కదలరు.. వదలరు..!

ABN , First Publish Date - 2023-06-26T00:55:55+05:30 IST

ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో ‘ప్రత్యేక’ పనితీరుతో, అధికారుల ప్రసన్నంతో ఒకేచోట పాతుకుపోయి, మరో విభాగానికి వెళ్లడానికి ఇష్టపడని ఉద్యోగులకు దేవదాయ శాఖ ఝలక్‌ ఇచ్చింది. ఇక నుంచి ఈ విధానానికి ఫుల్‌స్టాప్‌ పెట్టి, ఎవరు ఏ విభాగంలో పనిచేస్తున్నా, ఏ సీట్లో విధులు నిర్వర్తిస్తున్నా ప్రతి మూడు నెలలకోసారి రొటేషన్‌ పద్ధతిలో మార్పులు చేయాల్సిందేనని ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఆదేశాలతో దుర్గగుడి ఉద్యోగుల గొంతులో వెలక్కాయ పడినట్టయింది.

కదలరు.. వదలరు..!

అధికారుల ప్రసన్నంతో అదే సీటులో..

చెక్‌ పెట్టిన దేవదాయ శాఖ ఉత్తర్వులు

మూడు నెలలకోసారి మార్చాలని ఆదేశాలు

(ఆంధ్రజ్యోతి-విజయవాడ) :

  • లడ్డూ కౌంటర్‌లో ఉన్న ఓ ఉద్యోగి మరో విభాగానికి వెళ్లడానికి అసలు ఇష్టపడరు.

  • టికెట్‌ కౌంటర్‌లో ఉన్న ఉద్యోగి ఎస్టాబ్లిష్‌మెంట్‌ వైపు కన్నెత్తి కూడా చూడరు.

ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో ‘ప్రత్యేక’ పనితీరుతో, అధికారుల ప్రసన్నంతో ఒకేచోట పాతుకుపోయి, మరో విభాగానికి వెళ్లడానికి ఇష్టపడని ఉద్యోగులకు దేవదాయ శాఖ ఝలక్‌ ఇచ్చింది. ఇక నుంచి ఈ విధానానికి ఫుల్‌స్టాప్‌ పెట్టి, ఎవరు ఏ విభాగంలో పనిచేస్తున్నా, ఏ సీట్లో విధులు నిర్వర్తిస్తున్నా ప్రతి మూడు నెలలకోసారి రొటేషన్‌ పద్ధతిలో మార్పులు చేయాల్సిందేనని ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఆదేశాలతో దుర్గగుడి ఉద్యోగుల గొంతులో వెలక్కాయ పడినట్టయింది.

అసలు కథ ఇదీ..

సాధారణ బదిలీల సమయంలో సిబ్బంది ఒక దేవస్థానం నుంచి మరో దేవస్థానానికి బదిలీ అవుతున్నారు. ఇతర దేవస్థానాల నుంచి దుర్గామల్లేశ్వరస్వామి ఆలయానికి వచ్చిన సిబ్బంది వివిధ విభాగాల్లో విధుల్లో చేరుతున్నారు. ఇలా ఒకసారి ఆయా విభాగాల్లో చేరిన ఉద్యోగులు అక్కడే సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. అధికారుల ఆశీస్సులు పుష్కలంగా ఉంటే ఎన్నాళ్లయినా అక్కడే ఉండిపోతున్నారు. తెరవెనుక వ్యవహారాలు తెలివిగా చేసుకుంటున్నారు. ఈ చేష్టలు ఆలయ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నాయి. దుర్గగుడిలో ఇంజనీరింగ్‌, ప్రసాదం, టికెట్‌ విభాగం, లీజులు, టెండర్లు, పూజలు, ఎస్టాబ్లిష్‌మెంట్‌, పారిశుధ్యంతో పాటు పలు విభాగాలు ఉన్నాయి. వీటికి ఏఈవోలు, ఇంజనీరింగ్‌ విభాగాలకు ఈఈ, డీఈ, ఏఈలు ఉన్నారు. మిగిలిన విభాగాల్లో సూపరింటెండెంట్లు, సీనియర్‌, జూనియర్‌, రికార్డు అసిస్టెంట్లు, నాల్గో తరగతి సిబ్బంది ఉన్నారు. సాధారణ బదిలీలు వచ్చే వరకు వారంతా విభాగాలు మారుతున్న దాఖలాలు లేవు. అధికారులు అంతర్గత బదిలీలు చేస్తున్నప్పటికీ అందులో కొంతమందికే స్థానచలనం ఉంటుంది. అధికారుల ఆశీస్సులు పుష్కలంగా ఉన్నవారు మాత్రం చేరిన విభాగంలోనే సాధారణ బదిలీల వరకు కొనసాగుతున్నారు. కొంతమంది ఉద్యోగులపై ఆరోపణలు వస్తున్నప్పటికీ వారికి ఎలాంటి స్థానచలనం ఉండట్లేదు. కొంతమంది అధికారులు ప్రస్తుతం నడుస్తున్న విధానాన్ని కదపడం ఎందుకులే అనుకుంటుండగా, మరికొందరు వారి ప్రాధాన్యాలకు అనుగుణంగా మార్పులు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఇదే పరిస్థితి కొనసాగుతూ వచ్చింది. ముఖ్యంగా ప్రసాదాలు, టికెట్‌ కౌంటర్లు, ఇంజనీరింగ్‌, టెండర్ల విభాగాల్లో ఉద్యోగులు కొందరు ‘ప్రత్యేక’ పనితీరును చూపిస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గంలో వచ్చే ఆదాయం ఉండటంతో ముందే కర్చీఫ్‌లు వేసుకుంటున్నారు. మరోపక్క ప్రధానాలయం వద్ద విధులు నిర్వర్తించడానికి ఎక్కువమంది పోటీపడుతున్నారు. ఇలాంటి వారికి దేవదాయ శాఖ ఇచ్చిన ఉత్తర్వులు షాక్‌కు గురి చేశాయి.

కొత్త నిబంధనలివీ..

  • ఏఈవోలు, సూపరింటెండెంట్లు, సీనియర్‌, జూనియర్‌, రికార్డు అసిస్టెంట్లను ప్రతి మూడు నెలలకు ఒకసారి రొటేషన్‌ పద్ధతిలో మార్పు చేయాలి.

  • కౌంటర్లలో విధులు నిర్వర్తించే ఉద్యోగులు, నాల్గో తరగతి ఉద్యోగులను ప్రతి మూడు నెలలకు ఒకసారి రొటేషన్‌ పద్ధతిన మార్చాలి.

  • అవుట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగులను మూడు నెలలకు ఒకసారి రొటేషన్‌ చేయాలి.

  • పారిశుధ్య, సెక్యూరిటీ సిబ్బందిని కూడా ఇలాగే మార్చాలి.

  • అవుట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ పద్ధతిలో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందిని వారు పనిచేస్తున్న విభాగంలోనే కొనసాగిస్తూ సీట్లు మార్చవచ్చు.

Updated Date - 2023-06-26T00:55:55+05:30 IST