మా ఇంటికి రావొద్దు..

ABN , First Publish Date - 2023-03-01T00:57:06+05:30 IST

పరిటాలలో మంగళవారం రాత్రి గడపగడపకు మన ప్రభుత్వంలో పాల్గొన్న ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్‌రావుకు నిరసన సెగ తగిలింది. ఎమ్మెల్యే మా ఇంటికి రావొద్దంటూ ముస్లిం ఏరియాలో మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వలంటీర్ల తొలగింపుపై నిలదీశారు.

మా ఇంటికి రావొద్దు..
గడప గడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యేను జగన్మోహన్‌రావును నిలదీస్తున్న ప్రజలు

ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని మహిళలు వాగ్వాదం

పింఛన్లు, పథకాలు తీసేశారని నిలదీత

అరుపులు కేకలతో దద్దరిల్లిన ముస్లిం కాలనీ

పోలీస్‌ బందోబస్తు మధ్య కార్యక్రమం

కంచికచర్ల రూరల్‌, ఫిబ్రవరి 28 : పరిటాలలో మంగళవారం రాత్రి గడపగడపకు మన ప్రభుత్వంలో పాల్గొన్న ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్‌రావుకు నిరసన సెగ తగిలింది. ఎమ్మెల్యే మా ఇంటికి రావొద్దంటూ ముస్లిం ఏరియాలో మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వలంటీర్ల తొలగింపుపై నిలదీశారు. ఎమ్మెల్యేగా నాలుగేళ్లకు వచ్చావు.. గ్రామంలో నీ తాబేదార్లకు ముస్లిం ప్రజలంటే కన్ను మిన్ను కానకుండా ఉందన్నారు.. ఒక్కొ గదిలో 10 మంది ఉంటున్నా ఇళ్ల స్థలం కూడా ఇవ్వలేదని కొందరు మహిళలు ఎమ్మెల్యేను నిలదీశారు. 30 గజాలు ఉన్న ఇంటికి రెండు పన్నులు వచ్చాయని.. ఇదే మీ పని తీరుకు నిదర్శమని స్థానిక వ్యక్తి ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. పింఛన్లు, పథకాలు తీశారని మరి కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ఇంటింటికీ తిరిగి ఓట్లు వేయించాం.. గెలిచి మాకు వస్తున్న పథకాలు తీసి మా బతుకులు నాశనం చేశారు. మా ఇళ్లకు రావద్దంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలనీలో విద్యుత్‌ స్తంభాలు వేయమని ఏడాదిగా అడుగుతున్నా దిక్కు లేదని గొడవ చేశారు. తొలుత కార్యక్రమం ప్రారంభంలోనే ఎమ్మెల్యేకు నిరసన సెగ తగలడంతో కాలనీవాసులకు ఎమ్మెల్యే అనుచరులకు వాగ్వాదం జరిగింది. బాధితులతో ఎమ్మెల్యే వాగ్వాదానికి దిగడమేకాక వేలు చూపిస్తూ మాట్లాడటంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసేదిలేక పోలీసుల సాయంతో ఎమ్మెల్యే రాత్రి తొమ్మిది వరకూ ఇంటింటికి తిరిగారు.

Updated Date - 2023-03-01T00:57:06+05:30 IST