Share News

ఈ చీకటి చట్టం మాకొద్దు

ABN , Publish Date - Dec 23 , 2023 | 01:02 AM

కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన భూ హక్కు చట్టం-2022 మాకొద్దని బెజవాడ బార్‌ న్యాయవాదులు ముక్తకంఠంతో ఖండించారు. భూ హక్కు చట్టాన్ని వ్యతిరేకిస్తూ బార్‌ అసోసియేషన్‌ ఆవరణలో చేపట్టిన రెండో రోజు నిరసన దీక్షలో మహిళా న్యాయవాదులు ఎం.మణెమ్మ, కె.జయప్రభ, పి.దుర్గా ఝాన్సీరాణి, ఎం.చంద్రకుమారి, వి.ఎస్తేరు, గుమ్మడి అనితలు పాల్గొన్నారు.

ఈ చీకటి చట్టం మాకొద్దు
భూ హక్కు చట్టానికి వ్యతిరేకంగా సివిల్‌ కోర్టుల సమీపంలో న్యాయవాదుల మానవహారం

విజయవాడ లీగల్‌, డిసెంబరు 22 : కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన భూ హక్కు చట్టం-2022 మాకొద్దని బెజవాడ బార్‌ న్యాయవాదులు ముక్తకంఠంతో ఖండించారు. భూ హక్కు చట్టాన్ని వ్యతిరేకిస్తూ బార్‌ అసోసియేషన్‌ ఆవరణలో చేపట్టిన రెండో రోజు నిరసన దీక్షలో మహిళా న్యాయవాదులు ఎం.మణెమ్మ, కె.జయప్రభ, పి.దుర్గా ఝాన్సీరాణి, ఎం.చంద్రకుమారి, వి.ఎస్తేరు, గుమ్మడి అనితలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు సుంకర రాజేంద్రప్రసాద్‌, బార్‌ అధ్యక్షుడు కేబీ సుందర్‌, మాజీ అధ్యక్షుడు సోము కృష్ణమూర్తి, వి.గురునాథం, ఉపాధ్యక్షుడు పుప్పాల శ్రీనివాసరావు, నామాల కోటేశ్వరరావు తదితరులు మాట్లాడుతూ.. భూ హక్కు చట్టం-2022 చీకటి చట్టమని, ఈ చట్టం మాకొద్దని మండిపడ్డారు. ఈ చట్టం ద్వారా భూమి హక్కుల యాజమాన్యంలో సమూల మార్పులు చేస్తూ రెవెన్యూ అధికారులకు (ల్యాండ్‌ టైటిలింగ్‌ అథారిటీని) భూమిపై హక్కులు నిర్ధారించే అధికారం సంక్రమింపచేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ప్రజల రాజ్యాంగబద్ధమైన, చట్టబద్ధమైన భూమి హక్కులకు తీవ్ర విఘాతం కలిగిస్తుందన్నారు. ప్రపంచ బ్యాంకు ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ సర్వే 2019 ప్రకారం భారతదేశం ప్రపంచ దేశాల్లో భూ రిజిస్ర్టేన్లలో 154 స్థానంలో వుందని, 66 శాతం కేసులు భూ వివాదాల కేసులేనని, భూ చట్టాల అమలులో 163వ స్థానంలో వుందని, వీటిని సరిచేయాలంటే భూ వివాదాల పరిష్కారానికి న్యాయవ్యవస్థను తప్పించి, రెవెన్యూ అధికారులకు సంక్రమింపచేస్తే వివాదాలు సత్వరం పరిష్కారం జరుగుతాయని, భూమిపై వ్యాపారం త్వరగా జరుగుతుందని ఇచ్చిన రిపోర్ట్‌ ఆధారంగా నీతి ఆయోగ్‌ సీఈవో ప్రతిపాదన మేరకు దేశవ్యాప్తంగా ఇలాంటి చట్టాలు రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలని సూచించారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రూపొందించిన చట్టంలో సెక్షన్‌ 3 ద్వారా ల్యాండ్‌ అథారిటీ పూర్తి ఆధారాలతో భూ హక్కులు నిర్ధారిస్తుందని పేర్కొన్నారు. ఈ అథారిటీ రికార్డ్‌ ఆఫ్‌ టైటిల్‌ నమోదు చేసి స్థిరాస్తుల హక్కులు నిర్ధారిస్తుందని చట్టం పేర్కొందని వారు తెలిపారు. సెక్షన్‌ 7 ప్రకారం ల్యాండ్‌ టైటిలింగ్‌ అథారిటీ భూ హక్కులకు సంబంధించిన రికార్డులు నోటిఫైడ్‌ ఏరియాలో వున్న ఇతర రికార్డులను పరిశీలించి ఆ ఏరియా స్థిరాస్తుల హక్కులను నిర్ధారణ చేస్తారని చట్టం పేర్కొందన్నారు. ఈ చట్టం వలన పేద, మధ్య తరగతి, బడుగు, బలహీన వర్గాల వారికే తీవ్ర నష్టం జరుగుతుందని న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం న్యాయవాదులంతా బెజవాడ బార్‌ అసోసియేషన్‌ నుంచి ర్యాలీగా ఐదో నెంబరు రోడ్డులో సాయిరామ్‌ హోటల్‌ జంక్షన్‌ వద్ద మానవహారం నిర్వహించారు. కిలారు బెనర్జీ, ఆలూరు సుధాకరరావు, పీడీఎస్‌ నారాయణ, పుప్పాల శ్రీనివాస్‌, సప్పా రమేష్‌, బొమ్మసాని రవి, విష్ణుభొట్ల జయప్రకాష్‌, గంధం శ్రీను, వేముల శ్రీనివాసరావు, కఠారి సుబ్రమణ్యం, బార్‌ ప్రధాన కార్యదర్శి జన్ను శ్రీధర్‌, మహిళా కార్యదర్శి జయలక్ష్మి, నరహరిశెట్టి జ్యోతి పాల్గొన్నారు.

Updated Date - Dec 23 , 2023 | 01:02 AM