమయ్యారు.
జీతాలు ఆపేస్తే రైతుల బాధ తెలుస్తుంది
కొంతమంది రాజకీయ స్వార్ధానికి తమను బలిపశువులు చేశారు. సాగు భూమి ఎవరి పేరున ఉందో, ఏ రైతు అర్హుడోరెవెన్యూ సిబ్బందికి తెలుసు. కానీ కాసులు ఇచ్చే వారి ప్రోద్బంలంతో దళిత రైతులను మోసం చేస్తున్నారు. రెవెన్యూ సిబ్బందికి రెండు నెలలు జీతాలు ఆపేస్తే భూ నిర్వాసిత రైతుల బాధలు అర్థమవడంతోపాటు సమస్య త్వరితగతిన పరిష్కారమవుతుంది.
- పంతం కామరాజు
కుటుంబాలు చితికిపోతున్నాయి
పోలసానపల్లికి చెందిన తనకు అడవిలో 8 ఎకరాల భూమి ఉంది. నా ఇద్దరు ఆడబిడ్డలకు కట్నంగా చెరి 3 ఎకరాలు ఇచ్చాం. పూర్తి వివరాలు ఆధారాలతో సహా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకువెళ్లాం. ఇంతవరకు న్యాయం జరగలేదు. ఉలవలు సాగుచేస్తుంటే పోలీసుల సహకారంతో పంట మొత్తాన్ని తొక్కించేసి మట్టిరోడ్డు వేశారు. నా భర్త కూడా మనోవేదనతోనే ఇటీవల మృతి చెందాడు. ఆడపిల్లలకు కట్నంగా ఇచ్చిన భూమి ఇప్పుడు లేకపోవడంతో కుటుంబాలు చిన్నాభిన్నమయ్యేస్థితికి వచ్చాయి.
- పోలవరపు నాగమణి
పరిహారం కోసం రైతుల ఆందోళన
సీఐ హామీతో విరమణ
పరిహారం కోసం భూనిర్వాసితులు మల్లవల్లి గ్రీన్‌ఫీల్డ్ రహదారిపై బుధవారం ఉదయం ఆందోళన చేపట్టారు. రహదారిని దిగ్బంధించారు. దీంతో ట్రాఫిక్ ఆగిపోయింది. హనుమాన్‌జంక్షన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నరసింహమూర్తి, ఎస్సై సూర్య శ్రీనివాస్... రైతులకు నచ్చజేప్పేందుకు ప్రయత్నించారు. ఒకానొక సమయంలో ఇరువైపులా వాగ్వివాదం చోటుచేసుకుంది. ఉన్నతాధికారులతో మాట్లాడతానని సీఐ హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. సీఐ హామీతో రహదారి దిగ్భంధన కార్యక్రమాన్ని 7 రోజులు వాయిదా వేసుకుంటున్నామని, అప్పటికీ సమస్య పరిష్కారం కాకుంటే ఈసారి ఎవరు చెప్పినా వినేది లేదని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని పంతం కామరాజు, వేముల వెంకట్రావు, తదితరులు హెచ్చరించారు.