హద్దుదాటి..

ABN , First Publish Date - 2023-03-19T01:09:54+05:30 IST

ఆంధ్రలో ఇసుక దొరక్క అల్లాడిపోతుంటే టన్నులకొద్దీ ఇసుక.. వందలకొద్దీ లారీలను తెలంగాణకు అక్రమంగా తరలించేస్తున్నారు. కృష్ణానది, మునేటి పక్కన ఇసుకను అక్రమంగా తవ్వేస్తూ అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. ఈ అవినీతి తంతులో రాజకీయ నాయకులే ప్రధాన పాత్ర పోషిస్తుండగా, నెలవారీ మామూళ్లతో అధికారులు కూడా భాగస్వాములయ్యారు.

హద్దుదాటి..
పల్లగిరి నుంచి ఇసుక తీసుకెళ్తూ మధిరలో పట్టుబడిన ఇసుక లారీ

ఆంధ్ర సరిహద్దు దాటి తెలంగాణాకు..

వందలకొద్దీ లారీలతో హైదరాబాద్‌కు తరలింపు

రాజకీయ నాయకులే ప్రధాన పాత్రధారులు

అధికారులకు అందుతున్న మామూళ్లు

అధిక ధరలకు ఇసుక విక్రయాలు

నందిగామ : నందిగామ, జగ్గయ్యపేట ప్రాంతాల్లోని కృష్ణా, మునేరు నదుల నుంచి ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఇక్కడి నుంచి తెలంగాణకు భారీగా ఇసుకను అక్రమంగా తరలిస్తూ రూ.కోట్లు వెనకేసుకుంటున్నారు. నిత్యం 150 లారీల వరకూ ఇసుక ఖమ్మం, హైదరాబాద్‌ వెళ్తున్నాయి. ఓవర్‌ లోడ్‌తో దర్జాగా వెళ్తున్న ఈ ఇసుక లారీలకు ఆంధ్రా, తెలంగాణకు చెందిన అధికారులు రెడ్‌కార్పెట్‌ పరిచి మరీ స్వాగతం పలుకుతున్నారు. లోడింగ్‌ సమయం నుంచి అడుగడుగునా సహకరిస్తున్నారు. అధికార పార్టీ నాయకులు చేస్తున్న ఈ దందాతో కొందరు ప్రతిపక్ష నాయకులకు కూడా పరోక్ష సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది.

పదుల సంఖ్యలో లారీలు హైదరాబాద్‌కు..

మునేటిపై నందిగామ మండలం మాగల్లులో ఉన్న రీచ్‌తో పాటు పల్లగిరి, అంబారుపేటల్లోని అనధికార రీచ్‌ల ద్వారా నిత్యం 70 లారీల వరకూ ఇసుక అక్రమంగా తెలంగాణాకు వెళ్తోంది. ఈ లారీలు మధిర మీదుగా ఖమ్మం వెళ్తున్నాయి. కంచికచర్ల మండలం గని ఆత్కూరు రీచ్‌తో పాటు వత్సవాయి మండలం కన్నెవీడు నుంచి పెద్ద ఎత్తున ఇసుక హైదరాబాద్‌ వెళ్తోంది. లారీకి 50 టన్నుల వరకూ ఇసుకను తీసుకెళ్తున్నారు. హైదరాబాద్‌కు చేరే ఇసుక టన్నుకు రూ.2 వేల వరకూ ధర పలుకుతుండగా, ఖమ్మం వెళ్లే ఇసుకకు రూ.1,100 వసూలు చేస్తున్నారు. కోదాడ వద్ద కొందరు ప్రజాప్రతినిధులు లారీకి రూ.7 వేల వరకూ వసూలు చేస్తున్నట్లు తెలిసింది. అక్రమ ఆదాయానికి రుచి మరిగిన సదరు నేతలు టన్నుకు రూ.200 వరకూ ఇవ్వాలని డిమాండ్‌ చేసినట్లు తెలిసింది. దీంతో గిట్టుబాటు కాదని భావించిన ఇసుక అక్రమ రవాణాదారులు రూటు మార్చి ఖమ్మంవైపు వెళ్తున్నారు. పంపకాల్లో తేడాలు రావడమో లేదా వసూలు చేసే మామూళ్లతో అధికారులకు సంబంధం లేకనో ఇటీవల కోదాడ వద్ద పోలీసులు లారీలను పట్టుకుని భారీగా జరిమానా విధించారు. దీంతో అక్రమార్కులు తమ దందాకు అడ్డురాకుండా ఉండేందుకు అధికారులతో బేరాలు సాగిస్తున్నట్లు తెలిసింది. అధికారులు మెత్తబడిన తరువాత తిరిగి హైదరాబాద్‌కు మళ్లీ ఇసుకను అక్రమంగా తరలించేందుకు సిద్ధమవుతున్నారు.

అడ్డుకున్న తెలంగాణ బీజేపీ నాయకులు

ప్రస్తుతానికి నందిగామ మండలం జొన్నలగడ్డ నుంచి మధిర వైపుగా ఖమ్మంకు ఇసుక రవాణా అవుతుండగా, మరికొన్ని లారీలు వత్సవాయి, బోనకల్లు మీదుగా ఖమ్మం వెళ్తున్నాయి. అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో జరుగుతున్న ఈ అక్రమ దందాకు ప్రతిపక్ష పార్టీల నాయకులు, అధికారులు సహకరిస్తున్నారు. రెండు రాష్ట్రాలకు చెందిన ప్రజాప్రతినిధులు, పోలీసులు, రెవెన్యూ అధికారుల కనుసన్నల్లో మూడు పూలు, ఆరు కాయలుగా సాగుతున్న ఈ వ్యాపారానికి తెలంగాణా బీజేపీ నాయకులు అడ్డుకట్ట వేశారు. ఇసుక అక్రమ రవాణాపై నిఘా పెట్టిన బీజేపీ నాయకులు మధిర శివారులో బుధవారం అర్థరాత్రి కాపుకాసి లారీలను పట్టుకున్నారు. లారీలు ఆపిన నాయకులపై ఇసుక అక్రమార్కులు దాడి చేశారు. ఒకరికి గాయాలు కూడా అయ్యాయి. ఈ ఘటనతో అప్రమత్తమైన అక్కడి పోలీసులు, రెవెన్యూ, ఆర్‌టీఏ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని లారీలను స్వాధీనం చేసుకున్నారు. సదరు లారీలు పల్లగిరి వద్ద మునేటి నుంచి ఇసుక రవాణా చేస్తున్నట్లు లారీ డ్రైవర్లు చెప్పినట్లు తెలిసింది. ఇంత పెద్దయెత్తున జరుగుతున్న ఇసుక దందాలో స్థానిక అధికారులకు కూడా భాగస్వామ్యం ఉన్నట్లు తెలుస్తోంది. చెక్‌పోస్టులు ఏర్పాటుచేస్తే దీనిని అరికట్టే అవకాశం ఉన్నా అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు, మామూళ్ల వ్యవహారంతో అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవట్లేదు. ఇప్పటికైనా స్పందించి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుని ప్రకృతి సంపదను కాపాడాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - 2023-03-19T01:09:54+05:30 IST