లోపాలు నిజమే!

ABN , First Publish Date - 2023-07-22T01:45:07+05:30 IST

సమగ్ర ఓటరు సర్వే ప్రారంభ రోజునే యాప్‌ పనిచేయక పోవడంతో బీఎల్‌వోలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఇంటింటా సర్వే కార్యక్రమానికి ఆదిలోనే ఇబ్బందులు ఎదురయ్యాయి. బీఎల్‌వోలతో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు శుక్రవారం ఇంటింటికి పర్యటించారు. ఈ సందర్భంగా సర్వేలో ఓటరు జాబితాల్లో పలు అవకతవకలు వెలుగుచూశాయి.

లోపాలు నిజమే!
ఈడేపల్లిలోని పోలింగ్‌ కేంద్రాన్ని సందర్శించిన తహసీల్ధార్‌ శ్రీదేవి

తొలిరోజే మొరాయించిన యాప్‌లు

మచిలీపట్నంలో జాబితాల్లో పలు అవకతవకలు

ఎన్టీఆర్‌ జిల్లాలో కలెక్టర్‌ దిల్లీరావు తనిఖీ

మచిలీపట్నం టౌన్‌, జూలై 21 : సమగ్ర ఓటరు సర్వే ప్రారంభ రోజునే యాప్‌ పనిచేయక పోవడంతో బీఎల్‌వోలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఇంటింటా సర్వే కార్యక్రమానికి ఆదిలోనే ఇబ్బందులు ఎదురయ్యాయి. బీఎల్‌వోలతో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు శుక్రవారం ఇంటింటికి పర్యటించారు. ఈ సందర్భంగా సర్వేలో ఓటరు జాబితాల్లో పలు అవకతవకలు వెలుగుచూశాయి. డోర్‌ నెంబర్లు లేని పేర్లు కనబడ్డాయి. ఆర్డీవో కిషోర్‌ గాంధీనగర్‌, గంగులవాని తోటలో ఓటర్ల జాబితాల్లో అవకతవకలు ఆర్డీవో దృష్టికి వచ్చాయి. ఇంటి యజమానితో పాటు అద్దెకు ఉంటున్న వారిపేర్లు కూడా ఒకే కుటుంబ ఓటర్లుగా నమోదయ్యాయి. వేరే ప్రాంతాల ఓటర్లు నమోదైన సందర్భాలు కూడా చోటు చేసుకున్నాయి. తహసీల్ధార్‌ శ్రీదేవి ఈడేపల్లి 45వ డివిజన్‌లో 83వ పోలింగ్‌ కేంద్రం పరిశీలించారు. పోలింగ్‌ కేంద్రాల్లోని జాబితాల్లో తప్పులను స్థానిక టీడీపీ సీనియర్‌ నాయకులు గొర్రెపాటి గోపీచంద్‌, పార్లమెంటు ప్రచార కార్యదర్శి పీవీ ఫణికుమార్‌లు తహసీల్ధార్‌ దృష్టికి తీసుకువెళ్ళారు. డోర్‌ నెంబరు లేకుండా, భర్త పేరు ఒక బూత్‌లో, భార్య పేరు మరొక బూత్‌లో, మృతిచెందిన వారి పేర్లు ఓటర్ల జాబితాలో ఉన్నట్టు గుర్తించారు. గొడుగుపేటలో యాప్‌ మొరాయించింది.

పారదర్శకంగా చేపట్టాలి

ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ దిల్లీరావు

భవానీపురం : పారదర్శకంగా ఓటర్ల జాబితా తయారీకి బూత్‌ లెవెల్‌ అధికారులు(బీఎల్‌వో) ఇంటింటికి వెళ్లి పరిశీలన చేయాలని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌.దిల్లీరావు అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని భవానీపురంలో 45వ డివిజన్‌లో పోలింగ్‌ కేంద్రం పరిధిలో శుక్రవారం బీఎల్‌వోలతో ఓటర్ల జాబితా పరిశీలనను కలెక్టర్‌ స్వయంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, పశ్చిమలో ఇప్పటి వరకు 237382 మంది ఓటర్లు ఉండగా, 253 మంది బీఎల్‌వోలు క్షేత్రస్థాయిలో జాబితాలు పరిశీలిస్తున్నారన్నారు. బీఎల్‌వోల పరిశీలనలను ఏఈఆర్‌వోలు, మండల తహసీల్ధార్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. కలెక్టర్‌ వెంట పశ్చిమ తహసీల్ధార్‌ కాళీలక్ష్మి, డిప్యూటీ తహసీల్ధార్‌ ధరియాలు ఉన్నారు.

Updated Date - 2023-07-22T01:45:07+05:30 IST