డీ‘సెంటు’గా.. దోపిడీ..!

ABN , First Publish Date - 2023-09-15T00:40:57+05:30 IST

జగనన్న సెంటు పట్టాలు పేదలకు ఏమో కానీ పెద్దలకు మాత్రం కాసుల వర్షం కురిపిస్తున్నాయి. పేదలకు ఇళ్ల స్థలాల పేరుచెప్పి.. తెరవెనుక రూ.కోట్లు దండుకునే పనిలో పడ్డారు. రెండు జిల్లాల్లో యథేచ్ఛగా సాగుతున్న ఈ దోపిడీ చివరకు సీఎం పేషీకి చేరడంతో వైసీపీ పెద్దలు కూడా రంగంలోకి దిగి తమకూ వాటాలివ్వాలని ఒత్తిడి తెస్తున్నారు.

డీ‘సెంటు’గా..  దోపిడీ..!

ఒక పట్టా ల్యాండ్‌ సేకరణలో కమీషన్‌ రూ.8.51కోట్లు!

పేదలకు ఇళ్ల పేరుతో వైసీపీ పెద్దల వ్యాపారం

సూరంపల్లిలో 23 ఎకరాల సేకరణకు సన్నాహాలు

అక్కడ ఎకరా రూ.70 లక్షల నుంచి రూ.80 లక్షలు

కానీ, రూ.1.17 కోట్లు చెల్లించేందుకు ఫైలు సిద్ధం

భూ యజమానికి ఎకరాకు రూ.80 లక్షలు

మిగతా వైసీపీ పెద్దలు, అధికారులకు..

తుది ఆమోదం కోసం సీఎం పేషీకి చేరిన ఫైలు

గతంలోనూ ఇంతే..

(విజయవాడ-ఆంధ్రజ్యోతి) : వైసీపీ అధికారంలోకి వచ్చాక సెంటు పట్టా పథకాన్ని తీసుకొచ్చింది. దీంతో 2020లో ఉమ్మడి కృష్ణా జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున భూమిని సేకరించారు. భూసేకరణలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. రూ.50 లక్షలు విలువైన పొలాన్ని రూ.75 లక్షలకు కొని, అందులో ప్రజాప్రతినిధులు, అధికారులు రూ.లక్షల్లో కమీషన్లు తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. విజయవాడ చెంతనే ఉన్న ఓ నియోజకవర్గ ప్రజాప్రతినిధి సెంటు పట్టా పథకం ద్వారా సుమారు రూ.100 కోట్ల మేర లబ్ధి పొందారన్న ప్రచారం జరిగింది.

మళ్లీ మొదలు..

తాజాగా సెంటు పట్టా పథకానికి మళ్లీ భూసేకరణ చేస్తున్నారు. పేదలు చేసుకున్న దరఖాస్తులు భారీగా పెండింగ్‌లో ఉన్నాయని, వారందరికీ స్థలాలు కేటాయించాలని చెబుతూ భూసేకరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా గన్నవరం మండలంలోని సూరంపల్లి గ్రామంలో సుమారు 23 ఎకరాలను సేకరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఫేజ్‌-2 భూసేకరణలోనూ భారీ ఎత్తున ‘కమీషన్‌’ వ్యాపారం నడుస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈసారి ఏకంగా సీఎం పేషీ పెద్దలు కూడా కమీషన్లలో భాగస్వాములుగా మారారని సమాచారం.

ఎకరాకు రూ.37 లక్షలు కమీషన్‌

సూరంపల్లిలో ఓ బడా పారిశ్రామికవేత్తకు సుమారు 23 ఎకరాలు ఉంది. ఈ భూమిని జగనన్న సెంటు పట్టా కింద సేకరించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అక్కడ ఎకరా రూ.70 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు పలుకుతోంది. భూసేకరణకు తీసుకునే భూమి రూ.75 లక్షల వరకు ఉంటుందని అంచనా. కానీ, అధికారులు ఈ భూమికి ఎకరాకు రూ.1.17 కోట్లు చెల్లించేందుకు ఫైలు సిద్ధం చేశారు. చిత్రం ఏమిటంటే.. గతంలో సూరం పల్లిలోనే సెంటు పట్టా కోసం ఎకరాకు రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షలు మాత్రమే చెల్లించేందుకు అధికారులు బేరాలు చేశారు. కానీ, అనూహ్యంగా రెట్టింపు ధరను నిర్ణయించి ఫైలును సిద్ధం చేయడం గమనార్హం. ఈ మొత్తం వ్యవహారంలో స్థానిక ప్రజాప్రతినిధి సూత్రధారిగా వ్యవహరించినట్లు సమాచారం. స్థానిక రెవెన్యూ అధికారి మొదలు జిల్లాస్థాయి అధికారుల వరకు అందరికీ ఆయనే అనుసంధానకర్తగా వ్యవహరించి ఫైలును ముందుకు నడిపారు. ప్రస్తుతం ఈ ఫైలు తుది ఆమోదం కోసం సీఎం పేషీకి చేరింది.

సీఎం పేషీలో సీన్‌ మారింది

సీఎం పేషీలో ఫైలు ఆమోదాన్ని పెండింగ్‌లో పెట్టినట్టు సమాచారం. గతంలో సెంటు పట్టా భూసేకరణలో పెద్ద ఎత్తున కమీషన్ల వ్యాపారం నడిచిన నేపథ్యంలో ఈ ఫైలుపై సీఎం పేషీ పెద్దలు ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఎకరాకు భూయజమానికి చెల్లించేది రూ.80 లక్షలేనని వారి దృష్టికి వచ్చింది. మిగిలిన మొత్తాన్ని ఎకరాకు రూ.37 లక్షల చొప్పున 23 ఎకరాలకు రూ.8.51 కోట్లను కమీషన్ల రూపంలో లాగేస్తున్నారన్న విషయం తెలుసుకున్న సీఎం పేషీ.. వైసీపీ పెద్దలకు ఈ సమాచారాన్ని చేరవేసింది. దీంతో అప్రమత్తమైన వైసీపీ పెద్దలు కమీషన్‌లో సగం తమకు ఇచ్చి ఫైలును క్లియర్‌ చేయించుకోవాలని సూచించినట్లు సమాచారం. కంగుతిన్న సూత్రధారి.. వైసీపీ పెద్దలు అడిగినంత ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఫైల్‌ క్లియర్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

కమీషన్ల రూపంలో రూ.400 కోట్లు హాంఫట్‌

కృష్ణాజిల్లాలో జగనన్న సెంటు పట్టా పేరుతో పేదల ఇళ్ల స్థలాలకు భూసేకరణ చేపట్టారు. జిల్లావ్యాప్తంగా సుమారు 2.70 లక్షల మంది అర్హులైన లబ్ధిదారులను ఇళ్ల స్థలాల కోసం ఎంపిక చేశారు. వీరందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలంటే 4,216.89 ఎకరాలు అవసరం. ప్రభుత్వ భూమి సుమారు 2,496.80 ఎకరాలు అందుబాటులో ఉండగా, మిగిలిన 1,720.09 ఎకరాలు ప్రైవేట్‌ భూములను సేకరించాలని నిర్ణయించారు. ఇది అటు అధికార పార్టీ నేతలకు, ఇటు రెవెన్యూ అధికారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. 2019 ఎన్నికల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా భూముల ధరలు భారీగా పతనమయ్యాయి. జిల్లాలో ఎకరం ఒకప్పుడు కోటి రూపాయలు పలకగా, ప్రస్తుతం రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షలకు పడిపోయింది. కానీ, భూములు ఇచ్చేందుకు రైతులెవరూ ముందుకు రావడం లేదని సాకు చూపుతూ అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, అధికారులు కమీషన్ల దందాకు తెరదీశారు. రూ.50 లక్షలు చేసే భూమికి రూ.75 లక్షలు చెల్లిస్తామంటూ రైతుల్లో ఆశలు రేపారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ధర కన్నా మెరుగైన ధర వస్తుండటంతో రైతులూ సంతోషంగా భూములు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. ఇదే అదనుగా ఎకరాకు రూ.10 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు కమీషన్‌ రూపంలో లాగేశారు. కమీషన్ల రూపంలో ఉమ్మడి కృష్ణా జిల్లావ్యాప్తంగా సుమారు రూ.400 కోట్లు వైసీపీ పెద్దలు, రెవెన్యూ అధికారుల జేబుల్లోకి చేరడం గమనార్హం.

Updated Date - 2023-09-15T00:40:57+05:30 IST