అభివృద్ధి రైలు.. ఆలస్యంగా..
ABN , First Publish Date - 2023-05-26T00:55:44+05:30 IST
బెజవాడ ఏ1 రైల్వేస్టేషన్ రీ డెవలప్‌మెంట్ డిజైన్లు ఓ పట్టాన ఖరారు కావట్లేదు. పలుమార్లు పరిశీలించినా రైల్వే అధికారులు పూర్తిస్థాయిలో సంతృప్తి చెందట్లేదు. దేశంలోనే రెండో అతిపెద్ద రైల్వే జంక్షన్‌గా ఉన్న విజయవాడలోని ఏ1 రైల్వేస్టేషన్‌ను దేశంలోని ఇతర రీ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుల కంటే ధీటుగా తీర్చిదిద్దాలని భావిస్తుండటమే ఈ జాప్యానికి కారణమని తెలుస్తోంది.

డిజైన్ల ఎంపిక విషయంలో అధికారుల మల్లగుల్లాలు
మెట్రోపాలిటన్ తరహాలో ప్రతిపాదనలు
సర్క్యులేటింగ్ ఏరియా పెంపుదలే సమస్య
స్టేడియం, పాత క్వార్టర్లు, పార్శిల్ ఆఫీసులు తరలిస్తేనే బెటర్
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : భారతీయ రైల్వేకు విజయవాడ డివిజన్ గుండెకాయ వంటిది. దీనిని దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు రీ డెవలప్‌మెంట్ డిజైన్లు భారీగా ఉండాలని యోచిస్తున్నారు. ఇందుకోసం అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రైల్వే రీ డెవలప్‌మెంట్ ప్రాజెక్టును రైల్వేస్టేషన్ విస్తరణలో భాగం చేయాలని చూస్తుండటంతో జాప్యం జరుగుతోంది.
మరో ప్లాట్‌ఫాం నిర్మిస్తే..
ప్రస్తుతం రైల్వేస్టేషన్‌లో మొత్తం పది ప్లాట్‌ఫాంలు ఉన్నాయి. అదనంగా మరో ప్లాట్‌ఫాం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. గూడ్స్ లైన్ల వద్ద అదనంగా ప్లాట్‌ఫాం అభివృద్ధి చేయాలన్న ఆలోచన చేయాలనుకుంటున్నట్టు సమాచారం. రైల్వేస్టేషన్ 6, 7 ప్లాట్‌ఫాంల వద్ద పాత రైల్వేస్టేషన్ భవనం ఉంది. ఈ భవనం దాదాపు శిథిలావస్థకు చేరింది. దశాబ్దం కిందటే ఈ భవనాన్ని కూల్చి వేయాలని నిర్ణయించారు. అప్పటి నుంచి అలాగే పెండింగ్‌లో ఉంది. ప్రమాదకర పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో కొన్ని కార్యాలయాలను ఖాళీ చేయించారు. రిటైనింగ్ రూమ్‌లు, షాపులను ఖాళీ చేయించారు. కాబట్టి స్టేషన్ రీ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో దీనిని పూర్తిగా తొలగించటం కానీ, కొత్త అధునాతన బహుళ అంతస్థుల సముదాయం కానీ ఏర్పాటు చేయవచ్చు. లేదంటే భారీ బహుళ అంతస్థుల కమర్షియల్ భవనాన్ని నిర్మించవచ్చు. ఇందులోనే హోటల్, రెస్టారెంట్లు, మాల్స్, సూపర్ బజార్లు, సినిమా థియేటర్లు తదితర వినోదప్రదమైన మల్టీప్లెక్స్ ఏర్పాటు చేయవచ్చు. ప్రస్తుతం తిరుపతి, నె ల్లూరు రైల్వేస్టేషన్ల రీ డెవలప్‌మెంట్ పనులు జరుగుతున్నాయి. ఇటీవలే విశాఖపట్నం రైల్వేస్టేషన్ పనులకు కూడా శ్రీకారం చుట్టారు.
ప్రస్తుతం ఇలా..
ప్రస్తుతం ప్రయాణికులు స్టేషన్‌కు వచ్చాకే టికెట్ బుకింగ్ చేసుకునే పరిస్థితి ఉంది. కొత్తవారికి రిజర్వేషన్ కౌంటర్లు ఎక్కడ ఉంటాయో కూడా తెలియదు. అండర్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేశారు. ఈ టికెటింగ్ ప్రక్రియ అంతా బయటే జరిగిపోతే ప్రయాణికులు స్టేషన్‌లోకి ప్రశాంతంగా వస్తారు. రైల్వే స్టేడియం, పాత క్వార్టర్లు, పార్శిల్ ఆఫీసులను తొలగిస్తే తప్ప స్టేషన్ రీ డెవలప్‌మెంట్‌కు పరిపూర్ణత రాదు.
ఇలా చేస్తే బెటర్
విజయవాడ రైల్వేస్టేషన్‌కు సర్క్యులేటింగ్ ఏరియా ఓ ప్రధాన సమస్య. దీనిని పెంచటానికి దశాబ్దకాలంగా రైల్వే అధికారులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కొంతమేర సఫలీకృతులైనా ఆశించిన విధంగా పూర్తికాలేదు. రీ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు సంబంధించి సర్క్యులేటింగ్ ఏరియా చాలా తక్కువ. దీనిని దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. సర్క్యులేటింగ్ ఏరియా లేకపోవటం సమస్యే. కానీ, ఈ ఏరియాను పెంచుకోవడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. రైల్వేస్టేషన్ ముందు స్టేడియం ఉంది. దీనిని ఆనుకుని పాత క్వార్టర్స్ ఉన్నాయి. వీటిని వేరే చోటకు మారిస్తే సర్క్యులేటింగ్ ఏరియా పెరుగుతుంది. వీటిని తరలించే విషయంలో రైల్వే అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. కీలక నిర్ణయం తీసుకోలేకపోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే రైల్వే స్టేడియాన్ని స్వల్పంగా కుదించి రోడ్డును అభివృద్ధి పరిచారు. ఆర్టీసీ బస్సులు ఆగటానికి బస్టాపులు ఏర్పాటు చేశారు. అయితే, ప్రయాణికులు రోడ్డు దాటి రైల్వేస్టేషన్‌లోకి రావటం ఇబ్బందికరంగా మారుతోంది. సత్యనారాయణపురంలో రైల్వే భూములు చాలానే ఉన్నాయి. స్టేడియాన్ని అక్కడికి త రలించవచ్చు. పాత క్వార్టర్స్‌ను కూల్చి సత్యనారాయణపురంలోని స్థలాల్లో కొత్తవి కట్టి ఇవ్వవచ్చు. ఈ పాత క్వార్టర్స్‌లో చాలావరకు ఎవరూ నివసించట్లేదు. అలాగే, పార్శిల్ ఆఫీసు, దాని పక్కనే ఉన్న పాత రైల్వే ఆఫీసులను కూడా తొలగించాల్సిన అవసరం ఉంది. అప్పుడు విశాలమైన గ్రాండ్ ఎంట్రీకి మార్గం ఏర్పడుతుంది. తుమ్మలపల్లి కళాక్షేత్రం రోడ్డుకు ఆనుకుని బుకింగ్ కౌంటర్లను ఏర్పాటు చేస్తే, అక్కడే టికెట్లు తీసుకుని లోపలికి రావచ్చు. కార్లు, వాహనాలపై వచ్చేవారు పార్కింగ్ చేసుకోవటానికి వీలుగా చోటు ఉంటుంది. ఈ దిశగా రైల్వే అధికారులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒకటి నుంచి పదో నెంబరు ప్లాట్‌ఫాం వరకు అతిపెద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జిని నిర్మించాలని చూస్తున్నారు. రైల్వేస్టేషన్ ముందు భాగంగా స్కై వాక్‌ను ఏర్పాటు చేసి, దానిని కొత్తగా ఏర్పాటు చేయాలనుకుంటున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జికి అనుసంధానం చేయవచ్చు.