విద్యావంతుల తీర్పు.. రాష్ర్టానికి మలుపు!

ABN , First Publish Date - 2023-03-19T00:47:04+05:30 IST

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయం వైసీపీ రాక్షసపాలన అంతానికి నాంది అని, మూడుస్థానాల్లో తమ అభ్యర్థులు విజయం సాధించి చరిత్రను తిరగరాసారని టీడీపీ నేతలు పేర్కొన్నారు.

విద్యావంతుల తీర్పు.. రాష్ర్టానికి మలుపు!
మచిలీపట్నంలో టపాసులు కాలుస్తున్న టీడీపీ శ్రేణులు

మచిలీపట్నం టౌన్‌, మార్చి 18 : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయం వైసీపీ రాక్షసపాలన అంతానికి నాంది అని, మూడుస్థానాల్లో తమ అభ్యర్థులు విజయం సాధించి చరిత్రను తిరగరాసారని టీడీపీ నేతలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వేపాడ చిరంజీవి, భూమిరెడ్డి రాంగోపాల్‌ రెడ్డి, కంచర్ల శ్రీకాంత్‌లకు అభినందనలు తెలియజేశారు. ప్రభుత్వ మూడు ముక్కల పాలనపై విశాఖ, కర్నూలు జిల్లాల ప్రజలు తమ నిర్ణయాన్ని ఓట్ల రూపంలో స్పష్టం చేశారని అన్నారు. శనివారం పార్లమెంటు, అసెంబ్లీ కార్యాలయాల వద్ద టీడీపీ నాయకులు టపాసులు కాల్చి స్వీట్లు పంచారు.

రాక్షస పాలనకు అంతం

- కొల్లు రవీంద్ర

వైసీపీ పాలన అంతానికి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు నాంది పలికాయి. సీఎం సొంత జిల్లాలో వైసీపీ ఓటమిని చూసింది.

చంద్రబాబు ఆశయం ఫలించింది

- కొనకళ్ల నారాయణ

టీడీపీ అభ్యర్థుల విజయంతో చంద్రబాబు ఆశయం ఫలించింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పతనం ఖాయం.

దొంగ ఓట్లకు చెక్‌ పెట్టాం

- బూరగడ్డ వేదవ్యాస్‌

రాయలసీమ పశ్చిమ నియోజక వర్గ ఎన్నికల ప్రచారానికి ఇన్‌చార్జిగా వ్యవహరించి దొంగ ఓట్లను అరికట్ట గలిగాము. ఈ ఫలితాలతో తెలుగుదేశం పార్టీని ప్రజలు తిరిగి కోరుకుంటున్నారని స్పష్టమైంది. జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన విజయోత్సవంలో టీడీపీ నేతలు గొర్రెపాటి గోపీచంద్‌, పల్లపాటి సుబ్రహ్మణ్యం, పీవీ ఫణికుమార్‌, వక్కపట్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

వైసీపీకి బుద్ది చెప్పారు..

పాయకాపురం : ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి విద్యావంతులు తగిన బుద్ధి చెప్పారని బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. విశాఖ ప్రజలంతా తమతోనే ఉన్నారని చెప్పుకునే వైసీపీ ప్రభుత్వానికి ఈ ఫలితాలు చెంపపెట్టని పేర్కొన్నారు. మూడు పట్టభద్రుల స్థానాల్లో టీడీపీ అభ్యర్థులే విజయం సాధించారని, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ విజయానికి ఈ విజయమే నిదర్శనమని స్పష్టం చేశారు. ఆయన నివాసం వద్ద శనివారం టీడీపీ శ్రేణులు కేక్‌ కట్‌ చేసి, బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.

విద్యావంతుల తీర్పుతో రాష్ట్రానికి మంచి..

విద్యాధరపురం : గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతుల తీర్పుతో రాష్ట్రానికి మంచి జరుగుతుందని ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురామ్‌ అన్నారు. జగన్‌ రెడ్డి మూడు రాజధానుల డ్రామాకు ఉత్తరాంధ్ర ప్రజలు, విద్యావంతులు తెరదించారన్నారు. రాజధాని లేని రాష్ట్రంగా నాలుగేళ్ల జగన్‌ పాలనతో ప్రజలు విసిగెత్తి ఉన్నారన్నారు. రూ.13 లక్షల కోట్లు పెట్టుబడులు తెస్తున్నామని మోసం చేయడానికి పూనుకున్న జగన్‌కు ఉత్తరాంధ్ర ప్రజల తీర్పు చెంపపెట్టు అన్నారు. రానున్న ఎన్నికలలో జగన్‌కు గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

వైసీపీ ప్రభుత్వ పతనానికి నాంది

8 నందమూరి రామకృష్ణ

వన్‌టౌన్‌ : పట్టభద్రుల ఎన్నికల ఫలితాలు వైసీపీ ప్రభుత్వ పతనానికి నాంది అని స్వర్గీయ ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం ఎన్‌టీ రామారావు తనయుడు నందమూరి రామకృష్ణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జగన్‌రెడ్డి అహంభావ విధానాలకు చెంపపెట్టు అని, విద్యావంతులు విజ్జతతో తీర్పు ఇచ్చారన్నారు. కుప్పం కోటను బద్దలు కొడతామని ప్రగల్భాలు పలికిన జగన్‌ వందిమాగధులకు పట్టభత్రులు గుణపాఠం చెప్పారన్నారు. టీడీపీ ముఖ్య నేతలను లెక్కింపు కేంద్రాలకు రాకుండా గృహనిర్బంధం చేసినా గెలుపును ఆపలేకపోయారన్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉంటూ, రాక్షస ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా, కేసులు పెట్టినా భయపడకుండా పోరాటం చేస్తున్న కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో ప్రజలు ఇంతకుమించిన రెట్టింపు ఉత్సాహంతో వైసీపీని తిప్పి కొట్టడం ఖాయమన్నారు. ఏపీ పునర్నిర్మాణం కోసం చంద్రబాబునాయుడు నాయకత్వాన్ని మరల తీసుకురావాలన్నారు. టీడీపీని అంతం చేయాలని జగన్‌రెడ్డి విశ్వపయత్నం చేశారని, అయితే పట్టభద్రులు తగిన గుణపాఠం చెప్పారన్నారు. ఎన్‌టీఆర్‌ స్థాపించిన టీడీపీనీ ఎవరూ ఏమీ చేయలేరని, తెలుగు జాతి ఉన్నంతకాలం టీడీపీ వెలుగుతూనే ఉంటుందన్నారు.

విజయవాడ కేశినేని భవన్‌ వద్ద సంబరాలు..

వియవాడ కేశినేని భవన్‌ వద్ద పార్టీ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురామ్‌, కోశాధికారి శ్రీరాం రాజగోపాల్‌ (తాతయ్య) ఆధ్వర్యంలో టీం టీడీపీ సంబరాలు జరుపుకుంది. స్వీట్లు పంచారు. టపాకాయలు కాల్చారు.

Updated Date - 2023-03-19T00:47:04+05:30 IST