పట్టాలిచ్చారు.. పొజిషన్‌ మరిచారు

ABN , First Publish Date - 2023-05-26T01:33:25+05:30 IST

బాపులపాడులో రెండో విడత ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేసి మూడు నెలలు అవుతోంది. ఇంత వరకు స్థలాలు చూపించలేదు. స్థలాల కేటాయింపులో తీవ్ర జాప్యం చేస్తుండడంతో లబ్ధిదారుల్లో అనుమానాలు రేకెత్తుతున్నాయి.

పట్టాలిచ్చారు.. పొజిషన్‌ మరిచారు
బాపులపాడులో పేదలకు రెండో విడత ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడానికి సేకరించిన భూమి

బాపులపాడులో రెండో విడత ఇళ్ల పట్టాలిచ్చి మూడు నెలలు..

ఇప్పటికీ కేటాయించని ఇళ్ల స్థలాలు..ఆందోళనలో లబ్ధిదారులు

హనుమాన్‌జంక్షన్‌, మే 25: బాపులపాడులో రెండో విడత ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేసి మూడు నెలలు అవుతోంది. ఇంత వరకు స్థలాలు చూపించలేదు. స్థలాల కేటాయింపులో తీవ్ర జాప్యం చేస్తుండడంతో లబ్ధిదారుల్లో అనుమానాలు రేకెత్తుతున్నాయి. మరో పక్క ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపఽథ్యంలో స్థలాలు చేతికి రావేమోనని భయడుతున్నారు. బాపులపాడు గ్రామంలో మొదటి విడత 630 మందికి ఇళ్ల స్థలాలు కేటాయించారు. నూజివీడు రైల్వేస్టేషన్‌ సమీపంలో 20 ఎకరాల రైతువారీ భూమిని కొనుగోలు చేసి అందులో పేదలకు స్థలాలు కేటాయించారు. అప్పుడే 300 మందికిపైగా అర్జీదారులు మిగిలారు. రెండో విడత ఇళ్లస్థలాల పంపిణీ కోసం మొదటి లేఅవుట్‌ సమీపంలోనే మరో 19.80 ఎకరాలు భూమిని కొనుగోలు చేశారు. ఆ భూమిలో 636 మందికి రెండో విడత స్థలాల పట్టాలు పంపిణీ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 22న బాపులపాడు మార్కెట్‌యార్డ్‌లో ఎమ్మెల్యే వంశీ మోహన్‌ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అధికారులు లేఅవుట్‌ను కాగితాల మీద మాత్రమే తయారు చేశారు. క్షేత్రస్థాయిలో ఇంకా సిద్ధం కాలేదు. సరిహద్దు రాళ్లు వేయడానికి సిద్ధంగా ఉంచారు. క్షేత్ర స్థాయిలో లేఅవుట్‌ సిద్ధం చేసి రాళ్లపై నెంబర్లు వేశాక లబ్ధిదారులకు కేటాయించిన నంబర్ల వారీగా పొజిషన్‌ చూపుతారు. ప్రక్రియ ఇంకా ఎంత కాలంలో పూర్తిచేస్తారన్నది అధికారులకే తెలియని పరిస్థితి ఉంది లేఅవుట్‌ను మౌలిక వసతులతో అభివృద్ధి చేయాలని లబ్ధిదారులు అధికారులను కోరుతున్నారు. మొదటి లేఅవుట్‌లో ఇంకా మౌలిక వసతుల అభివృద్ధిలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. లేఅవుట్‌లో విద్యుత్‌ దీపాలు మాత్రమే అభివృద్ధి చేశారు. రోడ్లు, తాగునీటి సౌకర్యం అభివృద్ధి చేయాల్సి ఉంది. ఇళ్ల నిర్మాణం వేగవంతంగా సాగించాలని లబ్ధిదారులపై అధికారులు ఒత్తిడి చేయడం కొసమెరుపు.

Updated Date - 2023-05-26T01:33:25+05:30 IST