రైతుల్లో అలజడి
ABN , First Publish Date - 2023-12-03T00:41:28+05:30 IST
మిచౌంగ్ తుఫాన్ దూసుకొస్తుందన్న హెచ్చరికల నేపథ్యంలో అన్నదాతల్లో శనివారం అలజడి రేగింది. పంటను కాపాడుకునేం దుకు అవస్థలు పడుతున్నారు. ధాన్యం రాశులపై కప్పేందుకు ప్రభుత్వం టార్పాలిన్లను అందించకపోవడం, ధాన్యాన్ని మిల్లులకు తోలేందుకు లారీలు కొరత ఉండడంతో ఆందోళన చెందుతున్నారు. - మోపిదేవి/చల్లపల్లి/ఘంటసాల/పెదపారుపూడి
‘మిచౌంగ్’ హెచ్చరికలతో పంటను కాపాడుకునేందుకు అవస్థలు
రాశులపై కప్పేందుకు టార్పాలిన్లు సరఫరా చేయని ప్రభుత్వం
మిల్లులకు తోలేందుకు లారీల కొరత..ఆందోళనలో రైతులు
మోపిదేవి మండలంలో..
పెదప్రోలు, కొక్కిలిగడ్డ, వెంకటాపురం, శివరామపురంలో యంత్రాలతో వరికోత, నూర్పిడిలు పదిరోజులుగా సాగుతున్నాయి. యంత్రాలతో నూర్పిడి చేసిన ధాన్యంలో తేమశాతం అధికంగా ఉండటంతో కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు. ఐదు రోజులుగా ఆరబెడుతున్నా ఎండలు సరిగా లేక ప్రభుత్వ నిబంధనల మేరకు ధాన్యంలో తేమశాతం తగ్గడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రాయితీపై టార్పాలిన్ పట్టాలు సరఫరా చేయకపోవటంతో అద్దెకు తెచ్చిన పట్టాలపైనే ధాన్యాన్ని ఆరబోస్తున్నారు.
కొనుగోలు నిబంధనలు సడలించాలి: టీడీపీ
ప్రతీ గింజనూ కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేస్తామని చెబుతున్న ప్రభుత్వం తేమశాతం పేరుతో రైతులను ఇబ్బందులు పెట్టడం సరికాదని టీడీపీ మోపిదేవి మండల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెదప్రోలు, కొక్కిలిగడ్డ గ్రామాల్లో రహదారుల వెంబడి ఆరబోసిన ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఐదురోజులుగా ధాన్యాన్ని ఆరబెడుతున్నామని కొను గోలు కేంద్రానికి వెళితే మరింత ఆరబెట్టాలని చెబుతున్నారని బాసు దోనేశ్వర రావు, మత్తి గోపాలరావులు టీడీపీ నాయకుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.
1318 రకాన్ని కొనుగోలు చేయని ప్రభుత్వం
ఆర్బీకేల ద్వారా విత్తనాలు తెచ్చి, సాగుచేసిన 1318 రకం వరి ఽధాన్యాన్ని ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయటం లేదని రైతులు చెబుతున్నారు. 20 ఎకరాల్లో సాగు చేసిన ఈ రకం ధాన్యాన్ని అమ్ముకోవ డానికి నిబంధనలు అడ్డుగా ఉన్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిబంధనలు సడలించి ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదు కోవాలని టీడీపీ మండల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలుగు రైతు జిల్లా అధికార ప్రతినిధి జి.శివరామకృష్ణ, తెలుగుయువత రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి రావి రత్నగిరి, కొక్కిలిగడ్డ సర్పంచ్ దిడ్ల జానకీ రాంబాబు, పార్టీ నాయకులు పుప్పాల ఏసు, చిరివేళ్ల పుల్లారావు, గరికపాటి రమేష్, కన కయ్య, జనార్దన్ ధాన్యాన్ని పరిశీలించిన వారిలో ఉన్నారు.
చల్లపల్లి మండలంలో..
ఇప్పటికే పలు గ్రామాల్లో యంత్రాలతో వరి కోతలు ప్రారంభమయ్యాయి. కొన్ని చోట్ల వరి కోతలు పూర్తి కాగా, కొంత పొలం వరి పనల మీద ఉంది. యంత్రాలతో ధాన్యం కోయించిన రైతులు ఆరబెట్టుకునే పనిలో ఉన్నారు. వర్షాలు కురిస్తే పనల మీద ఉన్న ధాన్యం తడిచే అవకాశముంది.
పెదపారుపూడి మండలంలో..
వారం నుంచి వరి కోతలు, మిషన్ కోతలు ప్రారంభించారు. దీంతో ఆరబెట్టిన ధాన్యాన్ని కాపాడుకోవటానికి రైతులు నానా అవస్థలు పడు తున్నారు. యంత్రంతో కోతలు కోసిన రైతులు ధాన్యాన్ని రోడ్ల మీద ఆరబెట్టు కున్నారు. ధాన్యాన్ని సరఫరా చేయడానికి లారీల కొరత ఉందని వెంటనే లారీ లను ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. శనివారం వెంట్రప్రగడ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తహసీల్దార్ నాగభూషణం పరిశీలిం చారు. కొనుగోలు కేంద్ర పరిధిలోన 40 కిలోమీటర్ల లోపు ఏ మిల్లు ఉన్నా, రైతులు వాళ్ల సొంత వాహనాల్లో పేర్లు నమోదు చేయించుకుని ధాన్యాన్ని విక్రయించుకోవాలని సూచించారు. రవాణా చార్జీలు ఇస్తామని తెలిపారు.
ఘంటసాల మండలంలో..
18,295 ఎకరాలకు 11,034 ఎకరాల్లో కోత కోశారు. 479 ఎకరాల్లో పనలపై ఉంది. యంత్రాలతో 300 ఎకరాల్లో కోత కోసిన పంట రాశులపై ఉంది. మిగిలిన పంటను కొంతమంది రైతులు పోగు చేసుకోగా, మరికొంతమంది విక్రయించుకున్నారు. శనివారం ఉదయం నుంచి పంటను పోగు చేసుకు నేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. తేమశాతంపై ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకపోవటంతో ధాన్యం విక్రయించుకునేందుకు ఇబ్బంది పడుతు న్నారు. ఆరబెట్టిన ధాన్యాన్ని కొనాలని డిమాండ్ చేస్తున్నారు.
తేమ శాతం నిబంధనల సడలింపు: ఏవో
తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ధాన్యం సేకరణకు తేమశాతం నిబం ధనలను సడలించినట్లు ఘంటసాల ఏవో కె.మురళీకృష్ణ తెలిపారు. యం త్రాలతో కోసి ఆరబెట్టిన ధాన్యాన్ని మిల్లర్లకు తరలిస్తామని, రైతులు ఆందోళన చెందొద్దని తెలిపారు. కుప్పలు తడవకుండా టార్పాలిన్లు కప్పు కోవాలని, నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని రైతులకు సూచించారు.