అక్ర‘మార్కులు’

ABN , First Publish Date - 2023-03-19T00:59:33+05:30 IST

కృష్ణా యూనివర్సిటీ అధికారుల తీరు నానాటికీ వివాదాస్పదంగా మారుతోంది. తాజాగా డిగ్రీ, పీజీ కోర్సులు పూర్తిచేసిన వారికి మార్కుల జాబితాలు ఇప్పటివరకు అందజేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అక్ర‘మార్కులు’

ఆందోళనలో డిగ్రీ, పీజీ విద్యార్థులు

నిలిచిపోయిన క్యాంపస్‌ సెలక్షన్లు

సర్టిఫికెట్లు తయారుచేసే ఏజెన్సీ నిర్వాకమే

తాజాగా అదే ఏజెన్సీకి మళ్లీ కాంట్రాక్టు

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : కృష్ణా యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఏళ్ల తరబడి సర్టిఫికెట్లు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారు. పరీక్షల విభాగం ద్వారా డిగ్రీ, పీజీ కోర్సులు చదివే విద్యార్థులకు సంవత్సరాంతంలో మార్కుల జాబితాలు ఇవ్వాల్సి ఉండగా, ఆ దిశగా చర్యలు తీసుకోవట్లేదు. మార్కుల జాబితాలు సకాలంలో ఇవ్వకపోవడంతో యూనివర్సిటీలో పీజీ విద్యార్థులకు క్యాంపస్‌ సెలక్షన్‌ ప్రక్రియ నిలిచిపోయింది. అయినా యూనివర్సిటీ అధికారులు స్పందించడం లేదు.

రెండేళ్లుగా ఇదే తంతు

పరీక్షల విభాగంలో డిగ్రీ, పీజీ కోర్సులకు సంబంధించి ఏటా 20 వేలకుపైగా సర్టిఫికెట్లు ముద్రించి విద్యార్థులకు అందజేయాల్సి ఉంది. ఏపీ సీఈఎస్‌ఎస్‌ ద్వారా వీటిని అందించాల్సి ఉంది. గతంలో సూర్య కంప్యూటర్స్‌ అనే ఏజెన్సీ ద్వారా పరీక్షలకు సంబంధించిన వ్యవహారాలను నడిపేవారు. ఏడాదిన్నరగా ఈ ఏజెన్సీ సక్రమంగా పనిచేయట్లేదు. నెల రోజులుగా ఏజెన్సీకి కేటాయించిన గదులను తెరవలేదు. ఈ పనులు దక్కించుకున్న ఏజెన్సీ సక్రమంగా పనిచేయకపోవడంతో రెండేళ్లుగా ఆయా కోర్సులు చదివే విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా నిలిపివేశారు. యూనివర్సిటీలో పనిచేసే ప్రొఫెసర్లు, జిల్లాలోని వివిధ కళాశాలల యాజమాన్యాలు పదేపదే సర్టిఫికెట్ల విషయంపై అడిగినా పట్టించుకునే వారే లేకుండాపోయారు.

కొత్త పేరుతో పాత ఏజెన్సీకే కాంట్రాక్టు?

డిగ్రీ, పీజీ కోర్సుల పరీక్షా ఫలితాలు విడుదలైనా సర్టిఫికెట్లు ఇవ్వకుండా జాప్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. పాత ఏజెన్సీని రద్దు చేస్తున్నట్లుగా చూపి, మరో ఏజెన్సీ పేరును తెరపైకి తెచ్చారు. గతంలో కంటే రూ.1.70 లక్షలకు కాంట్రాక్టు మొత్తాన్ని పెంచారు. పాతవారికే కొత్త పేరుతో ఈ కాంట్రాక్టును కట్టబెట్టినట్లు సమాచారం. పరీక్షల విభాగంలో సర్టిఫికెట్లు ఇచ్చే పాత ఏజెన్సీ నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులకు సకాలంలో సర్థిఫికెట్లు రాక ఇబ్బందుల పాలయ్యారని కళాశాలల యాజమాన్యాల ప్రతినిధులు చెబుతున్నా యూనివర్సిటీ అధికారులు కొత్త పేరుతో పాత ఏజెన్సీకే సర్టిఫికెట్లు తయారు చేసే కాంట్రాక్టును అప్పగించారు.

సీఎం సభకు విద్యార్థులు.. ఆదివారం సెలవు రద్దు

సీఎం జగన్‌ తిరువూరులో ఆదివారం పర్యటించనున్నారు. సీఎం సభకు జనసమీకరణలో భాగంగా నూజివీడు పీజీ సెంటర్‌, చుట్టుపక్కల ప్రాంతాల్లోని కళాశాలలకు ఆదివారం సెలవు రద్దు చేశారు. ఆయా కళాశాలల్లోని విద్యార్థులను తిరువూరులో జరిగే సీఎం సభకు తీసుకురావాలని యూనివర్సిటీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. యూనివర్సిటీకి చెందిన ఓ కీలక అధికారి పనులను పక్కనపెట్టి మూడు, నాలుగు రోజులుగా సీఎం సభ ఏర్పాట్లను చూడటం గమనించదగ్గ అంశం. ఓ అడుగు ముందుకేసి ఆదివారం సెలవును రద్దు చేశారు. సీఎం సభ ఏర్పాట్ల పేరుతో ఆయా కళాశాలల నుంచి విరాళాలు పోగుచేసుకునే పనిలోనూ ఈ అధికారి బిజీగా ఉన్నట్లు యూనివర్సిటీలో పనిచేసే ప్రొఫెసర్లు, అధ్యాపకులు చెప్పుకొంటున్నారు. యూనివర్సిటీలో ఉన్న సమస్యలను పట్టించుకోని ఈ అధికారి సీఎం సభ కు మాత్రం జనసమీకరణ నిమిత్తం, అది కూడా విద్యార్థులను తరలించాలని ఆయా కళాశాలల యాజమాన్యాలను పరుగులు పెట్టిస్తుండటంతో ఈ అంశంపై సర్వత్రా చర్చ నడుస్తోంది.

Updated Date - 2023-03-19T00:59:33+05:30 IST