ఉద్యోగుల ఉద్యమం
ABN , First Publish Date - 2023-03-05T00:34:10+05:30 IST
ఏపీ జేఏసీ అమరావతి ఉమ్మడి జిల్లాశ్రేణులు తొలి దశ ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతున్నాయి. బెజవాడ వేదికగా ఏపీజేఏసీ అమరావతి ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన నేపథ్యంలో, ఈ మేరకు ఉమ్మడి జిల్లా శ్రేణులు కూడా ఈనెల 9 నుంచి అమలు చేయాల్సిన కార్యాచరణకు సంబంధించి సన్నాహక సమావేశాన్ని తాజాగా నిర్వహించాయి.
ఇప్పటికే సన్నాహక సమావేశం నిర్వహణ
ఎన్నికల ముంగిట చావో రేవో తేల్చుకోవాలని నిర్ణయం
దేనికైనా సిద్ధపడాలని ఏపీ జేఏసీ అమరావతి పిలుపు
జేఏసీ సభ్య సంఘాల సన్నాహక సమావేశాలు ప్రారంభం
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఏపీ జేఏసీ అమరావతి ఉమ్మడి జిల్లాశ్రేణులు తొలి దశ ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతున్నాయి. బెజవాడ వేదికగా ఏపీజేఏసీ అమరావతి ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన నేపథ్యంలో, ఈ మేరకు ఉమ్మడి జిల్లా శ్రేణులు కూడా ఈనెల 9 నుంచి అమలు చేయాల్సిన కార్యాచరణకు సంబంధించి సన్నాహక సమావేశాన్ని తాజాగా నిర్వహించాయి. నాలుగేళ్లుగా ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను ఒక్కటి కూడా పరిష్కరించకపోవటం, ఉద్యోగులు దాచుకున్న డబ్బును ఇవ్వకపోవటం, డీఏ, ఇతర బకాయిలను చెల్లించకపోవటం, ఆఖరుకు జీతాలను కూడా సక్రమంగా ఇవ్వకపోవడం, పీఆర్సీలో అన్యాయం జరగటం వంటి కారణాలపై ఈ సమావేశంలో జేఏసీ నేతలు డి.ఈశ్వర్, వీవీ మురళీకృష్ణం నాయుడు మాట్లాడారు. ఆ దిశగా ఉద్యోగులను కార్యోన్ముఖులను చేశారు. ఏపీ జేఏసీ అమరావతిలోని 115 సభ్య సంఘాల ఉమ్మడి జిల్లా నేతలంతా ఈ సమావేశంలో పాలు పంచుకున్నారు.
కార్యోన్ముఖులై..
ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉండటం.. ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశాలు కూడా లేకపోవటంతో పోరాటం దిశగా అడుగులు వేస్తున్నారు. చలో విజయవాడ ఉద్యమ స్ఫూర్తితో విజయవాడలోనూ, ఉమ్మడి జిల్లాలోనూ ఉద్యోగులు మరింతగా కదం తొక్కాల్సిన అవసరాన్ని వివరించారు. చలో విజయవాడ అనంతరం ఉపాధ్యాయులు, సీపీఎస్ ఉద్యోగుల ఉద్యమాలను ప్రభుత్వం అణచివేసిన తీరు గురించి కూడా ఉమ్మడి జిల్లా జేఏసీ నేతలు వివరించారు.
కలిసికట్టుగా..
తొలుత ఉద్యమానికి ఏపీ జేఏసీ అమరావతి జెండా ఊపిన నేపథ్యంలో కలిసొచ్చే జేఏసీలపై స్పష్టత రావాల్సి ఉంది. అన్ని జేఏసీలు కలిసి పోరాడితేనే ప్రభుత్వంపై ఒత్తిడి పెంచగలమని అభిప్రాయపడ్డారు. ఏపీ జేఏసీ నుంచి కూడా సహకారం వస్తుందని భావిస్తున్నామని, రెండు జేఏసీలు కలిస్తే ఉద్యమం పతాక స్థాయిలో జరుగుతుందన్నారు. ఈ ఉద్యమంలో పోలీసు నిర్బంధాలు, అరెస్టులు వంటివి పనిచేయవన్నారు. ఉద్యమం పతాక స్థాయికి వెళ్లినపుడు ‘ఎస్మా’ ప్రయోగిస్తామని ప్రభుత్వం బెదిరిస్తోందని, భయపడాల్సిన అవసరం లేదన్నారు. సభ్య సంఘాలు కూడా ఈ మూడు రోజుల్లో సమావేశాలు నిర్వహించి కార్యాచరణను అమలు చేయటానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సిందిగా పిలుపునిచ్చారు. దీంతో సభ్యసంఘాలు కూడా శాఖల వారీగా సమావేశమవుతున్నాయి. రెండు జిల్లాల స్థాయిలో తమతమ శాఖల పరిధిలో చేపట్టాల్సిన ఉద్యమ ప్రణాళికలపై చర్చించుకుంటున్నాయి. ప్రతి కార్యక్రమంలో ఉద్యోగులు పెద్దసంఖ్యలో తరలివచ్చేందుకు సంసిద్ధం చేస్తున్నాయి.